iDreamPost

మణిపూర్ లో రాజకీయ సంక్షోభం: ఎన్పీపితో బిజెపి బేరసారాలు

మణిపూర్ లో రాజకీయ సంక్షోభం: ఎన్పీపితో బిజెపి బేరసారాలు

మణిపూర్‌లో మెజారిటీ కోల్పోయిన ముఖ్యమంత్రి ఎన్‌.బిరెన్‌ సింగ్‌ ప్రభుత్వాన్ని కొనసాగించడానికి నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్పీపి) మద్దతు పొందేందుకు బేరాసారా లు సాగించే ప్రయత్నాలను బిజెపి ముమ్మరం చేసింది. ఈ నెల 17న బిజెపి నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలతో సహా ఐదుగురు ఎమ్మెల్యేల రాజీనామాతో బిరెన్‌ సింగ్‌ ప్రభుత్వం మైనార్టీలో పడిన సంగతి తెలిసిందే.

ప్రత్యేక విమానంలో మేఘాలయ ముఖ్యమంత్రి, ఎన్పీపి జాతీయ అధ్యక్షుడు కె. సంగ్మా, అస్సాం ఆర్థిక మంత్రి హిమంత్‌ బిస్వా శర్మ (బిజెపి) ఇంఫాల్‌ చేరుకుని ప్రభుత్వానికి మద్దతుపై చర్చించారు. శాసన సభలో రెండు పార్టీల మధ్య పొత్తుపై సమావేశం జరిపారు. ఈ సమావేశం ఫలితం బయటకు తెలియకున్నా, రెండు పార్టీలకు చెందిన కీలక నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు.

మంత్రి పదవులుసహా పలు పందేరాలను ఎన్పీపికి ఎర చూపినట్టు తెలిసింది. ఎన్పీపికి మణిపూర్‌ అసెంబ్లీలో నలుగురు సభ్యులు ఉన్నారు. ఇంఫాల్‌ నుంచి బయలుదేరే ముందు సంగ్మా విలేకరులతో మాట్లాడుతూ మణిపూర్‌ విషయాన్ని ఢిల్లీలోని ఎన్‌డిఎ కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళతానని చెప్పారు.

మణిపూర్‌లో మొత్తం 60 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఈనెల 19న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 52 మంది మాత్రమే ఓటు వేశారు. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఓక్రామ్‌ ఇబోబి మాట్లాడుతూ అసెంబ్లీని బిజెపి కోల్పోయిందనీ, బల విచారణ చేస్తే మిగతా విషయాలు స్పష్టమవుతాయని చెప్పారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి