iDreamPost

ఫలితమివ్వని రాఘవేంద్ర మంత్రం – Nostalgia

ఫలితమివ్వని రాఘవేంద్ర మంత్రం – Nostalgia

స్టార్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినంత మాత్రాన ఇండస్ట్రీలో స్టార్ డం వస్తుందన్న గ్యారెంటీ లేదు. దాని వెనుక ఎంత కష్టం ఉంటుందో అంతకంటే ఎక్కువ సరైన కథలను ఎంచుకోవడంలో వాడాల్సిన లౌక్యం కూడా కావాలి. అది చూపించినప్పుడే కోరుకున్న విజయం కోరి మరీ వరిస్తుంది. బాహుబలి నుంచి పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల మార్కెట్ ని సృష్టించుకున్న ప్రభాస్ కెరీర్ ప్రారంభంలో చేసిన కొన్ని పొరపాట్లకు తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చింది. అదెలాగో చూద్దాం. పెదనాన్న కృష్ణంరాజు వారసుడిగా 2002లో డెబ్యూ చేసిన ప్రభాస్ కు ఈశ్వర్ రూపంలో మొదటి సినిమాకే మంచి హిట్టు దక్కింది.

అందులో మాస్ గెటప్ తో పాతబస్తీ కుర్రాడిగా తను చేసిన అల్లరి చూపించిన నటన ఫ్యాన్స్ కే కాదు ప్రేక్షకులకూ నచ్చింది. ఆ క్రమంలో పూర్తిగా ఒక కమర్షియల్ సబ్జెక్టు చేయాలనే ఉద్దేశంతో ఒప్పుకున్న చిత్రం రాఘవేంద్ర. రజినీకాంత్ బాషా, చిరంజీవి మాస్టర్ లాంటి అల్టిమేట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు సురేష్ కృష్ణతో ప్రభాస్ చేస్తున్నాడని ప్రకటించినప్పుడు అభిమానుల అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. పవిత్ర పుణ్య క్షేత్రం మంత్రాలయంలో సగ భాగం ఉంటుందని ముందే చెప్పడంతో పాటు టైటిల్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వడంతో బిజినెస్ పరంగా ట్రేడ్ లో మంచి డిమాండ్ ఏర్పడింది.

మన్మథుడు ఫేమ్ అన్షు, శ్వేతా అగర్వాల్ లను హీరోయిన్లుగా తీసుకోగా మణిశర్మ సంగీత దర్శకుడిగా లాక్ అయ్యారు. 2003 మార్చి 28న రాఘవేంద్ర భారీ ఓపెనింగ్స్ తో రిలీజయింది. సినిమా చూసిన ఆడియన్స్ కు షాక్. ఎలాంటి కొత్తదనం లేకుండా బాషా, ఇంద్ర ఫార్ములాని అటుఇటు తిప్పి దానికి మంత్రాలయం అనే బ్యాక్ డ్రాప్ జోడించి ఒక రొటీన్ స్టోరీని సురేష్ కృష్ణ తెరమీద చూపించిన విధానం వాళ్లకు నచ్చలేదు. విపరీతమైన కోపంతో ఫ్లాష్ బ్యాక్ లో, ప్రసన్నమైన చిత్తంతో ఫస్ట్ హాఫ్ లో ఇలా రెండు షేడ్స్ ని ప్రభాస్ బాగా చూపించినప్పటికి జనం రాఘవేంద్రను మెచ్చలేకపోయారు. దానికి తోడు కామెడీ ట్రాక్ లో అతి ఎక్కువై మిస్ ఫైర్ అయ్యింది. పాటలు మాత్రమే ఆదరణ పొందాయి. అదే రోజు రిలీజైన అల్లు అర్జున్ డెబ్యూ గంగోత్రి సూపర్ హిట్ కావడం ఫైనల్ ట్విస్ట్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి