iDreamPost

పవర్ స్టార్ ప్రయాణం – కెరీర్ గ్రాఫ్

పవర్ స్టార్ ప్రయాణం – కెరీర్ గ్రాఫ్

స్టార్ హీరోకు తమ్ముడో వారసుడో అయినంత మాత్రాన వాళ్లకూ అదే స్థాయి వస్తుందన్న గ్యారెంటీ లేని పరిశ్రమ ఇది. అంతటి అమితాబ్ బచ్చన్ లెగసీని అభిషేక్ బచ్చన్ క్యారీ చేయలేకపోవడం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. అల్లు అర్జున్ ఇమేజ్ శిరీష్ కి మొదట్లో కొంత ఉపయోగపడినా ఇప్పటికీ తను స్ట్రగుల్ అవ్వడం మర్చిపోకూడదు. ఇక్కడ టాలెంట్ ముఖ్యమైనా సరే మాస్ ని ఆకర్షించే ఒక అయస్కాంత శక్తి కథానాయకుడిలో ఉండాలి. యూత్ వెర్రెక్కిపోయి చూసే సమ్మోహనాన్ని తెరమీద ప్రదర్శించాలి. అప్పుడే హిట్టు ఫ్లాపు సంబంధం లేకుండా జనం నీరాజనం పడతారు. దానికి పవన్ కళ్యాణ్ ని మించిన ఉదాహరణ అక్కర్లేదు. నాకు డాన్సు రాదు నటన కూడా అంతంత మాత్రమే అని పబ్లిక్ గా ఒప్పుకున్న తర్వాత కూడా శిఖరమంత స్టార్ డం ని ఎంజాయ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ కెరీర్ సింహావలోకనం.

తొలి అడుగులు

1996. చిరంజీవి తమ్ముడు పరిచయం కాబోతున్నాడన్న వార్త ఒక సంచలనంగా మారింది. నాగబాబుతో పాటు నిర్మాతగా ఇతని పేరు ముగ్గురు మొనగాళ్లు లాంటి స్వంత సినిమాల్లో అభిమానులు చూసినప్పటికీ తెరమీద ఎలా కనిపిస్తాడన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఆ బాధ్యత తీసుకున్న అల్లు అరవింద్ తన బ్యానర్ మీద ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ద్వారా నెరవేర్చారు. ఖయామత్ సే ఖయామత్ తక్ స్ఫూర్తితో రూపొందిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ కాకపోయినా కళ్యాణ్ లో ఇంత ప్రతిభ ఉందా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది. 1997లో వచ్చిన మరో రీమేక్ ‘గోకులంలో సీత’ పెర్ఫార్మన్స్ పరంగా మంచి పేరే తీసుకొచ్చింది.

మలుపు తిప్పిన మైలురాళ్లు

1997లో వచ్చిన ‘సుస్వాగతం’ పవన్ లోని పరిణితి చెందిన నటుడిని పరిచయం చేయగా ‘తొలిప్రేమ’ సృష్టించిన సునామి దెబ్బకు యూత్ కు హాట్ ఫెవరెట్ గా మారిపోయాడు. ఎవరికి వారు తమను అందులో చూసుకునే పక్కింటి కుర్రాడు బాలు పాత్రలో పవన్ చూపించిన విశ్వరూపం హైదరాబాద్ లాంటి నగరాల్లో రెండు వందల రోజుల దాకా కలెక్షన్ల వర్షం కురిపించింది. 1999లో ‘తమ్ముడు’, 2000లో పూరి జగన్నాధ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ తీసిన ‘బద్రి’ రెండూ పవన్ ఇమేజ్ ని ఇంకో పది మెట్లు ఎక్కించినవే. 2001 ‘ఖుషి’ గురించి చెప్పడం అంటే ఒక పుస్తకమే అవుతుంది. పూనకాలు వచ్చినట్టు థియేటర్లలో జరిగిన జాతరకు యూత్ మాస్ హిస్టీరియా అంటే ఏంటో ఇండస్ట్రీ మొత్తానికి తెలిసివచ్చింది. అన్నను మించేలా ఉన్నాడే అన్న కామెంట్లు కూడా వచ్చాయి

పాఠం నేర్పిన పొరపాటు

కేవలం ఏడు సినిమాల అనుభవంతో తన టాలెంట్ ని నమ్ముకుని దర్శకత్వం చేయాలన్న ఆలోచనకు శ్రీకారం చుట్టిన 2003 ‘జానీ’ కెరీర్ మొత్తంలో పవన్ నేర్చుకున్న ఖరీదైన పాఠంగా చెప్పొచ్చు. దీనికీ నిర్మాతగా అరవిందే నిలవడం విశేషం. మితిమీరిన విపరీతమైన అంచనాలతో వచ్చిన జానీ దారుణంగా బోల్తా కొట్టడంతో డిస్ట్రిబ్యూటర్లు వచ్చిన నష్టాల గురించి అప్పట్లోనే పెద్ద పెద్ద కథనాలు వచ్చేవి. ఆ తర్వాత గుడుంబా శంకర్(2004) కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు, బాలు(2005), బంగారం(2006), అన్నవరం(2006) కేవలం ఓపెనింగ్స్ లో మాత్రమే మేజిక్ చేసిన చిత్రాలు. కమర్షియల్ గా ఎక్కువ డ్యామేజ్ కాకపోయినా ఏదీ పవన్ రేంజ్ మూవీ కాదు.

త్రివిక్రమ్ చేయించిన జల్సా

అసలు పవన్ ని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో త్రివిక్రమ్ సరిగ్గా కొలతలు వేసి చూపించిన సినిమా జల్సా(2008). ఇండస్ట్రీ రికార్డులు సాధించకపోయినా దీనికి ముందు కలిగిన గాయాలతో పోల్చుకుంటే చాలా బెటర్ అనిపించేలా వచ్చిన రిజల్ట్ కి ఫ్యాన్స్ హ్యాపీ. రిలీజ్ టైంలో కన్నా టీవీ ఛానల్స్, ఓటిటిలో వచ్చినప్పుడు దీని రేంజ్ పెరిగిపోయి జనానికి ఇంకా బాగా రీచ్ అయ్యింది. తర్వాత కథ మళ్ళీ మొదటికే. కొమరం పులి(2010), తీన్మార్(2011), పంజా(2011) మూడు డిజాస్టర్లు బ్యాక్ టు బ్యాక్ పలకించాయి. మార్కెట్ అప్పటికప్పుడు డౌన్ కాకపోయినా ఎందుకిలా జరిగిందని హీరో కంటే అభిమానులే ఎక్కువ బాధ పడిన సమయం.

గబ్బర్ చేసిన మాయాజాలం

అలా ఫీలైనవాళ్ళ తరఫున ప్రతినిధిగా ఆలోచించిన దర్శకుడు హరీష్ శంకర్ తనదగ్గరకు వచ్చిన దబాంగ్ రీమేక్ ప్రతిపాదనను నో చెప్పకుండా దానికి కావాల్సిన మార్పులు చేర్పులు ఒక పవన్ ఫ్యాన్ లా అలోచించి గబ్బర్ సింగ్(2012) చేశాడు. దెబ్బకు బాక్సాఫీస్ రికార్డులు బద్దలయ్యాయి. ఇది కదా మేము చూడాలనుకున్న పవర్ ఫైర్ అని మళ్ళీ మళ్ళీ చూసిన అభిమానులు లక్షల్లో. ఆ వెంటనే కెమెరామెన్ గంగతో రాంబాబు(2012) రూపంలో చిన్న ఝలక్. పూరి జగన్నాధ్ ఆశించిన అవుట్ ఫుట్ ఇవ్వలేకపోయాడు. మళ్ళీ త్రివిక్రమ్ లైన్ లోకి వచ్చి అత్తారింటికి దారేది(2013) ఇస్తే అది రిలీజ్ కూడా ముందే పూర్తి సినిమా పైరసీ వచ్చినా కూడా రికార్డుల పరంగా కొత్త చరిత్ర సృష్టించింది.

అప్ అండ్ డౌన్

మరో రీమేక్ గోపాల గోపాల(2015) పర్వాలేదనిపించుకోగా సర్దార్ గబ్బర్ సింగ్(2016) ని పవన్ కెరీర్ లో బ్యాడ్ మూవీగా చెప్పడానికి సందేహించనక్కర్లేదు. మరో రీమేక్ కాటమరాయుడు(2017) యావరేజ్ ఫలితంతో సర్దుకోగా అజ్ఞాతవాసి(2018) ఇప్పటికీ మర్చిపోలేని పీడకలగా మిగిలిపోయింది. త్రివిక్రమ్ మొదటిసారి ఇలాంటి సినిమా ఎలా తీశాడా అని అనుకోని మూవీ లవర్ లేడు. మళ్ళీ మొన్న వకీల్ సాబ్(2021) తో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కేసిన పవన్ రాజకీయాల్లో ఉన్నప్పటికీ భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ ప్రాజెక్ట్, సురేందర్ రెడ్డితో సినిమా ఇలా నాన్ స్టాప్ తన అభిమానులను వరసగా అలరించేందుకు సిద్దపడ్డాడు. అందుకే అన్నది పవన్ ఇమేజ్ హిట్టు ఫ్లాపుతో సంబంధం లేని ఒక అతీతమైన స్టార్ డం. ఇది అంత సులభంగా వచ్చేది కాదు పోయేది అంతకన్నా కాదు.

Also Read : అభిమాని మాటల్లో పవన్ సినిమా – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి