iDreamPost

31 ఏళ్ల రాజకీయ అనుభవం.. 35 ఏళ్ల యువ రాజకీయం.. హీట్ ఎక్కిస్తున్న యానాం ఎన్నికలు !

31 ఏళ్ల రాజకీయ అనుభవం.. 35 ఏళ్ల యువ రాజకీయం.. హీట్ ఎక్కిస్తున్న యానాం ఎన్నికలు !

ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉన్నప్పటికీ, మనకు సంబంధం లేని కేంద్ర పాలిత ప్రాంతంగా, పాండిచ్చేరి అసెంబ్లీలో ఒక భాగంగా ఉన్న యానాం రాజకీయాలు ఇప్పుడు మంచి హీట్ మీద కనిపిస్తున్నాయి. పాండిచ్చేరి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ఉన్న ఎన్. రంగస్వామి ఇక్కడ నుంచి పోటీ పడుతుంటే, ఆయనకు 35 ఏళ్ల యువకుడు గట్టి పోటీ ఇస్తున్నాడు.

యానాం దాదాపు ఆంధ్రప్రదేశ్ లో భాగమే. దీని ప్రభుత్వం పాండిచ్చేరిలో ఉన్నప్పటికీ, ఇక్కడ ప్రజలు అవసరాలు అన్నీ ఆంధ్ర తోనే ముడిపడి ఉంటాయి. ఇక బంధువులు బంధుత్వాలు సైతం ఆంధ్రప్రదేశ్లోని వారే. ఈ ప్రాంతం జనాభా దాదాపు 70 వేల వరకు ఉంది. ఓటర్లు 37,747 మంది ఉన్నారు. ఇక్కడ రాజకీయాల్లో పెనుమార్పులు ఎప్పుడూ ఉండవు. మల్లాడి కృష్ణారావు 1998 నుంచి నాలుగు పర్యాయలు వరుసగా ఎమ్మెల్యే గా, మంత్రిగా పని చేశారు. కాంగ్రెస్ లో ఉన్న ఆయన ఇటీవల తన పదవికి రాజీనామా చేయడంతో పాటు మరో సారి ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదని ప్రకటించారు. దీంతో పాండిచ్చేరి రాజకీయాల్లో కొత్త రాజకీయ శకం మొదలవుతుంది అని అంతా భావించారు.

అయితే అనూహ్యంగా మల్లాడి కృష్ణారావు ఎన్డీఏ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న ఎన్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్. రంగస్వామిని ఇక్కడి నుంచి పోటీకి దింపి, పూర్తి మద్దతు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ కు ఎక్కడి నుంచి పోటీ చేసేందుకు అనువైన అభ్యర్థులు దొరకలేదు. మొదట్లో ఎన్ రంగస్వామి ఏకగ్రీవంగా ఎన్నిక అవుతారని అంతా భావించారు. అయితే ఆయనకు అనూహ్యంగా 35 ఏళ్ల యువకుడు గొల్లపల్లి అశోక్ నుంచి పోటీ ఎదురు అవుతోంది. మొదట బిజెపి రెబల్ అభ్యర్థిగా అశోక్ ను అంతా భావించిన, తర్వాత అతడి జోరు పెరగటం తో ఇప్పుడు పోటీ తీవ్రం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Also Read : పరిషత్‌ ఎన్నికలకు సాయంత్రం నోటిఫికేషన్‌..?

అశోక్ తన ప్రచారంలో విద్యావంతులను యువకులను వెంటబెట్టుకొని ముందుకు కదలడం అందరినీ ఆకర్షిస్తోంది. అందులోనూ ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి, యువ నాయకత్వం కావాలి అని నినాదం తీసుకున్నారు. దింతో పాటు మల్లాడి కృష్ణారావు యానాం కు చేసిందేమీ లేదని, రాజకీయాల్లో ప్లేటు ఫిరాయించి ఇప్పుడు ప్రత్యర్ధులకు మద్దతు ఇస్తున్న కృష్ణారావు తో పాటు ఆయన మద్దతు తీసుకుంటున్న వారిని సైతం ఓడించాలని కోరుతున్నాడు. మంచి విద్యావంతుడు గా ఉన్న అశోక్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువకుడు కావడంతో ఇక్కడ ఉన్న తెలుగువారు, యువత నుంచి కూడా అతనికి మంచి మద్దతు లభిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ కు ఆనుకొని ఉండే యానాం ను ఆంధ్రలోని విలీనం చేయాలి అనే ప్రత్యేకమైన ఎన్నికల విధానంతో అశోక్ ముందుకు వెళ్తున్నాడు. దీంతో పాటు ముఖ్యమంత్రి అభ్యర్థి రంగస్వామి గెలిస్తే కేవలం పాండిచ్చేరికి మాత్రమే పరిమితం అవుతారని, యానాంను గాలికి వదిలేసినట్లేనని ఎన్నికల్లో చేస్తున్న ప్రచారానికి మంచి మద్దతు లభిస్తోంది. దీంతో పాటు కాంగ్రెస్ అశోక్ కు మద్దతు పలకడంతో సంప్రదాయ కాంగ్రెస్ ఓటర్లు సైతం అతడి వైపు చూస్తున్నారు. దీంతో ఇప్పుడిప్పుడే రంగస్వామి శిబిరంలో ఆందోళన నెలకొంది. స్వతంత్ర అభ్యర్థి ఇంత భారీ పోటీ ఇస్తారని రంగస్వామి వర్గం భావించలేదు. కృష్ణారావు మద్దతుతో చాలా సులభంగా యానాంలో గెలుస్తామని భావిస్తే, ఇప్పుడు కొత్త చిక్కులు ఎదురయ్యే అవకాశం కల్పిస్తున్నట్లు వారి ఆధ్వర్యంలో ఆందోళన కలిపిస్తోంది.

అశోక్ కు మరో రకంగా సామాజిక బలం కూడా సాయం చేస్తోంది. యానాం లో ఎక్కువగా ఉండే మత్స్యకారులు తర్వాత కాపులే అధికం. ఇక్కడ మెజారిటీ రెండో కులం కాపులే. కాపు సామాజిక వర్గానికి చెందిన అశోక్ కు కుల బలం తోడు అవుతోంది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన యువకులు యానం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కువగా కనిపించే కాపు ప్రభావం, ఇప్పుడు యానాం రాజకీయాలను సైతం ప్రభావితం చేసే పరిస్థితి కనిపిస్తోంది. అన్ని రకాలుగా సమాయత్తం అయిన అశోక్ ను నిలువరించేందుకు, ఏప్రిల్ ఆరో తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రంగస్వామి వర్గం అన్నీ అస్త్రశస్త్రాలను బయటకు తీస్తోంది. ముఖ్యంగా ఎలక్షన్ ఇంజనీరింగ్ లో పకడ్బందీగా వ్యవహరించి ఎన్నికల్లో గెలుపు సాధించాలని రంగస్వామి వర్గం వ్యూహాలు పన్నుతోంది. దీంతో యానం రాజకీయాల్లో ఇప్పుడు చాలా హాట్ హాట్ గా కనిపిస్తున్నాయి. పందెల జోరు భారీగా పెరిగింది.

Also Read`: కడలి తీరంలో రాజకీయ కాక!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి