iDreamPost

Ponguleti Srinivas Reddy: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బయోగ్రఫీ! KCRను ఢీకొట్టి.. కాంట్రాక్టర్‌ టూ కేబినెట్‌ మంత్రిగా!

  • Published Dec 07, 2023 | 2:53 PMUpdated Dec 07, 2023 | 4:56 PM

Ponguleti Srinivas Reddy Biography & Political Journey: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అని కేసీఆర్‌కే సవాలు విసిరిన నాయకుడు. 9 ఏళ్ల క్రితం రాజకీయాల్లోని లేని ఈ వ్యక్తి.. ఇప్పుడు ఎదురులేని శక్తిగా ఎలా మారారు. ఆయన పూర్తి పొలిటికల్‌ జర్నీ ఇప్పుడు చూద్దాం..

Ponguleti Srinivas Reddy Biography & Political Journey: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అని కేసీఆర్‌కే సవాలు విసిరిన నాయకుడు. 9 ఏళ్ల క్రితం రాజకీయాల్లోని లేని ఈ వ్యక్తి.. ఇప్పుడు ఎదురులేని శక్తిగా ఎలా మారారు. ఆయన పూర్తి పొలిటికల్‌ జర్నీ ఇప్పుడు చూద్దాం..

  • Published Dec 07, 2023 | 2:53 PMUpdated Dec 07, 2023 | 4:56 PM
Ponguleti Srinivas Reddy: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బయోగ్రఫీ! KCRను ఢీకొట్టి.. కాంట్రాక్టర్‌ టూ కేబినెట్‌ మంత్రిగా!

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. 9 ఏళ్ల క్రితం వరకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా.. నేరుగా ఎంపీగా పోటీ చేసి అప్పటి వరకు రాజకీయాల్లో పాతుకుపోయిన వారిని ఓడించి సంచలనం సృష్టించారు. అసలు ఎవరీ పొంగులేటి.. ఎందుకు ఈయనకు ఇంత ఆదరణ అని రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి.. చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకుంటూ.. ఒక పెద్ద కాంట్రాక్టర్‌ గా ఎదిగారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం అనే చిన్న గ్రామం నుంచి ఎదిగిన పొంగులేటి.. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ ముఖచిత్రంగా మారిపోయారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో.. ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. మరి ఒక సాధారణ రైతు బిడ్డ నుంచి.. ఈ రోజు కేబినెట్‌ మంత్రిగా పొంగులేటి ఎదిగిన తీరు.. ఆయన పొలిటికల్‌ జర్నీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..

1965 అక్టోబర్‌ 28న జన్మించిన పొంగులేటి.. 2013లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్థాపించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2014 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పోటీ చేసి.. సమీప ప్రత్యర్థి నామా నాగేశ్వరరావుపై దాదాపు 11 వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. ఆయన గెలవడంతో పాటు.. తన అనుచరుల్లో ముగ్గుర్ని ఎమ్మెల్యేలుగా వైసీపీ నుంచి గెలిపించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ లాంటి ఆంధ్ర ముద్ర ఉన్న పార్టీ నుంచి పోటీ చేసి.. ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులు గెలవడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. కానీ, ఆ తర్వాత పొంగులేటితో పాటు వారంతా.. అప్పటి టీఆర్‌ఎస్‌ లో చేరిపోయారు.

పొంగులేటి పార్టీలోకి వచ్చినా.. సిట్టింగ్ ఎంపీగా ఉన్నా ఆయనకు 2018లో టీఆర్‌ఎస్‌ టిక్కెట్టు ఇవ్వలేదు. అయినా కూడా ఆయన పార్టీకి విధేయంగానే ఉన్నారు. ఏ పదవి లేకపోయినా.. ఖమ్మం జిల్లా నుంచి టీఆర్‌ఎస్‌ కు పెద్ద దిక్కుగానే కొనసాగారు. అయితే.. 2018 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు పొంగులేటి వ్యతిరేకంగా పనిచేశారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. అందుకే పొంగులేటిని కేసీఆర్‌ దూరం పెడుతూ వచ్చారంటూ పుకార్లు వినిపించాయి. అయినా కూడా పొంగులేటి బీఆర్‌ఎస్‌ లోనే కొనసాగారు. కానీ, 2023 ఎన్నికల కంటే ముందు.. పొంగులేటి సంచలన ప్రకటనలు చేశారు. బీఆర్‌ఎస్‌ లోనే ఉంటూ.. కేసీఆర్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ సాధన ఆశయాలు నేరవేరడం లేదంటూ… బహిరంగంగానే వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు.

Ponguleti political journey

ఇలా పొంగులేటి వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ గా సాగిన పోరుకు.. కేసీఆర్‌ ముగింపు పలికారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారనే కారణంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. ఇక ఇక్కడి నుంచి జూలు విదిల్చిన సింహంలా పొంగులేటి రెచ్చిపోయారు. బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ అయిన తర్వాత పొంగులేటి కోసం బీజేపీ, కాంగ్రెస్‌ పోటీ పడ్డాయి. తమ పార్టీలో చేరాలంటే తమ పార్టీలో చేరాలని.. సంప్రదింపులు జరిపాయి. అన్ని విధాల ఆలోచించిన పొంగులేటి.. కాంగ్రెస్‌ లో చేరేందుకు నిర్ణయించుకుని.. ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. తన చేరిక సందర్భంగా ఖమ్మంలో ఏర్పాటు చేసిన సభ.. తెలంగాణ రాజకీయ చరిత్రలోనే అతి పెద్ద సభల్లో ఒకటిగా నిలిచిపోయింది.

Ponguleti political journey

ఇక అక్కడి నుంచి పొంగులేటి నేరుగా కేసీఆర్‌ ను టార్గెట్‌ చేస్తూ.. చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న పది సీట్ల నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనంటూ.. రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్‌ కే సవాలు విసిరారు. ఆ తర్వాత ఆయనపై ఐటీ దాడులు జరిగినా.. ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా పొంగులేటి హవా కనిపించేలా చేసుకున్నారు. చెప్పినట్లుగానే.. పాలేరు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ అభ్యర్థిని ఓడించి గెలవడంతో పాటు.. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ ను 9 స్థానాల్లో గెలిచేలా చేశారు. భద్రాచలం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలిచినా.. ఆయన కూడా పొంగులేటి అనుచరుడే అనే టాక్‌ వినిపిస్తోంది. నేడో రేపో ఆయన కూడా కాంగ్రెస్‌ లో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే.. ఎన్నికలకు ముందు చేసిన సవాలులో పొంగులేటి గెలిచినట్టే.

9 ఏళ్ల క్రితం కనీసం రాజకీయ నేపథ్యం లేకుండా పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చిన పొంగులేటికి.. అతి తక్కువ కాలంలో ఇంత ధైర్యం, తెగువ, ముఖ్యమంత్రి స్థాయి ఎదిరించి నిలిచే మొండితనం ఎలా వచ్చిందనేది ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కని ప్రశ్న. ఇదే విషయం ఖమ్మం జిల్లా ప్రజల్ని అడిగినా, పొంగులేటి అనుచరులను అడిగినా.. ప్రజలతో ఆయన కలిసిపోయే తత్వం.. కష్టం అని ఎవరు తలుపు తట్టినా స్పందించే గుణం.. డబ్బు కంటే మనిషికి విలువిచ్చే ఆయన మంచితనమే.. ఇప్పుడు ఇలా ప్రజాధరణ రూపంలో దక్కుతుందని అంటున్నారు. పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అలియాస్‌ శ్రీనన్న అంటే.. పేరు కాదు.. ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ రాజకీయాల్లో ఒక బ్రాండ్‌ గా మారింది. శ్రీనన్నకు జనం బలమైతే.. జనానికి శ్రీనన్న బలం. మరి ఒక రైతు బిడ్డ.. ఈ రోజు మంత్రిగా మారడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి