iDreamPost

ప్రాజెక్ట్ K – చక్రంలో రహస్యం

ప్రాజెక్ట్ K – చక్రంలో రహస్యం

ప్రభాస్ హీరోగా ప్యాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందుతున్న సినిమా ప్రాజెక్ట్ కె. షూటింగ్ మొదలైనప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో వేగమందుకోలేదు. అయిదు వందల కోట్ల బడ్జెట్ తో వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఫాంటసీ థ్రిల్లర్ లో దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇతర కీలక పాత్రల్లో అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్ లాంటి సీనియర్లు ఉన్నారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ మీద ఇప్పటికే బోలెడు సినిమాలు వచ్చినప్పటికీ దీన్ని ఇంతకు ముందెన్నడూ చూడని ఒక సరికొత్త రీతిలో ప్లాన్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. దానికి తగ్గట్టే ఇవాళ స్క్రాప్ టు ప్రాజెక్ట్ కె పేరుతో విడుదల చేసిన వీడియో ఆసక్తి రేపుతోంది.

కథకు సంబంధించి లీకులు పెద్దగా లేకపోయినప్పటికీ కాల ప్రయాణం అన్నారు కాబట్టి ఈ మేకింగ్ వీడియోలో చూపించిన లారీ టైర్ లాంటి పెద్ద చక్రానికి స్టోరీకి ఏదో కనెక్షన్ ముడిపడి ఉంటుంది. ముప్పై ఏళ్ళ క్రితం ఈ తరహా థీమ్ తో ఆదిత్య 369 రూపంలో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించిన దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు ఇప్పుడీ బృందంలో ఉండటానికి కారణం అదే. డైరెక్టర్ నాగఅశ్విన్ ప్రాజెక్ట్ కెలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు పొందుపరుస్తున్నాడట. మహానటి బ్లాక్ బస్టర్ తర్వాత ఒకేసారి ఇంత పెద్ద స్కేల్ తో సినిమా చేయడం ఒక ఛాలెంజ్ అయినప్పటికీ టాలీవుడ్ గర్వంగా చెప్పుకునే అవుట్ ఫుట్ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నాడని వినికిడి

మరి ఆ చక్రం వాడితే గతంలోకి భవిష్యత్తులోకి వెళ్లేలా ఏమైనా సెట్ చేశారేమో చూడాలి. ప్రాజెక్ట్ కె 2024లో రిలీజయ్యే అవకాశాలున్నాయి. ఒకవేళ విజువల్ ఎఫెక్ట్స్ కనక ఆలస్యమైతే ఇంకో ఏడాది వాయిదా పడొచ్చు. ప్రభాస్ ప్రస్తుతం సలార్, మారుతీ సినిమాల షూటింగ్స్ లో సమాంతరంగా పాల్గొంటున్నాడు. ఆది పురుష్ ఎప్పుడో అయిపోయింది కాబట్టి దాంతో పని లేదు. ప్రాజెక్ట్ కె కాల్ షీట్లు ఇతర ఆర్టిస్టుల సమన్మయంతో ప్లాన్ చేసుకోవాలి. దానికి తోడు భారీ సెట్లు వగైరా వేస్తున్నారు. వైజయంతి బ్యానర్ స్థాపించి 2025 నాటికి యాభై ఏళ్ళు అవుతుంది. ఆ జ్ఞాపకంగా ఏదైనా ప్లాన్ చేసుకుంటే అభిమానుల ఇంకొంత ఎక్కువ ఎదురుచూడక తప్పదు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి