iDreamPost

జ్యోతిక అద్భుత న‌ట‌న పొన్ మ‌గ‌ళ్ వందాల్‌

జ్యోతిక అద్భుత న‌ట‌న పొన్ మ‌గ‌ళ్ వందాల్‌

15 ఏళ్ల క్రితం వూటీ ద‌గ్గ‌ర జ్యోతి అనే ఒక అమ్మాయి ఇద్ద‌రు కుర్రాళ్ల‌ని కాల్చి చంపుతుంది. ఆమె సైకో కిల్ల‌ర్ అని, పిల్ల‌ల్ని కిడ్నాప్ చేసి చంపుతుంద‌ని పోలీసులు నిర్ధారించి వెతుకుతారు. ఎన్‌కౌంట‌ర్‌లో చంపేస్తారు.

15 ఏళ్ల త‌ర్వాత వెంబ (జ్యోతిక‌) అనే యువ లాయ‌ర్ ఆ కేసుని బ‌య‌టికి తీసి, జ్యోతి సైకో కిల్ల‌ర్ కాద‌ని, బాధితురాల‌ని నిరూపించ‌డానికి వాదిస్తుంది. అస‌లీ వెంబ ఎవ‌రు? ఏంటి క‌థ‌? ఇదే సినిమా.

సూర్య నిర్మించిన ఈ సినిమా థియేట‌ర్ల‌లో రిలీజ్ కాకుండా నేరుగా OTT ద్వారా అమెజాన్‌లో వ‌చ్చింది. జ్యోతిక‌, పార్తిబ‌న్‌, భాగ్య‌రాజా, ప్ర‌తాప్ పోత‌న్ లాంటి పెద్ద న‌టులున్న సినిమా థియేట‌ర్ వ‌ద్ద‌నుకుంది. క‌రోనా వ‌ల్ల థియేట‌ర్లు ఎప్ప‌టికీ తెరుస్తారో తెలియ‌దు. జ‌నం వ‌స్తారో లేదో తెలియ‌దు. రిస్క్ ఎందుక‌ని OTTలో వ‌దిలేశారు. దీనిపైన కొంత గొడ‌వ జ‌రిగినా వెన‌క్కి త‌గ్గ‌లేదు.

సినిమా విష‌యానికి వ‌స్తే జ్యోతిక న‌ట‌న అద్భుతం. అయితే టైటిల్స్‌లోనే ఇదో మ‌ర్డ‌ర్ ఇన్వెస్టిగేష‌న్ అని అర్థ‌మ‌వుతుంది. ఆ త‌ర్వాత ఉత్కంఠ త‌గ్గిపోయి క‌థ కోర్టు రూంకి ప‌రిమిత‌మ‌వుతుంది. చిన్న పిల్ల‌ల‌పై అత్యాచారాలు అనే Painfull Content కాబ‌ట్టి సినిమా ఎమోష‌న‌ల్‌గా ఉంటుంది.

ఒక స‌త్యాన్ని వెలికి తీయ‌డంలో ప‌డే బాధ‌లు, ఎమోష‌న్స్ జ్యోతిక పండించింది. భాగ్య‌రాజా ఎప్ప‌టిలాగే బాగా న‌టించారు. తండ్రి పాత్ర‌లో ఫ‌ర్‌ఫెక్ట్‌గా ఫిట్ అయ్యారు. పార్తిబ‌ర్ ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్‌గా , జ‌డ్జిగా ప్ర‌తాప్ పొత‌న్ న‌టించారు. ప్ర‌తాప్ పొత‌న్‌కి బాగా వ‌య‌సై పోయింది. గుర్తు ప‌ట్ట‌డానికి కొంచెం క‌ష్ట‌ప‌డాలి.

విల‌న్‌గా త్యాగ‌రాజ‌న్ (హీరో ప్ర‌శాంత్ తండ్రి) న‌టించారు. మగ‌పిల్ల‌ల్ని స‌రిగా పెంచాలి. ఆడ పిల్ల‌ల్ని జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌నే అంత‌ర్లీన సందేశంతో క‌థ న‌డుస్తుంది.

చంద్ర‌ముఖి వ‌చ్చే వ‌ర‌కూ జ్యోతిక‌ని గ్లామ‌ర్ హీరోయిన్‌గా చూడ‌డం ద‌ర్శ‌కుల లోపం. నిజానికి ఈ సినిమా అంతా జ్యోతిక‌నే వుంటుంది. క‌థ‌ని ముందుకు తీసుకెళ్ల‌డానికి మిగ‌తా పాత్ర‌లు వ‌చ్చి పోతూ వుంటాయి. సినిమాలో హీరో లేడు. అది కూడా జ్యోతిక‌నే.

పొన్ మ‌గ‌ళ్ వందాళ్ (విలువైన అమ్మాయి వ‌చ్చింది) టైటిల్ చూసి ఇదేదో ఫ్యామిలీ డ్రామా అనుకుంటాం. మ‌ర్డ‌ర్లు, కోర్టు వాద‌న‌లు వుంటాయ‌ని అనుకోం. ఒక‌సారి జ్యోతిక కోసం చూడొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి