iDreamPost

“దిశ”ను వదలని వర్మ

“దిశ”ను వదలని  వర్మ

తనకు వర్క్ అవుట్ అవుతుందనిపిస్తే ఏ సబ్జెక్టుపైనైనా సినిమా తీసేందుకు రెడీ అయ్యే రామ్ గోపాల్ వర్మ తాజాగా దిశా ఘటనను ఆధారంగా చేసుకుని అదే పేరుతో సినిమా ప్రకటించడం చర్చకు దారి తీస్తోంది. నిజానికి వర్మ ఫామ్ కోల్పోయి ఏళ్ళు దాటింది. ఏదో హార్డ్ కోర్ ఫ్యాన్స్ తప్ప ఇతని మూవీ కోసం ఎవరూ ఎదురు చూడటం లేదు. ఎంత వివాదాస్పద విషయాలను తీసుకున్నా తన పేలవమైన టేకింగ్ తో డిజాస్టర్ కు తగ్గకుండా ఏది తీయడం లేదు. ఇప్పుడు దిశా టాపిక్ దొరికింది.

గత ఏడాది నవంబర్ లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దిశ సంఘటన ఆపై నిందితుల ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సెన్సేషన్ గా నిలిచింది. ఇప్పుడు ఇలాంటి తప్పులు చేసినవాళ్లు భయపడేలా సినిమా తీస్తానని వర్మ చెప్పడం చూస్తే ఇదెలా తీస్తాడో అని అనుమానం కలగడం సహజం. క్లైమాక్స్ లో ఎలాగూ పోలీసులు చేసే ఎన్కౌంటర్ తో ముగుస్తుంది కానీ అంతకు ముందు ఘటన జరిగిన క్రమాన్ని, ఆ దుర్మార్గులు వెటర్నరీ డాక్టర్ పై అత్యాచారం చేసిన విధానాన్ని ఖచ్చితంగా చూపించే తీరాలి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి కథతో సినిమా తీయడం అవసరమా అని అనిపించడం సహజం. చివరిలో ఇలాంటి తప్పు చేసినవాళ్లకు ఇలాంటి శిక్ష పడుతుందని ఎంత సందేశం ఇచ్చినా పైన చెప్పిన వ్యవహారమంతా షూట్ చేసి తెరపై చూపించడం సమర్ధనీయం కాదు. అయినా తాను అనుకున్నది తనకు తోచింది తీసుకుంటూ వెళ్లిపోయే వర్మ ఇది ఎవరు చెప్పినా వినే అవకాశం లేదు కానీ ఇలాంటి సినిమాలు స్వర్గానికేగిన బాధితులకు నిజమైన నివాళి అనిపించుకోవేమో.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి