iDreamPost

ఢిల్లీలో పోలింగ్ ప్రారంభం

ఢిల్లీలో పోలింగ్ ప్రారంభం

దేశ రాజధాని అయిన ఢిల్లీలో పటిష్ట భద్రత నడుమ పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా 190 కంపెనీల కేంద్ర పారామిలటరీ దళాలు, 42 వేల మంది పోలీసులను వినియోగిస్తున్నారు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు సాగుతున్న షహీన్ బాగ్ తోపాటు ఐదు పోలింగ్ కేంద్రాలను సున్నిత కేంద్రాలుగా గుర్తించారు.. 3141 పోలింగ్ కేంద్రాల్లో 144 కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించి అదనపు బలగాలతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేసారు.

మొత్తం 70 సీట్లకు జరిగే ఎన్నికల్లో 672 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 1.47 కోట్ల మంది ఓటర్లు ఓటేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీని వశం చేసుకోవాలని మోదీ, అమిత్‌ షా భావిస్తుండడంతో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. కేజ్రీవాల్‌ తన పరిపాలన, సంక్షేమ పథకాలపైనే ఆధారపడితే మోదీ, అమిత్‌ షా పూర్తిగా భావోద్వేగ అంశాలపైనే ఆధారపడి ప్రచారం చేశారు. తొలుత కేంద్రంలోని తమ పాలన, విజయాలను ఏకరువు పెట్టిన బీజేపీ… తరువాత పంథా మార్చి సీఏఏను ప్రధాన ప్రచారాంశం చేసింది. దీంతో ఈ ఎన్నికలు సీఏఏపై రెఫరెండమా… అన్న చర్చ జరుగుతోంది.

దీనికి తోడు- బీజేపీ తన సీఎం అభ్యర్థి ఎవరన్నది ప్రకటించకపోవడం కేజ్రీవాల్‌ సవాల్‌ విసరడానికి తావిచ్చింది. ఇక చెప్పుకోవడానికి త్రికోణ పోటీ అయినప్పటికీ కాంగ్రెస్‌ ప్రభావం పెద్దగాలేదు.

ఓటర్లు మోదీ తరహా భావోద్వేగాలను ఆదరిస్తారా, లేక సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తారా అన్నది తేలిపోతుంది.

కేజ్రీకే మళ్లీ ఢిల్లీ పీఠం ??

ఇక ఈ ఎన్నికలమీద ఇప్పటి వరకు వచ్చిన సర్వేలన్నీ మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని చెబుతున్నాయి.

ఇటీవల చేసిన సర్వేలో 45.4 శాతం మంది ఆప్‌ వైపే మొగ్గు చూపినట్లు ఐఏఎన్‌ఎ్‌స-సీఓటర్‌ సర్వే వెల్లడించింది. గతంలో బాగా వెనుకబడ్డ బీజేపీ పుంజుకొని 36.6 శాతం మంది మద్దతు సాధించగలిగింది. కేజ్రీవాల్‌ ప్రభుత్వాన్ని మార్చాలా అన్న ప్రశ్నకు అవసరం లేదని 58.1శాతం, మార్చాలని 39.2 శాతం మంది ఓటేశారు. సీఎంగా కేజ్రీవాలే ఉండాలని 60.2శాతం కోరుకొన్నారు. కాగా ఈనెల 11న ఫలితాలు రానున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి