iDreamPost

చెన్నైకి తొలి యువ దళిత మహిళా మేయర్

చెన్నైకి తొలి యువ దళిత మహిళా మేయర్

చెన్నై చరిత్రలో తొలిసారి పాలనాపగ్గాలు ఓ దళిత మహిళ చేతికి అందనున్నాయి. మేయర్ పదవి చేపట్టనున్న అతి పిన్న వయస్కురాలిగా కూడా ఆమె చరిత్ర సృష్టించనున్నారు. ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన అధికార డీఎంకే గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ను కూడా చేజిక్కించుకుంది నగరపాలక సంస్థలో 200 వార్డులు ఉండగా ఫిబ్రవరి 19న జరిగిన ఎన్నికల్లో డీఎంకే 153 స్థానాల్లో విజయం సాధించి అధికారం చేపట్టేందుకు సిద్ధం అయ్యింది. ప్రతిపక్ష ఏఐఏడీఎంకే కేవలం 15 వార్డుల్లో గెలవగా.. డీఎంకే మిత్రపక్షం కాంగ్రెస్ 13 సీట్లు చేజిక్కించుకుంది. పాలకవర్గం ఏర్పాటుకు సిద్ధమైన డీఎంకే తమ మేయర్ అభ్యర్థిగా తొలిసారి కౌన్సిలరుగా ఎన్నికైన ఆర్.ప్రియను ప్రకటించింది. మేయర్, ఉప మేయర్ ఎన్నికలు ఈ నెల నాలుగో తేదీన జరగనున్నాయి.

పిన్న వయస్కురాలు, మూడో మహిళ

చెన్నై కార్పొరేషన్ చరిత్రలో ఇంతవరకు ఇద్దరు మహిళలు తార చెరియన్, మీనాక్షి జయరామన్ మేయర్ పదవి నిర్వహించిన ఘనత పొందారు. ఆ వరుసలో మూడో మహిళగా నమోదు కానున్న ప్రియ దానికి అదనంగా 28 ఏళ్ల వయసులో ఆ పదవి చేపడుతున్న పిన్న వయస్కురాలిగా, తొలి దళిత మహిళగా రికార్డ్ సృష్టించనున్నారు. మున్సిపల్ ఎన్నికలకు ముందే చెన్నై మేయర్ పదవిని ఎస్సీ మహిళకు రిజర్వ్ చేయడంతో ప్రియకు ఈ అరుదైన అవకాశం దక్కింది. అదీ కాకుండా ఉత్తర చెన్నై ప్రాంతానికి మేయర్ పదవి లభించడం ఇదే తొలిసారి కావడం మరో విశేషం.

విద్యార్థి దశ నుంచీ డీఎంకేలో..

మున్సిపల్ ఎన్నికల్లో ఉత్తర చెన్నై ప్రాంతానికి చెందిన 74వ వార్డు మంగళపురం నుంచి తొలిసారి కౌన్సిలరుగా ఎన్నికైన ప్రియ తండ్రి ఆర్.రాజన్ డీఎంకేలో సీనియర్ కార్యకర్త. ఆ ప్రాంత డీఎంకే కమిటీ సహకార్యదర్శిగా పనిచేసేవారు. ఎం కామ్ చదివిన ప్రియ విద్యార్థి దశ నుంచి అంటే 18 ఏళ్ల వయసు నుంచే డీఎంకేలో కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం, అధికార పదవి పొందడం ఇదే తొలిసారి. పాలనపరంగా, రాజకీయంగా ఉత్తర చెన్నై ఏళ్లతరబడి నిర్లక్ష్యానికి గురైంది. తాగునీరు వంటి కనీస సౌకర్యాలు నోచుకోని ఈ ప్రాంతానికి చెందిన ప్రియకు మేయర్ పదవి లభించడం పట్ల ఆ ప్రాంతవాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి