iDreamPost

యానాంలో మాజీ సీఎంని మట్టికరిపించిన ఆ యువకుడు ఎవరు..?

యానాంలో మాజీ సీఎంని మట్టికరిపించిన ఆ యువకుడు ఎవరు..?

పుదుచ్చేరి అసెంబ్లీలో పాగా వేయాలని ఎన్డీయే కూటమి చేసిన ప్రయత్నాలు దాదాపు కొలిక్కి వస్తున్నట్టుగానే చెప్పవచ్చు. 30 అసెంబ్లీ స్థానాలున్న సభలో ఎన్నార్ కాంగ్రెస్ 10, బీజేపీ 5 చోట్ల విజయం సాదించాయి. దాంతో పీఠం దాదాపుగా ఖాయం అయ్యింది. అయితే యానాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ముఖ్యమంత్రి అభ్యర్థి , ఎన్నార్ కాంగ్రెస్అధ్యక్షుడు ఎన్ రంగస్వామి ఓటమి పాలయ్యారు. ఆయన తన సొంత నయోజకవర్గంతో పాటుగా యానాంలో కూడా బరిలో దిగడం కలిసి వచ్చింది. లేదంటే పుదుచ్చేరి పలితాలు కూడా ఆసక్తిగా మారే అవకాశం ఉండేది.

యానాంలో తొలిసారి ఎన్నికల బరిలో దిగిన గొల్లపల్లి అశోక్ శ్రీనివాస్ సాధించిన విజయం చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యంగా 25 ఏళ్లుగా యానాం అంటే మల్లాడి, మల్లాడి అంటే యానాం అన్నట్టుగా ముడిపడిన రాజకీయాల్లో యువకెరటం కొత్త చరిత్ర సృష్టించింది. వాస్తవానికి అశోక్ తండ్రి గొల్లపల్లి గంగాధర ప్రతాప్ 1990వ దశకంలో మల్లాడితో తలపడ్డారు రెండుసార్లు పోటీ చేసినా ఆయనకు ఓటమి తప్పలేదు. ఆ తర్వాత కాకినాడలో విద్యాభ్యాసం చేస్తూ రాజకీయ ఓనమాలు నేర్చుకున్న అశోక్ ఈసారి ఇండిపెండెంట్ గా బరిలో దిగారు కేవలం 30 ఏళ్ల వయసులో అసెంబ్లీ బరిలో సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రితో తలపడడం మామూలు విషయం కాదు. అయినప్పటికీ 656 ఓట్ల తేడాతో విజయం సాధించి యానాం రాజకీయాలు కొత్త మలుపు తిప్పారు.

యానాం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ పుదుచ్చేరి పొలిటిక్స్ లో మల్లాడి కృష్ణారావు చక్రం తిప్పేవారు. కానీ ఈసారి ఆయన కుటుంబ పరిస్థితుల కారణంగా పోటీ నుంచి తప్పుకున్నారు. ఆయన భరోసాతో రంగస్వామి యానాం బరిలో దిగారు. కానీ అనూహ్యంగా యువత , కాపు కులస్తులంతా మద్ధత పలకడం, మల్లాడికి బలమున్న మత్స్యకారుల్లో కూడా అసంతృప్తి ఛాయలు కనిపించడంతో ఎన్ రంగస్వామి స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు.

పుదుచ్చేరి అసెంబ్లీలో గొల్లపల్లి ఎలాంటి పాత్ర పోషించబోతున్నారన్నది ఆయన రాజకీయ భవితవ్యాన్ని నిర్ణయించబోతోంది చిన్న చిన్న పార్టీల ప్రభావం ఎక్కువగా ఉండే పుదుచ్చేరిలో భవిష్యత్ పరిణామాలు ఆసక్తిగా ఉంటాయనడంలో సందేహం లేదు. హోరాహోరీ పోరులో ఇండిపెండెంట్ గా బరిలో దిగిన గొల్లపల్లి విజయం యానాంలో నూతన చరిత్రకు శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్, సీపీఐ సహా మల్లాడి వ్యతిరేకులంతా గొల్లపల్లికి ప్రత్యక్ష, పరోక్ష మద్ధతు ప్రకటించడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి