iDreamPost

రాసి పెట్టుకో జగన్ అనేంత ధైర్యం,ఉమాకు ఎలా వొచ్చింది? దేవినేని సోదరుల రాజకీయ ప్రస్థానం

రాసి పెట్టుకో జగన్ అనేంత ధైర్యం,ఉమాకు ఎలా వొచ్చింది? దేవినేని సోదరుల రాజకీయ ప్రస్థానం

ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే ఆకలి.తపించే ఆత్మను శాసించే శక్తి ఒక్కటే “ఆశ” ప్రస్తానం సినిమాలో సాయికుమార్ డైలాగ్… చాలా లోతైన డైలాగ్… కొందరి రాజకీయ ప్రస్థానం చూస్తే ఇది నిజం అనిపిస్తుంది … ఆశ ఉంటె సరిపోదు, లక్ష్యం చేరుకోవటానికి ధైర్యం ఉండాలి.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకలగాలి … అయినా వారితో విబేధించ వాల్సి రావొచ్చు… పరిస్థితులను తట్టుకునే మానసిక స్థైర్యం ఉండాలి… ఆ లక్షణాలతో ఎదిగిన ఒక రాజ్జకీయ నాయకుడి గురించి ఈ వ్యాసం …

దేవినేని అనగానే ముందు గుర్తొచ్చేది దేవినేని నెహ్రు… రంగా,రాధా నెహ్రు.. ఈపేర్లు తెలియనై సగటు రాజకీయ పాఠకుడు ఉండదు.

దేవినేని ఉమా నెహ్రూకు ఏమవుతాడు?నెహ్రు పలుసార్లు ఓడిపోయినా ఉమా మాత్రం ఎలా వరుసగా గెలవగలిగాడు ?అన్న ప్రశ్న తరచుగా వినిపిస్తుంది… ఉమా ఎవరి రాజకీయ వారసుడు?సొంతంగా ఎదిగాడా?

దేవినేని నెహ్రు తరువాత తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన పేరు ఒకటుంది..అతను ఎన్నికల్లో పోటీచేసింది, గెలిచింది కేవలం ఒకసారి…ఆ ఒక్కసారి గెలిచినప్పుడే మంత్రి కూడా అయ్యాడు కానీ రైలు ప్రమాదం రూపంలో అర్ధాంతరంగా మరణం సంభవించింది.. అతను వేసిన పునాది మీద ఉమా రాజకీయంగా ఎదిగాడు .. అతనే దేవినేని రమణ !

దేవినేని రమణ విజయవాడను వొదిలి నందిగామకు ఎలా వొచ్చాడు?

దేవినేని కుటుంబం స్వగ్రామం కంకిపాడు దగ్గరలోని నెప్పల్లె. దేవినేని వెంకట రమణ తండ్రి శ్రీమన్నారాయణ (చిన్ని) అప్పట్లోనే మద్రాసులో చదువుకున్నారు .పెరకలపాడుకు చెందిన చుండూరు వెంకన్న అని కంచికచర్ల సొసైటీ అద్యక్షుడిగా పనిచేసేవారు. ఆయనకు ముగ్గురు కూతుర్లు. చదువుకున్న అబ్బాయి కోసం చూస్తున్న వెంకయ్య చిన్నికి తన కూతురిని ఇచ్చి పెళ్లి చేశారు. మొదట సోడా వ్యాపారం చేసిన చిన్ని తరువాత మామగారి సినిమా థియేటర్ బాధ్యతలు చూసేవారు. చిన్ని సినిమా హాల్ తో పాటు సోడా తయారీ ,ఐస్ ఫ్యాక్టరీ నడిపారు. ఆ విధంగా రమణ కుటుంబం నందిగామ నియోజకవర్గం కంచికచర్లలో స్థిరపడింది.

దేవినేని నెహ్రు సోదరుడిగా (బాబాయి కొడుకు) నెహ్రు వర్గంలో కీలక పాత్ర పోషించిన రమణ నెహ్రు 1983లో తొలిసారి ఎమ్మెల్యే అయినా తరువాత రాజకీయంగా క్రియాశీలకంగా ఉండేవారు. దేవినేని మురళి హత్య తరువాత నెహ్రు వర్గంలో రమణ కీలకనాయకుడయ్యాడు. టీడీపీ యూత్ వింగ్ అధ్యక్షుడి స్థాయికి ఎదిగాడు. ఒక సెటిల్మెంట్ కోసం రమణను వైజాగ్ తీసుకెళ్లిన నార్ల మణి ప్రసాద్ కూతురుతో మొదలైన ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది.

టీడీపీ ఆవిర్భవం – వసంత నాగేశ్వర రావ్

టీడీపీ ఆవిర్భావం తరువాత జరిగిన మొదటి రెండు ఎన్నికల్లో నందిగామ నుంచి టీడీపీ తరుపున గెలిచి, హోమ్ మంత్రిగా కూడా పనిచేసిన వసంత నాగేశ్వరరావు 1988లో ఎన్టీఆర్ క్యాబినెట్ రద్దు నిర్ణయంతో విభేదించి టీడీపీని వీడి కాంగ్రెసులో చేరాడు. కంచికచర్ల ఎంపీపీగా పనిచేస్తున్న పుల్లయ్య బాబు అనే నాయకుడు పర్వతనేని ఉపేంద్ర లాబీయింగ్ తో 1989 ఎన్నికల్లో నందిగామ టీడీపీ టికెట్ తెచ్చుకున్నారు. పీవీ కి మద్దతు ఇవ్వటంతో టీడీపీ నుంచి బహిష్కరణకు గురైన ఉపేంద్రతో పాటు పుల్లయ్య బాబు కూడా టీడీపీని వీడాడు. పుల్లయ్య బాబు తరువాత కాలంలో ఉపేంద్రతో పాటు కాంగ్రెస్లో చేరాడు..తరువాత రాజకీయాలు వొదిలేసి వ్యాపారానికే పరిమితం అయ్యాడు.

1994 ఎన్నికల్లో నందిగామ టికెట్ కు ఎవరు పోటీపడ్డారు?

విజయవాడకు సమీపంలో ఉండటంతో నందిగామ మీద చాలామంది నేతల దృష్టి పడింది.అప్పట్లో విజయవాడ ఎంపీ గా ఉన్న వడ్డే శోభనాదీశ్వర రావు ఎన్ వీ రమణ కు టికెట్ ఇప్పించటానికి ప్రయత్నం చేశారు. తాళ్ళూరి సుగుణ అనే నాయకురాలు కూడా గట్టి ప్రయత్నం చేశారు. వీరందరితో పాటు దేవినేని రమణ గట్టి ప్రయత్నం చేసాడు… ఆశ్చర్యకరంగా రమణ కోసం ఆయన సోదరుడు సీనియర నేత నెహ్రు ప్రయత్నం చేయలేదు…

చివరికి నందిగామకు చెందిన రామకృష్ణ అనే లాయర్ కు టీడీపీ టికెట్ ఖాయం అయ్యంది…దీనితో రగిలి పోయిన రమణ వర్గం యుద్ధవాతావరణాన్నే సృష్టించారు… మరొక వైపు రమణ తరుపున కొందరు లక్ష్మీపార్వతితో సంప్రదింపులు జరిపారు.మొత్తానికి ఆవిడ ఆశీస్సులతో రమణకు టీడీపీ టికెట్ దక్కింది. అప్పట్లో కీసర బ్రిడ్జ్ వద్ద రమణ వర్గం చేసిన హంగామాను స్థానికులు ఇప్పటికి మర్చిపోలేదు.

ఆ ఎన్నికల్లో రమణ ఎలా గెలిచాడు?

1994 ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం సృష్టించింది, కాంగ్రెస్ కేవలం 26 స్థానాలకు పరిమితమయ్యింది. కృష్ణా జిల్లాలో కైకలూరు(నంబూరు రాము ), విజయవాడ ఈస్ట్(వంగవీటి రత్న కుమారి) మాత్రమే గెలిచారు.

ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ సీనియర్ నేత, చెన్నారెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసిన సిటింగ్ ఎమ్మెల్యే ముక్కపాటి వెంకటేశ్వర రావ్ కు దక్కవలసింది. కానీ నాటి కాంగ్రెస్ వర్గ రాజకీయాల్లో కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ముక్కపాటి వెంకటేశ్వర రావుకు టికెట్ నిరాకరించారు. పీవీ నర్సింహా రావ్ బంధువు, మాజీ రాజ్య సభ సభ్యుడైన S.రాజేశ్వర రావ్ నందిగామ కాంగ్రెస్ టికెట్ ను గోపాల్ కృష్ణ సాయి అనే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి ఇప్పించారు. ఈ గోపాల్ కృష్ణ సాయి 1985 ఎన్నికల్లో నందిగామ నుంచి ఓడిపోయి ఉన్నారు. బొద్దిల్లపాడు గ్రామానికి మూడుసార్లు సర్పంచ్ గా పనిచేశారు. మంచి మనిషిగా గుర్తింపు ఉంది. సైకిల్ మీద అన్ని గ్రామాలు తిరుగుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేసేవారు.”నందిగామ గాంధీ”గా ఆ ప్రాంతంలో గుర్తింపు పొందారు.

ముక్కపాటి వెంకటేశ్వర రావ్ మొదట్లో నందిగామ సమితి అధ్యక్షులు గా పనిచేశారు. ఆ సమితి పరిధిలో జగ్గయ్యపేట నియోజకవర్గంలోని 34 పంచాయితీలు ఉండేవి. దానితో రెండు నియోజకవర్గాలలో ఆయనకు పట్టు ఉండేది. 1978లో నందిగామ నుంచి జనతా పార్టీ తరుపున గెలిచిన ముక్కపాటి 1983లో నందిగామ నుంచి,1985లో జగయ్యపేట నుంచి కాంగ్రెస్ తరుపున ఓడిపోయారు.1989లో నందిగామ నుంచి కాంగ్రెస్ తరుపున గెలిచారు.టీడీపీ అధికారంలో ఉన్న 1983-1989 మధ్య నందిగామ,జగ్గయ్యపేట రెండు నియోజకవర్గాలుకు ముక్కపాటి నాయకుడిగా వ్యవహరించారు. 1994లో ముక్కపాటి వెంకటేశ్వర రావ్ నందిగామ టికెట్ సాధించటంలో విఫలమైనా జగయ్యపేట నుంచి టికెట్ సాధించారు కానీ అక్కడ ఓడిపోయారు.

ఆవిధంగా ముక్కపాటి వెంకటేశ్వర రావ్ లాంటి బలమైన నేత కాకుండా సాయి గోపాల్ కృష్ణ వంటి సౌమ్యుడు, కుల బలం ,ఆర్ధిక బలం లేని ప్రత్యర్థి కావటం 1994 ఎన్నికలో రమణకు కలిసొచ్చింది. నందిగామ నియోజక వర్గ పరిధిలో అనేక గ్రామాలలో టీడీపీ,కాంగ్రెస్ లకు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే నాయకత్వం వహించేవారు.

కులపెద్దలు ప్రభావంతో కావొచ్చు, సాయి గోపాల కృష్ణ గెలవటం వలన తమకు ఎలాంటి లాభం లేదనిపించి కావొచ్చు అనేక మంది గ్రామ స్థాయి నాయకులు గట్టిగా పనిచేయలేదు. ముఖ్యంగా వ్యవసాయ పనుల కోసం వలస వెళ్లిన దళిత ఓటర్లను ఓటింగ్ కు తీసుకు రావటంలో ఉత్సహం చూపలేదు… అంతిమంగా ఆ ఎన్నికల్లో రమణ పది వేల రెండు వందల ఓట్ల తేడాతో గెలిచాడు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గెలిచిన తీరును చూస్తే రమణది సాధారణ విజయమే, ప్రజలు సాయి గోపాల్ కృష్ణ పట్ల అభిమానము చూపినట్లే.

ఆ ఎన్నికల్లో సాయి గోపాల్ కృష్ణ కాకుండా ముక్కపాటి వెంకటేశ్వర రావ్ ప్రత్యర్థి అయ్యుంటే ఫలితం ఎలా ఉండేదో చెప్పలేము.

రమణ నాయకత్వం, పనితీరు 
రమణ గాలివాటం నాయకుడు కాదు. నెహ్రు అనుచరుడిగా ఉంటూనే పెద్ద కలలు కన్నాడు, వాటిని సాకారం చేసుకోవటానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేశాడు.వొచ్చెంత వరకు ఓపికగా ఎదురు చూశాడు నందిగామ నుంచి గెలిచిన తరువాత నియోజకవర్గ సాగు నీటి సమస్య పరిష్కారానికి కృషి చేశాడు .

కలిసొచ్చిన వైస్రాయ్
ఎన్టీఆర్ క్యాబినెట్లో నెహ్రు మంత్రి అయ్యాడు. 1983 నుంచి ఎన్టీఆర్ తో నెహ్రు సన్నిహితంగా,గురు భక్తితో ఉండేవారు. నెహ్రు వైస్రాయ్ కుట్రలో చంద్రబాబుకు సహకరించకుండా ఎన్టీఆర్ వర్గంలో ఉండిపోయాడు. రమణ మాత్రం క్షణం ఆలస్యం చేయకుండా బాబు వర్గంలో చేరి వైస్రాయ్ వ్యవహారంలో కీలకంగా వ్యహరించాడు, అనేక మంది ఎమ్మెల్యేలను బాబుకు అనుకూలంగా వైస్రాయ్ కి తీసుకెళ్లాడు.

రమణ వైస్రాయ్ వ్యవహారంలో ఏమి చేద్దాం అని మాట మాత్రం కూడా నెహ్రూను అడగకపోవటంలో ఆశ్చర్యం లేదు.. నెహ్రు ఆశీస్సులు లేకుండానే టికెట్ తెచ్చుకున్న రమణ తుదుపరి లక్ష్యం మంత్రి అన్నది క్లియర్… చంద్రబాబుకు కూడా ఎన్టీఆర్ సొంత జిల్లా కృష్ణ లో టీడీపీ ని తనకు అనుకూలంగా మలవగలిగిన నేత ,విజయవాడ నగరంలో నెహ్రూను ఢీకొట్టగల నేత అవసరం … బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, కొద్దీ నెలల తరువాత రమణ మంత్రి అయ్యాడు…

మంత్రిగా రమణ


మంత్రిగా రమణ చాలా అభివృద్ధి పనులు చేసాడు. కృష్ణ నది మీద వేదాద్రి వద్ద ఎత్తిపోతల నిర్మించి నందిగామ దాహార్తిని తీర్చాడు. ఆయకట్టు చివరి పొలాలకు కూడా సాగు నీరు ఇచ్చే ఏర్పాట్లు చేసాడు. నాడు రమణ చేసిన అభివృద్ది పనులే వరుసగా ఎన్నికల్లో ఆయన తమ్ముడు ఉమామహేశ్వర రావ్ గెలవటానికి ఉపయోగ పడ్డాయి. ఒక్క చందర్లపాడు మండలం చాలు టీడీపీ గెలవటానికి అనే స్థాయిలో వారి బలం పెరిగింది.

చంద్రబాబు కోరుకోవటం వలనో లేక తన బలాన్ని పెంచుకోవాలన్న తలంపుతోనో మంత్రి అయిన తరువాత రమణ తన పాత సహచరులు ,నెహ్రు వర్గంలో కీలకమైన వారిని పోలీసుల సహాయంతో వేధించాడు. అనేక మంది విజయవాడను వొదిలి అజ్ఞాతంలోకి వెళ్లారు కానీ ఎవరు నెహ్రు ను వీడి రమణ వర్గంలో చేరలేదు.. కడియాల బుచ్చి బాబు,అరవ సత్యం,కోటి నాగులు ,కృష్ణకుమార్.. ఇలా నెహ్రు బ్రిగేడ్ మొత్తం ఇప్పటికి నెహ్రు కొడుకు అవినాష్ తోనే ఉంది.

రమణ మరణం,ఉమా రాజకీయ రంగప్రవేశం ..

1999 జూన్ మొదటి వారంలో గోదావరి ఎక్సప్రెస్ ప్రమాదంలో ఫస్ట్ క్లాస్ ఏసీ భోగి తగలబడి పోయింది.అందులో ప్రయాణిస్తున్న రమణ,అతని అనుచరులు మరియు ఇతర ప్రయాణికులు మొత్తం ఎనిమిది మంది చనిపోయారు.

రమణ కుటుంబాన్ని ఓదార్చటానికి కంచికచర్ల వచ్చిన చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో రమణ శ్రీమతి ప్రణతికి టికెట్ ఇస్తామని ప్రకటించాడు.కానీ ఆ రాత్రే ఆవిడ మరణించారు..భర్త మరణంతో మనోవ్యధతో గుండెపోటుతో మరణించిందని కుటుంబ సభ్యులు చెప్పగా ప్రత్యర్ధులు ఆవిడ మరణం మీద అనుమానాలు వ్యక్తం చేశారు…

దేవినేని ఉమా రాజకీయం 1999-2019

రమణ మొదటి నుంచి విజయవాడ రౌడీ రాజకీయాల్లో పాల్గొనగా ఉమాను మాత్రం వీటికి దూరంగా పెట్టి చదివించారు. ఉమా ఇంజనీరింగ్ చదివి హైద్రాబాదులో ఉద్యోగం కూడా చేశాడు .

రమణ మరణంతో 1999 ఎన్నికల్లో ఉమా పోటీచేసి వరుసగా 2004,2009,2014 నాలుగు విజయాలు సాధించిన ఉమా మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయాడు. అంటే 1994 నుంచి చూస్తే ఐదు విజయాల తరువాత దేవినేని కుటుంబానికి తొలి ఓటమి 2019లో ఎదురయ్యింది. 2009 నియోజకవర్గాల పునః విభజనలో నందిగామ SC రిజర్వ్డ్ కావటంతో పక్క నియోజకవర్గం మైలవరం నుంచి పోటీ చేసిన ఉమా అక్కడి నుంచి 2009,2014 గెలిచి 2019లో ఓడిపోయాడు.

దేవినేని రమణ శైలికి,ఉమా శైలికి చాలా తేడావుంది. రమణ నెహ్రు స్కూల్లో రాజకీయం నేర్చుకుంటే ఉమా చంద్రబాబు స్కూల్లో రాజకీయం నేర్చుకున్నాడు. కృష్ణా జిల్లా టీడీపీలో తన ఆధిపత్యానికి అడ్డువస్తారనుకున్న వాళ్ళందరిని ఎదో ఈవిధంగా బయటకు పంపాడు. మొన్న ఎన్నికల్లో వైసీపీ గెలిచి కొడాలి నాని మంత్రి అయిన తరువాత ” నాని మంత్రి అయినందుకు దేవినేని ఉమాకు థాంక్స్ చెప్పాలి ” అంటూ టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్వీట్ పెట్టటం ఉమా రాజకీయాన్ని అర్ధం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. దేవినేని ఉమానే పొగబెట్టి కొడాలి నానిని టీడీపీ నుంచి బయటకు వెళ్ళేలాగా చేశాడన్న అర్ధంలో కేశినేని నాని వరుస ట్వీట్స్ పెట్టారు.

ఈ రోజుకు నందిగామ నియోజకవర్గంలో వైట్ షర్ట్స్ వేసి తిరిగే టీడీపీ నాయకులు రమణ పేరే ముందుగా చెప్తారు. రమణ సహాయంతో ఎదిగామని చెప్పుకుంటారు.. ఉమా ఆ స్థాయి అభిమానులను సాధించలేక పోయాడు.ముఖ్యంగా మంత్రిగా ఉండి ఉమా నడిపిన ఇసుక మాఫియా,టోల్ గేట్ వ్యాపారాలు మీద గుత్తాధిపత్యం ఆయన అనుచరులకు మింగుడుపడలేదు..

2019 ఎన్నికల్లో ఓటమి
మొన్నటి ఎన్నికల్లో వసంత నాగేశ్వర్ రావ్ కొడుకు వసంత కృష్ణ ప్రసాద్ మీద 12,653 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. యాదృచ్చికంగా ఉమా,కృష్ణ ప్రసాద్ ఇద్దరు కూడా 1999 ఎన్నికలతోనే రాజకీయ రంగప్రవేశం చేశారు. ఆ ఎన్నికల్లో ఉమా కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన కృష్ణప్రసాద్ మీద గెలిచాడు. 1999 తరువాత కృష్ణ ప్రసాద్ ఎన్నికల్లో పోటీచేసింది ఈ 2019 ఎన్నికలలోనే కావటం గమనార్హం.

2014 ఎన్నికల్లో టీడీపీ గుంటూరు వెస్ట్ టికెట్ కోసం చివరి వరకు ఎదురు చూసిన కృష్ణ ప్రసాద్ కు నిరాశే మిగిలింది. వసంత కుటుంబానికి గుంటూరు జిల్లాలో పొగాకు వ్యాపారం ఉంది,ఎక్కువ రోజులు ఇక్కడే గడుపుతారు. ఆయన 2018 చివరి వరకు కూడా టీడీపీలోనే కొనసాగాడు. 2019 టికెట్ మీద చంద్రబాబు నుంచి గుంటూరు గట్టి హామీ రాలేకపోవటం, ఉమా తనకు టికెట్ రాకుండా మరోసారి అడ్డుకుంటాడని భావించి టీడీపీ ని వీడి వైసీపీలో చేరాడు. ఒక విధంగా మొన్నటి ఓటమి ఉమా కొని తెచ్చుకున్నట్లే.

మంత్రిగా జగన్ మీద తీవ్రంగా విరుచుకు పడిన ఉమాను ఎలాగైనా ఓడించాలని వసంత కృష్ణ ప్రసాద్ ను తమ పార్టీలోకి ఆహ్వానించి మైలవరం టికెట్ ఇచ్చింది. వైసీపీ హవాకు తోడు, వసంత నాగేశ్వర రావ్ ఎన్నికల వ్యూహం ఉమాను ఓడించటంలో కీలకం . రాసిపెట్టుకో జగన్ 2018 జూన్ కల్లా పోలవరం నీళ్లు ఇస్తాం అన్న ఛాలెంజ్ , పులివెందులలో కూడా గెలుస్తాం.. పులివెందులకు నీళ్లు ఇచ్చాము.. మా ఋణం తీర్చుకోవటానికి అక్కడి ప్రజలు ఎదురు చూస్తున్నారు లాంటి గడ్డుగ్గాయ్ మాటలు ఉమాను గెలిపించలేక పోయాయి…

అసెంబ్లీలో తొలి సమావేశంలో రాసిపెట్టుకోమన్న ఉమా ఎక్కడా? కనిపించడే అంటూ అంబటి రాంబాబు వెటకారంగా అన్నా దాని వెనుక మంత్రి హోదాలో ఉమా వ్యవహరించిన తీరు మీద గూడు కట్టుకున్న కోపం ఉంది.. అది ఒక్క అంబటి రాంబాబు కోపం మాత్రమే కాదు.. మైలవరం ఓటర్ల కోపం కూడా !

సొంత తమ్ముడు చంద్రశేఖర్ మొన్నటి ఎన్నికల్లో వైసీపీ లో చేరినప్పుడన్న ఉమా మేల్కొని ఉండవలసింది.

ఓటమి అనేకమంది నేతల భవిషత్తు మార్చింది. ముఖ్యంగా చంద్రబాబు ఓడిపోయిన నాయకులకు ఇచ్చే ప్రాధాన్యతలోని తేడా ఉమాకు అనుభవంలోకి రావటానికి ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు.. ఒక వైపు ఎంపీ కేశినేని నానీతో విబేధాలు మరో వైపు జిల్లా టీడీపీ మీద తప్పుతున్న పట్టు..నెహ్రు కొడుకు అవినాష్ వైసీపీలో చేరటం, విజయవాడ సిటీ మీద అవినాష్ పట్టు పెరుగుతుండటం .. ఉమా భవిషత్తు రాజకీయాలను ఎలా ఎదుర్కొంటాడో చూడాలి…

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి