iDreamPost

Puneeth Rajkumar : స్ఫూర్తిని కొనసాగించమని వెళ్ళిపోయిన కన్నడ పవర్ స్టార్

Puneeth Rajkumar : స్ఫూర్తిని కొనసాగించమని వెళ్ళిపోయిన కన్నడ పవర్ స్టార్

రాష్ట్రం, బాష, ప్రాంతం తేడా లేకుండా తన హఠాన్మరణానికి యావత్ దేశం చలించిపోయేలా చేసిన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తుది వీడ్కోలు తీసుకున్నారు. కర్ణాటక ప్రభుత్వ లాంఛనాలతో ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై స్వీయ పర్యవేక్షణలో కుటుంబ సభ్యులు తుది కార్యాన్ని పూర్తి చేశారు. వాస్తవానికి ఉదయం 10.30 గంటల వరకు అంతిమ యాత్ర చేస్తారని తొలుత భావించినా పెద్ద కుమార్తె రాక కోసం ఇప్పటికే చాలా ఆలస్యం జరగడంతో త్వరగానే పూర్తి చేశారు. తెల్లవారుఝామునే ప్రత్యేక వాహనంలో పార్థీవ దేహాన్ని తరలించి ఆటంకాలు లేకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవడంతో యాత్ర ప్రశాంతంగా సాగింది.

పునీత్ వెళ్లిపోయారు.ఇక్కడితో అంతా అయిపోయిందనుకోవచ్చు. రేపటి నుంచి ప్రపంచం తన పనిలో తాను బిజీ కావొచ్చు. కానీ పునీత్ సమాజం మీద చూపించిన ప్రభావం మాత్రం శాశ్వతంగా నిలిచిపోతుంది. కేవలం ముప్పై సినిమాల వయసుతో తలలు పండిన స్టార్లు సైతం చేయలేని స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహించిన స్ఫూర్తి ఎందరినో నడిపిస్తుంది. సగం జీవితం కూడా చూడలేని పునీత్ ఇంకా ఎన్నో శిఖరాలు అధిరోహించాల్సి ఉంది. కన్నడ సినిమా స్థాయి ప్రపంచానికి తెలుస్తున్న తరుణంలో తానూ పాన్ ఇండియాలో భాగం కావాలని వేసుకున్న ప్రణాళికలు చెల్లాచెదురయ్యాయి. కానీ పునీతమైన జన్మ అందుకున్న ఇతని కన్నా భాగ్యవంతులు ఉంటారా.

చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ చలించిపోయారు. కర్ణాటకలో పునీత్ మరణాన్ని తట్టుకోలేక ఏకంగా నలుగురు కన్ను మూశారు. అందులో ముప్పై ఏళ్ళ యువకులు కూడా ఉన్నారు. గతంలో పునీత్ తన అభిమానులతో గడిపిన వీడియోలు సోషల్ మీడియాలో పరిచయం లేని వాళ్లకు కూడా కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. నేరాలు ఘోరాలు చేసే దుర్మార్గులు పూర్తి జీవితాన్ని చూస్తుంటే ఇలాంటి మంచివాళ్లను దేవుడు తీసుకెళ్లి పోవడం ఏమిటని ప్రముఖ నటుడు సృజన్ లోకేష్ బాధను వ్యక్తం చేయడం న్యాయమే. ఏది ఏమైనా ఒక శకం అర్ధాంతరంగా ముగిసింది. పునీత్ భౌతికంగా మాత్రమే వెళ్ళాడు. జన హృదయాల్లో మాత్రం ఎప్పటికీ సజీవమే

Also Read : Chiranjeevi Pays Homage : పునీత్ కోసం తల్లడిల్లుతున్న హృదయాలు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి