iDreamPost

Presidential Election 2022: కాబోయే రాష్ట్ర‌ప‌తి ఎవ‌రు? తెర‌పైకి ఆ ఇద్ద‌రి పేర్లు

Presidential Election 2022: కాబోయే రాష్ట్ర‌ప‌తి ఎవ‌రు? తెర‌పైకి ఆ ఇద్ద‌రి పేర్లు

పార్టీల బ‌లాబ‌లాలు, వ్యూహాల లెక్క‌ల‌ను తెల్చే రాష్ట్రపతి ఎన్నికకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. ఈ ఎన్నికల ద్వారా భారతదేశ 16వ రాష్ట్రపతిని ఎన్నుకోబోతున్నారు. ఈ నెల 29 వరకు నామినేషన్ల‌కు గ‌డువు. జులై 18న ఎన్నికలు. జులై 21న కౌంటింగ్. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం జులై 24న ముగుస్తోంది. కొత్త రాష్ట్రపతి జులై 25న ప్రమాణస్వీకారం చేయ‌నున్నారు.

ఈసారీ బీజేపీ అభ్య‌ర్ధే రాష్ట్ర‌ప‌తి కావ‌డం ఖాయం. కాని ఎవ‌రిని రాష్ట్ర‌ప‌తి పీఠ‌మెక్కిస్తారు? ఇదే ఉత్కంఠ‌.
నూపుర్ శర్మ మొహమ్మద్ ప్రవక్త వ్యాఖ్యలపై అర‌బ్ దేశాలు భ‌గ్గుమ‌న‌డం, బీజేపీ లెక్క‌ల‌ను తారుమారు చేసింది. పాత స‌మీక‌ర‌ణాల‌న్నీ మారిపోయాయి. ఇప్పుడు కావాల్సింది అంద‌రినీ క‌లుపుకొనిపోయే శ‌క్తి బీజేపీకి ఉంద‌ని విదేశాల‌కు తెలియ‌చెప్ప‌డం. ఇప్ప‌టికే ద‌ళితనేత రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్ర‌ప‌తి అయ్యారు. మ‌రి గిరిజ‌న నేత‌ను దేశ ప్ర‌థ‌మ పౌరునిగా అంద‌లం ఎక్కిస్తారా? లేదంటే ఏకంగా ముస్లింను రాష్ట్ర‌ప‌తిగా చేస్తారా? ఇదీ లోతైన ప్ర‌శ్న‌.

ఇంతవరకు అధికారపక్షం కానీ, విపక్షాలు కానీ తమ అభ్యర్థిని ఖరారు చేయలేదు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి కాస్త ఓట్లు త‌క్కువ కానున్నాయి. వైఎస్ జ‌గ‌న్ క‌నుక మ‌ద్ద‌తిస్తే తేలిగ్గా గ‌ట్టెక్కుతుంది. ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ బీజేపీకి సానుకూల‌మే. క‌నుక రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఎలాంటి సంచ‌ల‌నాల‌ను ఆశించ‌న‌క్క‌ర్లేదు. అయినాస‌రే, వీలైనంత‌మేర‌ అనుకూల‌మైన‌ పార్టీల మద్దతును కూడగట్టే బాధ్యతను జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లకు పార్టీ అప్పగించింది. విపక్షాల తరపున ఆ బాధ్యతను మోసేది పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.

పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా, ర‌క్ష‌ణ మంత్రి రాజ‌నాథ్ సింగ్ లు ఎన్డీయే భాగ‌స్వాముల‌తోనేకాదు, యూపీఏ పార్టీలు, స్వ‌తంత్ర పార్టీల‌తోనూ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధి విష‌య‌మై చ‌ర్చించారు. త‌మతో మాట్లాడార‌ని కాంగ్రెస్ చెప్పింది. రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధి విష‌య‌మై అందరి అభిప్రాయాల‌ను తీసుకొంటున్నామ‌ని బీజేపీ అంటోంది. ఎలాంటి వివాదాలులేని, అంద‌రూ మెచ్చే నేత‌ను రాష్ట్ర‌ప‌తిగా ఎంపిక చేయాల‌న్న‌ది త‌మ అభిమ‌త‌మ‌న్న‌మ‌ది క‌మ‌ల‌నాధుల మాట‌.

18న భార‌త‌దేశ‌పు కొత్త రాష్ట్ర‌ప‌తి ఎవ‌రో తేలిపోతుందికాబ‌ట్టి, ఎన్నిక‌ల సెగ రాజ‌కీయ పార్టీల‌ను తాకుతోంది. త‌మ అభ్య‌ర్ధి ఎవ‌రో రెండు ప‌క్షాలు బైట‌పెట్ట‌డంలేదు. బీజేపీ అభ్య‌ర్ధి ప్ర‌క‌ట‌న త‌ర్వాత‌నే ఉమ్మ‌డి అభ్య‌ర్ది పేరును బైట‌పెట్టాల‌ని విప‌క్షాల వ్యూహం. మ‌హాత్మాగాంధి మన‌మ‌డు గోపాల్ కృష్ణ గాంధి (Gopal Krishna Gandhi) ఎన్సీపీ అధినేత శ‌రద్ ప‌వార్ (Sharad Pawar) పేర్లు గ‌ట్టిగా వినిపించాయి. గెలిచే అవ‌కాశంలేద‌ని తెలుసుకాబ‌ట్టి శ‌ర‌ద్ ప‌వ‌ర్ ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌న‌ని చెప్పేశారు. ఇక మిగిలింది గోపాల్ కృష్ణ గాంధి. ఆయ‌తోపాటు మ‌రోపేరుకూడా విప‌క్షాల చ‌ర్చ‌ల్లోకి వ‌స్తోంది. ఆయ‌నే నేష‌న‌ల్ కాన్ఫరెన్స్ అధినేత ఫారూఖ్ అబ్దుల్లా. దేశ‌వ్యాప్తంగా తెలిసిన పేరు. కాని ఆయ‌న పార్టీ కాశ్మీర్ కే ప‌రిమితం.

ఐఏఎస్‌, మాజీ దౌత్యవేత్తగా గోపాల్ కృష్ణ గాంధీకి మంచిపేరు ఉంది. గాంధీ భావ‌జాలం అవ‌స‌రం ఈ కాలంలో ఎక్కువ‌గా ఉందికాబ‌ట్టి, గాంధీ మ‌న‌మ‌డు అయితే, ఇండియా ఇమేజ్ పెరుగుతుంద‌న్న‌ది విప‌క్షాల వాద‌న‌. 2017లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గోపాల్‌ గాంధీ వెంకయ్యనాయుడిని స‌వాల్ చేశారు. కాని ఓడిపోయారు. ఇప్పుడు ప్రతిపక్షాలు, గోపాల్ కృష్ణ గాంధీతో సంప్రదింపులు చేశారు. కొంత సమయం కావాలని ఆయన కోరారు. ఒక‌వేళ ఆయ‌న సిద్ధ‌మంటే, బీజేపీ అభ్య‌ర్ధిని ఢీకొంటారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి