iDreamPost

మళ్లీ పార్లమెంట్​లో అడుగుపెట్టనున్న రాహుల్ గాంధీ!

  • Author singhj Published - 03:57 PM, Mon - 7 August 23
  • Author singhj Published - 03:57 PM, Mon - 7 August 23
మళ్లీ పార్లమెంట్​లో అడుగుపెట్టనున్న రాహుల్ గాంధీ!

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తన ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. దేశ ప్రధాని నరేంద్ర మోడీని ఇంటిపేరుతో దూషించిన కేసులో రాహుల్​కు రెండేళ్ల జైలు శిక్ష పడింది. ఈ నేపథ్యంలో రాహుల్​ గాంధీపై లోక్​సభలో వేటు పడింది. పరువు నష్టం కేసులో రాహుల్​కు సూరత్ ట్రయల్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో రాహుల్​పై అనర్హత వేటు తప్పలేదు. అయితే ఈ కేసులో ఇటీవలే రాహుల్​కు సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. అయినా కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ సభ్యత్వాన్ని కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించలేదు. దీనిపై కేంద్రంలోని అధికార బీజేపీ మీద హస్తం పార్టీ నేతలు విమర్శలకు దిగారు.

ఎట్టకేలకు రాహుల్ గాంధీ మళ్లీ లోక్​సభలో అడుగుపెట్టనున్నారు. ఆయన మీద వేసిన అనర్హతను ఎత్తివేసినట్లు లోక్​సభ సచివాలయం సోమవారం ప్రకటించింది. దీనికి సంబంధించి లోక్​సభ సెక్రటేరియట్ ఇవాళ ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలోని 10 జన్​పథ్​ దగ్గర కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. సభ్యత్వాన్ని పునరుద్ధరించడంతో రాహుల్ గాంధీ సోమవారం పార్లమెంట్ సమావేశాలకు హాజరు కానున్నారు. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మీద ఆగస్టు 8వ తేదీ నుంచి లోక్​సభలో చర్చ జరగనుంది.

మోడీ సర్కారుపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో రాహుల్ గాంధీ కూడా పాల్గొననున్నారు. కాగా, 2019లో పార్లమెంట్ ఎలక్షన్స్ సందర్భంగా మోడీ ఇంటి పేరును ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. దీని మీద గుజరాత్​లో కేసు కూడా నమోదైంది. ఇదే కేసులో ఈ సంవత్సరం మార్చి 23న సూరత్​లోని సెషన్స్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈ తీర్పు వచ్చిన 24 గంటల వ్యవధిలోపే ఆయన సభ్యత్వంపై లోక్​సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి