iDreamPost

మాన‌వ మ‌హావిషాద‌యాత్ర‌

మాన‌వ మ‌హావిషాద‌యాత్ర‌

Exodus- ఎక్స్‌డ‌స్ అంటే డిక్ష‌న‌రీ అర్థం దేశ త్యాగం. మ‌నుషులంతా తాము ఉంటున్న ప్రాంతాన్ని వ‌దిలి వేలు, ల‌క్ష‌ల్లో త‌ర‌లి వెళ్ల‌డం. మోజ‌స్ వెంట ఇలాగే యూదులు ల‌క్ష‌ల్లో త‌ర‌లి వెళ్లారు. ఎక్క‌డికి వెళుతున్నామో వాళ్ల‌కి తెలియ‌దు. ఒక దేశం కోసం, కాసింత నేల కోసం , బ‌త‌క‌డం కోసం వెళ్లారు. ఎర్ర‌స‌ముద్ర‌మే రెండుగా చీలి వాళ్ల‌కి దారి ఇచ్చింది.

కానీ నిన్న మొన్న మ‌నం పేప‌ర్ల‌లో, టీవీల్లో చూసినా మాన‌వ మ‌హాయాత్ర వేరు. వీళ్ల‌కి సొంత దేశం ఉంది, సొంత ఊరు ఉంది. కానీ బ‌తుకు కోసం ఎక్క‌డెక్క‌డికో వెళ్లారు. హ‌ఠాత్తుగా బ‌తుకు ఆగిపోయింది. ఆక‌లితో చావ‌లేక‌, ఉన్న‌చోట ఉండ‌నివ్వ‌రు కాబ‌ట్టి సొంత గ‌డ్డ కోసం వంద‌ల కిలోమీట‌ర్లు న‌డుస్తూ బ‌య‌ల్దేరారు.

పైన ఎండ‌, నెత్తీ మీద మూట‌లు, చంక‌లో బిడ్డ‌లు, క‌డుపులో ఆక‌లి….క‌నుచూపు మేర‌లో లేని గ‌మ్యం. కానీ న‌డిచారు. మ‌ట్టి పాదాల‌తో ఇంకా న‌డుస్తూనే ఉన్నారు. ఎవ‌రు వీళ్లంతా? ఢిల్లీలో ఉన్న ప్ర‌ధాని , రాష్ట్ర‌ప‌తి, మంత్రులు, దేశాన్ని న‌డిపించే యంత్రాంగం అంతా అక్క‌డే ఉంది. మ‌రి ఈ ల‌క్ష‌ల మంది ఉన్న‌ట్టు వాళ్ల‌కి తెలుసా?

మ‌నం ఉండే అపార్ట్‌మెంట్లు క‌ట్టేది వీళ్లే. ప‌ని చేసే ఆఫీసులు క‌ట్టింది వీళ్లే. ఫ్లైఓవ‌ర్లు, ఎక్స్‌ప్రెస్ ర‌హ‌దారులు వేసింది వీళ్లే. ఇటుక మీద ఇటుక ఎలా పేర్చాలో తెలియ‌ని వాళ్లంతా భ‌ద్ర‌మైన భ‌వంతుల్లో ఉన్నారు. నాగ‌రిక‌త‌ల‌ను నిర్మించిన వాళ్లు న‌డిరోడ్డు మీద ఎండ‌కు న‌డుస్తున్నారు.

గాలి వెలుతురు లేని షెడ్ల‌లో జీవిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ షెడ్ల నుంచి కూడా త‌రిమేశారు. కూలి డ‌బ్బులు ఎగ్గొట్టినా అడిగే దిక్కు లేదు. అన్ని రంగాల్లో క‌లిపి మ‌న దేశంలో ప‌ది కోట్ల మంది వ‌ల‌స కూలీలు ఉంటార‌ని అంచ‌నా. క‌రోనా కోసం క‌ఠిన చ‌ర్య‌లు అవ‌స‌ర‌మే, ఎవ‌రూ కాద‌న‌రు. హ‌ఠాత్తుగా ఈ జ‌నం ఏమై పోతారు, ఎలా బ‌తుకుతారు అని ఎవ‌రైనా ఆలోచించారా?

రోడ్డు మీద‌కొచ్చిన కుర్రాళ్ల‌ను శిక్షించ‌డం న్యాయ‌మే అయిన‌ప్పుడు , ఇంత మందిని రోడ్డుపాలు చేసిన కాంట్రాక్ట‌ర్ల‌ను అరెస్ట్ చేసి లాఠీల‌తో కొట్టాలా? వ‌ద్దా?

వాళ్ల‌కి ఏ శిక్షా ఉండ‌దు. ఎందుకంటే డ‌బ్బున్న వాళ్లు. కూలీల‌కు కార్మికుల‌కీ ద‌య‌తో జీతాలు ఇవ్వాల‌ని , క‌ట్ చేయ‌కూడ‌ద‌ని ప్ర‌ధాని కోరాడు. ద‌య‌తో ఎవ‌రైనా జీతాలు ఇస్తారా? త‌ప్ప‌ని స‌రి అయితే ఇస్తారు.

దేశ విభ‌జ‌న త‌ర్వాత ల‌క్ష‌ల్లో మ‌నుషులు త‌ర‌లి వెళ్ల‌డం ఇదే మొద‌టిసారి. ఎవ‌రినీ నిందించ‌కుండా, నిశ్శ‌బ్దంగా, భారంగా న‌డుస్తున్న గ‌ర్భిణీ మ‌హిళ‌లు, న‌డ‌వ‌లేక ఏడుస్తున్న చిన్న పిల్ల‌లు దారిలో ఎవ‌రైనా ఏదైనా ఇస్తే ఆబ‌గా అందుకునే చేతులు. ముస‌లి వాళ్ల‌ని తోపుడు బండ్ల‌లో తీసుకెళుతున్న వాళ్లు . శాప‌గ్ర‌స్తుల్లా, తెగిపోయిన గాలిప‌టంలా, ఎవ‌రు మోసం చేసినా త‌మ పాదాలు త‌మ‌ని మోసం చేయ‌వ‌నే న‌మ్మ‌కంతో న‌డుస్తున్న వాళ్లు.

నోట్ల ర‌ద్దు త‌ర్వాత కూలీ లేక , మొద‌ట ఆ భారాన్ని మోసింది వీళ్లే. క‌రువు వ‌స్తే మొద‌ట బ‌లి అయ్యేది వీళ్లే. క‌రోనా వ‌చ్చినా గుండెలు బ‌రువెక్కి ఆయాస ప‌డుతున్న‌ది వీళ్లే. టైటానిక్ మునిగిన‌ప్పుడు మొద‌ట చ‌నిపోయింది ఇంజ‌న్ కార్మికులే.

73 ఏళ్ల స్వాతంత్ర్యం త‌ర్వాత అభివృద్ధికి చెందిన గ్రాఫ్‌లు కాగితాల మీద క‌నిపిస్తున్నాయ్ కానీ, కంటికి క‌నిపించే గ్రాఫ్ ఈ మాన‌వ మ‌హా విషాద‌యాత్ర‌.

వాహ‌నాల‌కు దారి చూపించే GPS ఉన్నాయి కానీ,
జీవితానికి దారి చూపించే GPS ఎక్క‌డ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి