iDreamPost

Raj Tarun : కుర్రహీరోకి మేల్కోవాల్సిన టైం వచ్చేసింది

Raj Tarun : కుర్రహీరోకి మేల్కోవాల్సిన టైం వచ్చేసింది

అప్పుడెప్పుడో ఉయ్యాలా జంపాలతో ప్రేక్షకుల దృష్టిలో పడ్డ కుర్ర హీరో రాజ్ తరుణ్ ఆ తర్వాత కుమారి 21ఎఫ్ తో యూత్ లోనూ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు. కానీ అదంతా మూన్నాళ్ళ ముచ్చటే అయ్యింది. 2017తో మొదలుపెడితే ఈ ఐదేళ్లలో ఏకంగా తొమ్మిది ఫ్లాపులతో ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టేశాడు. ఇటీవలే విడుదలైన స్టాండ్ అప్ రాహుల్ అయితే మారీ దారుణంగా వీకెండ్స్ లోనే కనీస వసూళ్లు రాబట్టలేక చతికిలపడింది. చాలా చోట్ల ప్రేక్షకులు లేక షోలు రద్దు చేశారు. కొన్ని సెంటర్స్ లో కరెంట్ బిల్లులు కూడా కిట్టుబాటు కాలేదు. రివ్యూలు, పబ్లిక్ టాక్ నెగటివ్ గా రావడంతో ఓసారి చూద్దామనుకున్న వాళ్ళు కూడా లేకుండా పోయారు.

కథల ఎంపిక ఎన్నో పొరపాట్లు చేస్తున్న రాజ్ తరుణ్ కు పెద్ద బ్యానర్లు అండగా ఉంటున్నప్పటికీ అవి సద్వినియోగం కావడం లేదు. రంగుల రాట్నంని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తే లవర్స్ ని దిల్ రాజు చెప్పుకోదగ్గ బడ్జెట్ ఇచ్చి మరీ ఖర్చు పెట్టారు. ఇద్దరి లోకం ఒకటే అయితే సిగ్గుపడే ఫలితం. ఇది కూడా రాజుగారి ప్రొడక్షనే. పోనీ థియేటర్ లో వర్కౌట్ కావడం లేదు కదాని ఒరేయ్ బుజ్జిని నేరుగా ఓటిటిలో రిలీజ్ చేశారు. సరే ఇంట్లోనే కదా చూసేదని వ్యూస్ ఎక్కువ ఇచ్చారు కానీ అదీ రొటీన్ గా సాగే కన్ఫ్యూజన్ ఫార్ములానే. ఇక పవర్ ప్లే అనే టైటిల్ తో ఒక మూవీ వచ్చిందన్న సంగతి కూడా గుర్తురానంత వేగంగా వెళ్లిపోయింది.

మాస్ టచ్ ఇచ్చిన అనుభవించు రాజా వల్ల నిర్మాత నష్టాలనే అనుభవించాడు. ఇక్కడ అన్ని పేర్లు పేర్కొనలేదు కానీ రాజ్ తరుణ్ బ్యాడ్ లక్ ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇవి కొన్ని మచ్చుతునకలు మాత్రమే. 2013 కెరీర్ మొదలుపెట్టిన రాజ్ తరుణ్ ప్రస్తుతం ఏ సినిమా చేస్తున్నాడన్న ఆసక్తి మీడియాలో కూడా లేదు. అభిమానుల సంగతి సరేసరి. ఈ యూత్ హీరో ఇప్పుడు స్టాండ్ అప్ కాదు వేక్ అప్ అవ్వాల్సిన టైం వచ్చింది. అసలు ఇన్నేసి డిజాస్టర్ల తర్వాత తన సినిమాలు థియేటర్లో వస్తున్నాయంటే అది అదృష్టమే. కానీ ఇది ఇంకెన్నాళ్లో సాగదు. ఒకప్పుడు తరుణ్, వరుణ్ సందేశ్ లాంటి వాళ్ళు ఇలా కనుమరుగైనవాళ్లే. రాజ్ తరుణ్ మరింత జాగ్రత్త పడాలి

Also Read : Samantha & Vijay Deverakonda Movie : సాఫ్ట్ జానర్ లో విజయ్ దేవరకొండ సినిమా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి