iDreamPost

హ‌ర‌ర్ సినిమాల‌తో వ‌ణికించిన రామ్‌సే బ్ర‌ద‌ర్స్‌

హ‌ర‌ర్ సినిమాల‌తో వ‌ణికించిన రామ్‌సే బ్ర‌ద‌ర్స్‌

ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు రామ‌ల‌క్ష్మ‌ణుల్లా క‌లిసి వుండ‌డ‌మే అరుదు. ఐదుగురు పాండ‌వుల్లా మెల‌గ‌డం మ‌రీమ‌రీ క‌ష్టం. మ‌రి ఏడుగురు క‌లిసిమెలిసి ఉంటే వాళ్ల‌ని రామ్‌సే బ్ర‌ద‌ర్స్ అంటారు. సినిమా ప్ర‌పంచంలో లోభం, ద్వేషం, అసూయ‌, అహంకారం… ఇలా స‌మ‌స్త అవ‌ల‌క్ష‌ణాలుంటాయి. అలాంటి చోట ఏడుగురు అన్నీ చూసుకుంటూ 30 సినిమాలు తీశారు. భార‌తీయ హ‌ర‌ర్ సినిమాల‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్ల‌గా నిలిచారు. ప్రేక్ష‌కుల్ని వ‌ణికించారు. వాళ్ల‌లో పెద్దాయ‌న కుమార్ రామ్‌సే గురువారం చ‌నిపోయాడు. వాస్త‌వానికి త‌న త‌మ్ముళ్లు ఐదుగురు ఒక్కొక్క‌రే కాలం చేసిన‌పుడే ఆయ‌న పోయారు. ఇప్పుడు వెళ్లింది క‌ట్టె మాత్ర‌మే.

రామ్‌సే బ్ర‌ద‌ర్స్ తండ్రి ఫ‌తేచంద్‌ది లాహోర్‌. ఆయ‌న‌ది ఎల‌క్ట్రిక‌ల్ వ్యాపారం. విభ‌జ‌న త‌ర్వాత పిల్ల‌ల‌తో బొంబాయి చేరుకున్నారు. ల‌మింగ్ట‌న్ రోడ్డులో వ్యాపారం ప్రారంభించారు. కానీ ఆయ‌న్ని సినిమా పిలిచింది. 1954లో ష‌హీద్ భ‌గ‌త్‌సింగ్ తీశారు. ప్లాప్‌. త‌ర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఇంకో రెండు సినిమాలు, డిజాస్ట‌ర్‌. 1970 నాటికి దివాళా. ఏడుగురు కొడుకులు, తీర‌ని అప్పులు మిగిలాయి. కానీ కొడుకులే ఆయ‌న ఆస్తి. వాళ్ల‌కి సినిమాకి సంబంధించి అన్నీ తెలుసు.

పెద్ద కొడుకు కుమార్ ఆలోచించాడు. 1970లో వాళ్లు తీసిన న‌న్నేమున్నే ల‌డ్‌కీతీ సినిమాలో ఒక సీన్‌. పృద్వీరాజ్ క‌పూర్ దెయ్యం వేషంలో దొంగ‌త‌నం చేసి ముంతాజ్‌ని బెదిరిస్తాడు. ఆ సినిమా ఆడ‌లేదు కానీ , ఈ సీన్‌ని జ‌నం బాగా ఎంజాయ్ చేశారు. ప్రేమ‌లు, త్యాగాలు, ఏడుపులు ఇవే న‌డుస్తున్న కాలం. జ‌నానికి భ‌యం కావాలి. అంత‌కు ముందు బీస్‌సాల్‌బాద్‌, ఇంకా కొన్ని వ‌చ్చాయి కానీ గ్యాప్ ఉంది. ఎక్క‌డ పోయిందో అక్క‌డే సాధించాలి.

మైండ్‌లో స్క్రిప్ట్ సిద్ధ‌మైంది. డ‌బ్బులు లేవు. అప్పులు పుట్ట‌వు. ఇంట్లో ఉన్న ఆడ‌వాళ్ల బంగారం, విలువైన వ‌స్తువుల‌న్నీ అమ్మేసి జూదం ఆడాడు. ఆ రోజుల్లో సినిమా తీయాలంటే క‌నీసం ఆరు నెల‌లు, 30 ల‌క్ష‌లు కావాలి. ఉన్న‌ది 3.50 ల‌క్ష‌. డ‌బ్బులు అడ‌గ‌ని చిన్న న‌టుల్ని తీసుకున్నారు. ఇంట్లో వున్న ఆడ‌వాళ్లు ముస‌లివాళ్లు, పిల్ల‌లు అందరినీ రెండు బ‌స్సుల్లో ఎక్కించారు. కెమెరా, లైట్లు అన్నీ అప్పు తెచ్చుకున్నారు. మ‌హాబ‌లేశ్వ‌ర్‌లోని ఒక గ‌వ‌ర్న‌మెంట్ గెస్ట్‌హౌస్ అద్దెకు తీసుకున్నారు. రోజుకు 12 రూపాయ‌ల రెంట్‌తో 8 రూమ్‌లు. సెట్టింగ్ ఖ‌ర్చు లేదు. లోకేష‌న్ ఎక్క‌డ బాగుంటే అక్క‌డే షూటింగ్‌. కాస్టూమ్స్ ఖ‌ర్చు లేదు. న‌టులు త‌మ సొంత బ‌ట్ట‌లు తెచ్చుకున్నారు. 40 రోజుల్లో సినిమా రెడీ.

కుమార్ స్క్రిప్ట్‌, గంగూ కెమెరా, కిర‌ణ్ సౌండ్‌, కేశూ ప్రొడ‌క్ష‌న్‌, అర్జున్ ఎడిటింగ్‌, శ్యాంతో పాటు తుల‌సి రామ్‌సే డైరెక్ష‌న్‌. వంట మొద‌లు మిగ‌తా ప‌నులన్నీ ఇంట్లో వాళ్లు చేశారు. దోగ‌జ్ జ‌మీన్‌కే నీచే (1971) ఫ‌స్ట్ కాపీ రెడీ. ఎవ‌డు కొంటాడు?

ప‌బ్లిసిటీ లేక‌పోతే ప్ర‌యోజ‌నం లేద‌ని , అద్భుత‌మైన ఆడియో ట్రైల‌ర్ అర‌గంట సేపు త‌యారు చేయించి ఆల్ ఇండియా రేడియోలో వ‌దిలారు. ప్రేక్ష‌కులు వెయిటింగ్‌. నానా తిప్ప‌లు ప‌డి సొంతంగా రిలీజ్‌. హౌస్‌ఫుల్ బోర్డులు. ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్ 45 ల‌క్ష‌లు. తులం బంగారం 200 రూపాయ‌లు ఉండే రోజుల్లో 45 ల‌క్ష‌లు! కుమార్ జీవితంలో వెన‌క్కి తిరిగి చూడ‌లేదు. జాన‌ర్ మార్చుకోలేదు.

దోగ‌జ్ జ‌మీన్‌కే నీచే ఒక హ‌ర‌ర్ ల్యాండ్ మార్క్‌. 1973లో దీన్నే తెలుగులో జ‌గ‌మే మాయ అని కొంచెం మార్చి తీశారు. కుమార్ రామ్‌సే క‌థ‌లో కొత్త పాయింట్ ఏమీ లేదు. ఒకావిడ భ‌ర్త‌ని మోసం చేసి చంపేస్తుంది. అత‌ని కోటులో లాక‌ర్ కీ ఉండిపోవ‌డంతో శ‌వాన్ని బ‌య‌టికి తీస్తారు. అది జాంబిగా మారి ప‌గ సాధిస్తుంది. అప్ప‌ట్లో ఇది చాలా కొత్త‌.

కొద్దోగొప్పో తేడాతో రామ్‌సే బ్ర‌ద‌ర్స్ తీసిన అన్ని సినిమాలు ఇలాంటివే. సెకెండ్ గ్రేడ్ సినిమాలే అయినా , డ‌బ్బులొచ్చేవి. టికెట్ కొని భ‌య‌ప‌డే జ‌నాలు ఎప్పుడూ వుంటారు. 1980 త‌ర్వాత తీసిన సినిమాల్లో కొంచెం సెక్స్ క‌ల‌ప‌డం ప్రారంభించారు. మాస్ ప్రేక్ష‌కుల కోసం జిమ్మిక్స్‌. రామ్‌సే బ్ర‌ద‌ర్స్ గొప్ప‌త‌నం ఏమంటే వాళ్ల మీద హాలివుడ్ ప్ర‌భావం లేదు. నేటివిటి ఉన్న హ‌ర‌ర్ చిత్రాలు తీశారు.

రాంగోపాల్‌వ‌ర్మ కూడా చాలా తీశాడు కానీ, అవ‌న్నీ ఇంగ్లీష్ సినిమాల కాపీలు, నేటివిటి ఉండ‌దు.

79 నుంచి రామ్‌సే సినిమాలు చూడ‌డం ఓ హాబీ నాకు. ప్ర‌సాద్ అనే స్నేహితుడితో క‌లిసి అనంత‌పురం రాంచంద్రా టాకీస్‌లో చాలా చూశాను. అన్ని సెకెండ్ షోలే. భ‌య‌ప‌డుతూ సైకిల్‌పై ఇంటికెళ్ల‌డం అదో థ్రిల్‌.

రామ్‌సే బ్ర‌ద‌ర్స్ బ‌యోపిక్ రైట్స్ అజ‌య్‌దేవ‌గ‌న్ 2019లో కొన్నాడు. క‌రోనాతో సినిమా జ‌ర‌గ‌లేదు.

దెయ్యాలు, భూతాల‌పై న‌మ్మ‌కం లేనివాళ్లు కూడా హ‌ర‌ర్ సినిమాలు చూసి భ‌య‌ప‌డ‌తారు. అదే వాటి గొప్ప‌త‌నం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి