Idream media
Idream media
మా చిన్నప్పుడు కరెంట్ ఉండేది కాదు. ఎప్పుడూ పవర్ కట్టే. ఈ కట్ ఒక్కోసారి సంతోషాన్ని, బాధని కలిగించేది. సంతోషం ఎప్పుడంటే రాత్రి ట్యూషన్లో కరెంట్ పోయినపుడు. బాధ ఎప్పుడంటే ఫస్ట్ షో సినిమాలో కరెంట్ పోయినపుడు.
థియేటర్లో కరెంట్ పోయినపుడు విజిళ్లు దద్దరిల్లేవి. విజిల్స్ వేస్తే కరెంట్ వస్తుందనుకునే అమాయకరాజులు. జనరేటర్లు లేని కాలం చీకట్లో బయటకు రావాలంటే భయం. వస్తే మళ్లీ మన బెంచీని గుర్తు పట్టలేం. ఇంకోడి సీట్లో కూచుంటే దెబ్బలాట.
అదృష్టం బాగుంటే కరెంట్ వచ్చేది. ఆనందంతో చప్పట్లు, విజిల్స్ , బొమ్మపడేది ఆపరేటర్ ఏం చేసే వాడంటే టైం కలసి రావడానికి మధ్యలో ఒక రీల్ లేపేసేవాడు. కంటిన్యూటీ అర్థం కాకపోయినా చూసేవాళ్లం, కృష్ణ ఫైటింగ్ సినిమాల్లో రీల్ అటూఇటూ తారుమారు చేసినా నో ప్రాబ్లం. కూచుంటే ఫైటింగ్, లేస్తే ఫైటింగ్. బక్కగా ఉన్న కృష్ణ అంత మంది రౌడీలని ఎలా కొట్టేవాడో అర్థమయ్యేది కాదు.
ఒక్కోసారి కరెంట్ వచ్చేది కాదు. దాంతో పాసులు ఇచ్చేవాళ్లు. అంటే మరుసటి రోజు రావాలన్నమాట. పాస్ అంటే సిగరెట్ పత్తా మీద థియేటర్ సీల్ ఉంటుంది. మేము చీకట్లో గేట్ కీపర్‌కి మస్కా కొట్టి ఖాళీ సిగరెట్ పత్తాలు ఇచ్చి సినిమా చూసిన రోజులు కూడా ఉన్నాయి.
సినిమా కోసం స్కూల్, ట్యూషన్, నిద్ర ఇలా ఎన్నెన్నో త్యాగం చేసేవాళ్లం. అసలు టెస్ట్ పుస్తకాల్లో ప్రశ్నలు కాకుండా సినిమా ప్రశ్నలు అడిగితే ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యేవాళ్లం.
ఉదాహరణకి కృష్ణా నటన గురించి నాలుగు వాక్యాలు రాయండని అడిగితే కృష్ణా ఏ సినిమాలోనైనా ఒకే రకంగా నటిస్తారనేది కరెక్ట్ ఆన్సర్. దానికి మళ్లీ నాలుగు వాక్యాలు ఎందుకు?
కొరడారాణి సినిమాలో జ్యోతిలక్ష్మి పాట ఏంటో చెప్పండి అని అడిగితే జ్యోతిలక్ష్మి డ్రస్ చూస్తాం గానీ పాట ఎవరు వింటారు? బేవకూఫ్ -ఇది ఆన్సర్. అయినా ఎల్ఆర్ ఈశ్వరి గొంతులో ఏది తెలుగో, ఏది తమిళమో అర్థమవుతుందా?
విఠలాచార్య సినిమాలో మాంత్రికుడు ముక్కమాల మాట్లాడే భాష ఏంటి?
మంత్ర భాషని అర్థం చేసుకునే శక్తే ఉంటే ఇన్ని చదువులు ఎవరు చదువుతాడు, ఒక మంత్రం వేసి నేర్చుకోమా?
మనం సంతోషంగా ఉండాలంటే మనలో అమాయకత్వం ఉండాలి. దాన్ని చంపేసుకుని దుఃక్కపడడం మనలోని లోపమే.!