iDreamPost

చండీగఢ్‌ ఎవరిది.. రెండు రాష్ట్రాలు.. ఒకే పార్టీలో భిన్నస్వరాలు

చండీగఢ్‌ ఎవరిది.. రెండు రాష్ట్రాలు.. ఒకే పార్టీలో భిన్నస్వరాలు

పంజాబ్‌-హర్యానా రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌పై కాంగ్రెస్‌ పార్టీలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. తమదంటే తమదని ఆ రెండు రాష్ట్రాల కాంగ్రెస్‌ నేతలు పోటీపడుతున్నారు. చండీగఢ్‌ను పంజాబ్‌కు బదిలీచేయాలని కోరుతూ పంజాబ్‌లోని ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌) ప్రభుత్వం శాసనసభలో ఇటీవల తీర్మానం చేయడంతో ఈ వివాదం మొదలైంది. పంజాబ్‌లోని 27 గ్రామాలతో ఏర్పడిన చండీగఢ్‌ ఎప్పటికీ పంజాబ్‌కే చెందుతుందని పంజాబ్‌ కాంగ్రెస్‌ నేత నవ్‌జ్యోత్‌సింగ్‌ సిద్ధూ సోమవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

చండీగఢ్‌ ఎప్పటికీ హర్యానాకే చెందుతుందని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ(సీఎల్‌పీ) తీర్మానం చేసింది. ఢిల్లీలోని హర్యానా భవన్‌లో సీఎల్‌పీ నేత, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేంద్రసింగ్‌ హుడా అధ్యక్షతన సీఎల్‌పీ సమావేశమైంది. పంజాబ్‌ శాసనసభ తీర్మానాన్ని ‘రాజకీయ జిమ్మిక్కు’గా అభివర్ణించింది. ఈ విషయమై రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, గవర్నర్‌ను కలవాలని నిర్ణయించింది. చండీగఢ్‌ హర్యానాకే చెందినదని, షా కమిషన్‌ ఇప్పటికే చండీగఢ్‌ను హర్యానాకు ఇచ్చిందని భూపేంద్రసింగ్‌ చెప్పారు. నీరు, భూమి, రాజధాని వంటి వివిధ అంశాలలో వివాదాలు ఉన్నాయని, అయితే తమ మొదటి ప్రాధాన్యం నీటికేనని తెలిపారు. మరోవైపు ఇదే విషయమై హర్యానా కాంగ్రెస్‌ విభాగం అధ్యక్షురాలు కుమారి సెల్జా నాయకత్వంలో ఆ పార్టీ నేతలు చండీగఢ్‌లో సమావేశమయ్యారు.

సమావేశం అనంతరం సెల్జా మీడియాతో మాట్లాడుతూ పంజాబ్‌ శాసనసభ తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని,ప్రజలను తప్పుదోవ పట్టించేవిధంగా ఉందన్నారు. హిందీ మాట్లాడే 400 గ్రామాలను హర్యానా లో కలపాలని ఆ రాష్ట్ర నాయకులు కోరారు. పంజాబ్‌ శాసనసభ తీర్మానం చేసిన నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వం మంగళవారం శాసనసభ అత్యవసర సమావేశానికి పిలుపు ఇచ్చింది. కాగా, పంజాబ్‌కు హర్యానాతో ‘తదుపరి పెద్ద యుద్ధం’ నదీజలాలపై ఉంటుందని సిద్ధూ జోస్యం చెప్పారు.

పంజాబ్‌ నుంచి నదీజలాల వాటా పొందేందుకు సట్లేజ్‌-యమున లింక్‌(ఎస్‌వైఎల్‌) కాలువను పూర్తిచేయాలని ఇటీవల హర్యానా నేతలు డిమాండ్‌ చేసిన నేపథ్యంలో సిద్ధూ ఈ వ్యాఖ్యలు చేశారు. హర్యానా అసలు లక్ష్యం చండీగఢ్‌ కాదని, నదీజలాలేనని సిద్ధూ పేర్కొన్నారు. నదీ జలాల కోసం పెద్ద యుద్ధం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య అనేక దశాబ్దాలుగా ఎస్‌వైఎల్‌ కెనాల్‌ వివాదం ఉంది. రావి-బియాస్‌ నదీజలాలలో తమ వాటాను తిరిగి అంచనావేయాలని పంజాబ్‌ డిమాండ్‌ చేస్తుండగా, తమ వాటా నీటిని పొందడానికి ఎస్‌వైఎల్‌ కెనాల్‌ పూర్తిచేయాలని హర్యానా డిమాండ్‌ చేస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి