iDreamPost

ముగిసిన రాజ్యసభ పోలింగ్‌ : అందరి దృష్టి ఆ నలుగురిపైనే..!

ముగిసిన రాజ్యసభ పోలింగ్‌ : అందరి దృష్టి ఆ నలుగురిపైనే..!

ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ కొద్దిసేపటి క్రితం ముగిసింది. మరికొద్దిసేపట్లో కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. ఐదు గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్‌లో పోటీపడిన ఐదుగురు అభ్యర్థులకు ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయన్నది తేలనుంది. మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీకే నాలుగు రాజ్యసభ సీట్లు గెలుచుకునే అవకాశం 100 శాతం ఉంది.

గెలుపుపై అటు వైసీపీలోనూ ఇటు టీడీపీలోనూ ఎవరికి ఎలాంటి ఉత్కంఠ లేదు. నాలుగు సీట్లు వైసీపీ అభ్యర్థులే గెలుస్తారని అందరికీ తెలిసిన విషయమే. అయినా రాజ్యసభ ఎన్నికలపై అటు రాజకీయవర్గాల్లోనూ ఇటు మీడియా, ప్రజల్లోనూ ఆసక్తి కలగడానికి కారణం ఆ నలుగురు. ఆ నలుగురు ఏ పార్టీకి ఓటు వేశారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏ ఎమ్మెల్యే ఏ పార్టీ అభ్యర్థికి ఓటు వేశారన్నది తెలియకపోయినా.. ఆయా పార్టీలకు వచ్చే ఓట్లును బట్టి వారు ఓటు వేశారా..? లేదా..? అన్నది వెల్లడవుతుంది.

టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మద్ధాళి గిరి, కరణం బలరామ కృష్ణమూర్తి, జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్‌లు ఏ పార్టీ అభ్యర్థికి ఓటు వేశారన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 175 ఎమ్మెల్యేలకుగాను మొత్తం 173 మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. ఏసీబీ అరెస్ట్‌ కారణంగా టీడీపీ ఎమ్మెల్యే అచ్చెంనాయుడు ఓటు వేయలేకపోయారు. కరోనా పాజిటివ్‌ వ్యక్తిని కలిసిన నేపథ్యంలో మరో టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉండడంతో ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు.

టీడీపీకి దూరంగా ఉంటున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్ధాళి గిరిలు ఉదయమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడో రెబల్‌ ఎమ్మెల్యే కరణం బలరాం మాత్రం తన ఓటు హక్కును వినియోగించుకోవడంలో సస్పెన్స్‌ను తలపించారు. సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్‌ ముస్తుండగా కేవలం 25 నిమిషాల ముందు కరణం ప్రత్యక్షమై తన ఓటును వేశారు. అప్పటి వరకూ ఆయన ఓటు వేస్తారా..? లేదా..? అసలు ఎక్కడ ఉన్నారు..? అనే ప్రశ్నలు అందరిలోనూ మెదిలాయి.

ముగ్గురు టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యేలతోపాటు, జనసేన ఎమ్మెల్యే రాపాక కూడా ఓటు వేశారు కాబట్టి.. ఏ అభ్యర్థికి ఏన్ని ఓట్లు వస్తాయో వేచి చూడాలి. టీడీపీ ఉన్న 23 మంది ఎమ్మెల్యేలలో ఇద్దరు ఓటు వేయలేకపోయారు. ఆ పార్టీ తరఫున 21 మంది ఓటు వేశారు. వీరిలో ముగ్గురు రెబల్‌ ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీ అభ్యర్థి వర్ల రామయ్యకు ఓటు వేస్తే 21 ఓట్లు వస్తాయి. లేదంటే 18 ఓట్లకే టీడీపీ పరిమితం అవుతుంది. వీరు టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యకు ఓటు వేశారా..? లేదా వైసీపీ అభ్యర్థులకు వేశారా..? అనేది మరికొద్ది సేపట్లో తేలనుంది. ఈ నలుగురు ఓట్లు ఎటు పడ్డాయన్న ఆసక్తి తప్పా.. రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్‌లో మరే ఆసక్తికర అంశం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి