iDreamPost

మహిళలకు న్యాయం చేస్తా అన్న పవన్‌ నా విషయంలో మౌనంగా ఉన్నావెందుకు?: ప్రియ పొంగూరు

  • Published Aug 01, 2023 | 11:56 AMUpdated Aug 01, 2023 | 2:00 PM
  • Published Aug 01, 2023 | 11:56 AMUpdated Aug 01, 2023 | 2:00 PM
మహిళలకు న్యాయం చేస్తా అన్న పవన్‌ నా విషయంలో మౌనంగా ఉన్నావెందుకు?: ప్రియ పొంగూరు

ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి నారాయణపై ఆయన తమ్ముడి భార్య ప్రియ పొంగూరు సంచలన ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. పెళ్లైన రెండో రోజు నుంచే నారాయణ తనను లైంగికంగా వేధిస్తున్నారని.. తాను లొంగకపోయేసరికి.. తనను గత 29 ఏళ్లుగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాక తనకు పిచ్చి అంటూ తన భర్త సుబ్రహ్మణ్యం.. చేస్తోన్న వ్యాఖ్యలు నిరాధారమైనవి అన్నారు. ఈ క్రమంలో ఆమె నారాయణ వేధింపులకు సంబంధించి పోలీసులను ఆశ్రయించారు. కానీ ఇప్పటి వరకు పోలీసులు మాత్రం తనకు ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఇవ్వలేదని.. కేసు నమోదు చేయకుండా పోలీసుల మీద ఎవరో ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రియ పొంగూరు.

మహిళలకు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తాను అన్న పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు తన విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రియ పొంగూరు ప్రశ్నించారు. తాను జనసేన, పవన్‌ కళ్యాణ్‌ అభిమానిని అని గుర్తు చేసిన ప్రియా పొంగూరు.. తన విషయంలోనే పవన్‌ కళ్యాణ్‌ స్పందన ఇలా ఉంటే.. ఇక ఆయన సీఎం అయితే రాష్ట్రంలోని మహిళలకు ఏ విధంగా న్యాయం చేస్తారు.. వారిపై జరిగే అన్యాయాలను ఎలా అణచివేస్తారంటూ ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు. అంతేకాక నారాయణ తనపై చేస్తోన్న ఆరోపణలు అవాస్తవం అని.. ఇది నిరూపించడానికి తాను నార్కో టెస్ట్‌కు కూడా సిద్ధంగా ఉన్నానని.. మరి నారాయణ రెడీనా అంటూ ప్రియా పొంగూరు సవాల్‌ చేశారు.

నారాయణ వైద్యశాలలో సుప్రసిద్ధులైన మహిళా డాక్టర్లు చాలా మంది ప్రస్తుతం అక్కడ పని చేయడం లేదని.. వారంతా నారాయణ వేధింపులకు తాళలేక అక్కడ ఉద్యోగాలు మానేసి వెళ్లారని తెలపారు ప్రియ. ఇందుకు సంబంధించిన ఆధారాలన్ని తన దగ్గర ఉన్నాయని చెప్పుకొచ్చారు. వారి పేర్లు బయటపెట్టడం తనకు ఇష్టం లేదని అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి