iDreamPost

ఏపీ బాటలోనే పంజాబ్.. ఇంటింటికీ రేషన్ పంపిణీ!

ఏపీ బాటలోనే పంజాబ్.. ఇంటింటికీ రేషన్ పంపిణీ!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుని తమ తమ రాష్ట్రాలలో అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని నాడు-నేడు, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్య వంటి పథకాలను తెలంగాణ ప్రభుత్వం తమ రాష్ట్రంలో కూడా అమలుచేస్తోంది. అలాగే ఈ మధ్య తమిళనాడు ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ తరహాలో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇప్పుడు తాజాగా పంజాబ్ లో కొత్తగా కొలువుదీరిన ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు ఆంధ్రప్రదేశ్ ను స్ఫూర్తిగా తీసుకుని ఇంటివద్దకే రేషన్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఘర్ ఘర్ రేషన్ యోజన పేరుతో లబ్ధిదారులు ఇంటివద్దకే రేషన్ పంపిణీ చేసే విధానాన్ని రూపొందిస్తున్నామని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ ప్రకటించారు.

ప్రజలు రేషన్ తీసుకోవడం కోసం ఒకరోజు సమయాన్ని వెచ్చించాల్సి వస్తోందని కిలోమీటర్ల మేర నడిచి వెళ్లి రేషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయని గుర్తించామని పంజాబ్ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇక ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రేషన్ పంపిణీ వ్యవస్థను తీసుకువచ్చింది. దేశంలో మరెక్కడా లేని విధంగా రేషన్ పంపిణీ కోసం ప్రత్యేక వాహనాలు సిద్ధం చేసి ఇంటివద్దకే రేషన్ విధానాన్ని అవలంబించింది.. ఒకప్పుడు రేషన్ తీసుకోవాలి అంటే రేషన్ డీలర్ వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలో నిల్చుని తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఇంటివద్దకే రేషన్ సౌలభ్యం నిరుపేదలకు దక్కుతోంది.

ఇక ఈ ఇంటివద్దకే రేషన్ పంపిణీ కోసం 530 కోట్ల రూపాయల విలువ గల 9266 వాహనాలను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే నిజానికి ఈ పథకాన్ని చూసి ఢిల్లీలో కూడా ఈ పథకాన్ని ప్రవేశ పెట్టాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భావించారు. కానీ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అడ్డంకుల కారణంగా ఆ పథకం వెనక్కి వెళ్ళిపోయింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పథకాలను ఇతర రాష్ట్రాల వారు ఆదర్శంగా తీసుకుంటుంటే, ప్రతిపక్షాలు మాత్రం ఎప్పటిలాగే బురదజల్లడమే పరమావధిగా పని చేస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి