iDreamPost

కడలి తీరంలో రాజకీయ కాక!

కడలి తీరంలో రాజకీయ కాక!

ఆంధ్రప్రదేశ్ లో భాగమై ఉన్నప్పటికీ మన రాష్ట్రంతో సంబంధం లేని యానాం ప్రాంత రాజకీయాలను ఇప్పుడు కాక పుట్టిస్తున్నాయి. దక్షిణాదిన శాసనసభ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం పాండిచ్చేరి లో భాగమై ఉండే ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1996 నుంచి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్న మల్లాడి కృష్ణారావు ఇటీవల రాజీనామా చేయడంతో పాటు, ఇక మీదట పోటీ చేయను అని చెప్పడంతో ఇక్కడ ఖాళీ ఏర్పడింది. దీంతోపాటు వెంటనే అసెంబ్లీ రద్దు కావడంతో పాటు ఎన్నికల కమిషన్ సైతం ఏప్రిల్ 6న ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది.

యానం ఎప్పుడూ ప్రత్యేకమే. ఇక్కడ సుమారు 80 వేల మంది జనాభా పై మాటే. ఓటర్లు సైతం 50 వేల వరకు ఉంటారు. ఫ్రెంచ్ వారి స్థావరంగా ఉన్న ఈ ప్రాంతం దేశానికి స్వాతంత్ర్యం అనంతరం ప్రత్యేక జిల్లా అయింది. 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, 6 రెవెన్యూ గ్రామాలుగా ఉండే ఈ ప్రాంతం తూర్పుగోదావరి కి ఆనుకొని కాకినాడ నుంచి వెళ్లేందుకు అనువుగా ఉంటుంది. పర్యాటక రంగం మీద ఎక్కువగా ఆధారపడే ఈ జిల్లా లో మత్స్యకారులు అధికం. సముద్రం మీద వేటకు వెళ్లి జీవించేవారు ఎక్కువగా కనిపిస్తారు. తెలుగు, తమిళం రెండు భాషలు మాట్లాడే ప్రజలు ఉండే ఈ ప్రాంతంలో రాజకీయాలు మాత్రం చాలా సాధారణంగా సాగుతాయి. ఇక్కడ ప్రజలు కొత్త వారిని ఎన్నుకునేందుకు, రాజకీయాలను ఎక్కువ ప్రాధాన్యంగా చూసేందుకు ఇష్టపడరు. దీంతో యానం జిల్లాగా ఏర్పడిన దగ్గర నుంచి చాలా తక్కువ మంది ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు.

1963లో యానాంలో మొదటి ఎన్నికలు జరిగాయి. కేవలం 4116 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎర్ర జగాంధారావు పోటీకి నిలబడితే, ఆయనకు ప్రత్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా కామిశెట్టి శ్రీ పరశురామ వరప్రసాదరావు నాయుడు నిలబడి ఏకంగా 2287 ఓట్లు సాధించి నెగ్గారు. స్థానికుడుగా అందరికీ సుపరిచితుడైన ఆయన తర్వాత కాంగ్రెస్ తరఫున 1964లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచినా ఆ పార్టీలో ఇమడలేక పోయారు. 1969, 74 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగానే గెలిచిన ఆయన 1977లో జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి 1980లో మరోసారి ఇండిపెండెంట్ గా, 1985లో కాంగ్రెస్ తరుపున గెలిచి రాజకీయాల నుంచి పక్కకు తప్పుకున్నారు. వరుసగా ఏడు సార్లు వరప్రసాదరావు నాయుడు యానాం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన తరువాత 1996లో మల్లాడి కృష్ణారావు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి గెలిచిన తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లి వరుసగా ఎన్నికవుతూ వస్తున్నారు. మధ్యలో 2000 లో జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రమే కాంగ్రెస్ తరపున షణ్ముగం ఎమ్మెల్యే అయ్యారు. కేవలం ఒక ఏడాది మాత్రమే ఆయన పదవిలో ఉండగాలిగారు.

తాజాగా మల్లాడి కృష్ణారావు శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో యానం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎవరు ఇక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఎన్ ఆర్ కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి రంగస్వామి బరిలో ఉంటారని తేలింది. 30 అసెంబ్లీ స్థానాలు ఉన్న పాండిచ్చేరి అసెంబ్లీలో ఎన్ఆర్ కాంగ్రెస్ 16 స్థానాల్లో పోటీ చేస్తోంది. బీజేపీ మద్దతుతో ఈసారి ఎలాగైనా పాండిచ్చేరిలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తున్న ఎన్డిఏ భాగస్వామ్య పక్షాలు మాజీ ముఖ్యమంత్రి రంగస్వామినీ యానాం నుంచి బరిలోకి దింపడం మేలు అనే భావనతో ఈ స్థానాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. వీరికి స్థానిక మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు మద్దతు, ఆశీస్సులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

పాండిచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 15 స్థానాల్లో పోటీ చేయాలని భావించిన కాంగ్రెస్ పార్టీకి యానం నియోజకవర్గం నుంచి ధీటైన అభ్యర్థి కనిపించలేదు. పలువురు నాయకులతో మంతనాలు జరిపి అక్కడ నుంచి పోటీకి ఉన్న మాజీ ముఖ్యమంత్రి రంగస్వామి ని నిలువరించాలి అంటే బలమైన అభ్యర్థిని నిలబెట్టాలి అని భావించినా కాంగ్రెస్ కు అక్కడ స్థానిక నాయకత్వం ఎవరు సహకరించలేదు. దీంతో చివరిగా తనకు కేటాయించిన 15 సీట్లలో 14 చోట్ల మాత్రమే అభ్యర్థులను ప్రకటించి యానాం లో పోటీ చేయడం లేదని కాంగ్రెస్ ప్రకటించింది.

ఇక్కడా బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కు తమ పార్టీ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి స్వతంత్ర అభ్యర్థి తో పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రచారంలో ముందుకు వెళ్తున్న సమయంలో మంచి ఆదరణ కనిపించడం, రంగస్వామి యానాం తో పాటుగా తట్టన్ చవిడీ నియోజకవర్గం నుంచి కూడా బరిలో ఉండటంతో యానాంకు రాజీనామా చేస్తారనే ప్రచారం తో ఇప్పుడు పొలిటికల్ హీట్ పెరిగింది. అందులోనూ స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ అశోక్ స్థానికుడు కావడంతో ఆయనకు మద్దతు పెరుగుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. మరోపక్క ప్రతిష్టాత్మక స్థానం కావడంతో ఎన్డీఏ పక్షాలు, ఇటు స్థానికత అనే మంత్రం ఇప్పుడు యానాం రాజకీయాల్లో కాక పుట్టిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి