iDreamPost

తొలిసారి రాజ్యసభలో అడుగెడుతున్న మల్లికార్జున ఖర్గే-కర్ణాటక,అరుణాచల్ ప్రదేశ్‌లలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం

తొలిసారి రాజ్యసభలో అడుగెడుతున్న మల్లికార్జున ఖర్గే-కర్ణాటక,అరుణాచల్ ప్రదేశ్‌లలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం

ఉత్తరాదిన రాజ్యసభ ఎన్నికలు సెగలు పుట్టిస్తూ ఉండగా దక్షిణాదిన కర్ణాటక రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి.గుజరాత్,రాజస్థాన్ రాష్ట్రాలలో ఎమ్మెల్యేల హార్స్ ట్రేడింగ్‌కు ప్రయత్నిస్తున్న బిజెపి తాము అధికారంలో ఉన్న కర్ణాటకలో మాత్రం ఆ ప్రయత్నాలు చేయకపోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు నామినేషన్‌ల ఉపసంహరణ గడువు శుక్రవారంతో ముగిసింది.ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ (జెడిఎస్),మాజీ కేంద్ర మంత్రి మల్లికార్జున ఖర్గే (కాంగ్రెస్)లతో పాటు ఇద్దరు బిజెపి అభ్యర్థులు ఈరణ్ణ కడాడి,ఆశోక్ గస్తి నామినేషన్‌లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి.

దీంతో ఈ నలుగురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న కర్ణాటక శాసనసభ కార్యదర్శి ఎం.కె.విశాలాక్షి ప్రకటించారు.

నాలుగు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నికలు కాబడ్డ 77 ఏళ్ల ఖర్గే రాజ్యసభకు ఎంపిక కావడం ఇదే తొలిసారి.ఇక 87 ఏళ్ల దేవేగౌడ 1996లో మొదటిసారి రాజ్యసభకు ఎన్నికైన సమయంలో 1 జూన్ 1996 నుండి 21 ఏప్రిల్ 1997 వరకు భారత ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.తాజా ఎన్నికతో ఆయన రెండోసారి రాజ్యసభలో ప్రవేశిస్తున్నారు.అగ్ర నాయకులైన ఖర్గే,దేవేగౌడ 2019 లోక్ సభ ఎన్నికలలో వరుసగా తుముకూరు మరియు గుల్బర్గా పార్లమెంటరీ నియోజకవర్గాల నుండి ఓడిపోయారు.

ఇద్దరు నాయకులతో పోలిస్తే తక్కువ రాజకీయ ప్రొఫైల్ ఉన్న ఇద్దరు బిజెపి అభ్యర్థుల రాజకీయ జీవితంలో రాజ్యసభకు ఎంపిక కావడం పెద్ద మలుపుగా చెప్పవచ్చు.బిజెపి అనుబంధ విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నేపథ్యం ఉన్న వీరిద్దరూ దశాబ్దాలుగా బిజెపి పార్టీ పటిష్టత కోసం గ్రామ స్థాయి నుండి పని చేశారు.వీరి సేవలను గుర్తించిన కేంద్ర నాయకత్వం కర్ణాటక బిజెపి శాఖ,ముఖ్యమంత్రి యడ్యూరప్ప సిఫార్సు చేసిన వారి పేర్లను పక్కనపెట్టి వీరిద్దరికీ అవకాశం కల్పించడం ఊహించని పరిణామం.
ఇక ఏదేమైనప్పటికీ రాజ్యసభ ఎన్నికలలో ఎమ్మెల్యేల బేరసారాలకు తావివ్వకుండా ప్రధాన రాజకీయ పక్షాలు అదనపు అభ్యర్థిని పోటీకి నిలబెట్టలేదు.అసెంబ్లీలో తమ బలం ఆధారంగా గెలవగలిగిన సీట్ల సంఖ్యకు మాత్రమే పోటీని పరిమితం చేయడంతో కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి.

అరుణాచల్ ప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నిక ఏకగ్రీవం:

అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి.ఆ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఏకైక రాజ్యసభ స్థానానికి బిజెపి అభ్యర్ధి నబమ్ రెబియా ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు.దీంతో ఈ నెల 19న రాజ్యసభ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేకుండా పోయింది.ఇక శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో నబమ్ రెబియా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు.

1996,2002 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు సార్లు నబమ్ రెబియా రాజ్యసభకు ఎన్నికయ్యారు.అలాగే అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా,క్యాబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు.
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 60 మంది కాగా అధికార బిజెపి పార్టీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.మిగతా ఎమ్మెల్యేలలో జెడియుకు ఏడుగురు,కాంగ్రెస్ పార్టీ,నేషనల్ పీపుల్స్ పార్టీకి చెరో నలుగురు,పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్‌కు ఒకరు,ముగ్గురు స్వతంత్రులు ఉన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి