iDreamPost

బీద వర్సెస్‌ బీద

బీద వర్సెస్‌ బీద

తండ్రీ కొడుకులు, అన్నదమ్ములు, బాబాయి అబ్బాయిలు, బావా బామ్మర్దులు, అక్కా చెల్లెళ్లు ఇలా ఎలాంటి సంబంధంలోనైనా రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉన్న ఘటనలు కోకొల్లలు. కొందరు స్వలాభం కోసం చెరో రెండు పార్టీల్లో ఉంటే.. మరికొన్ని ఘటనల్లో నిజంగానే పార్టీలపై అభిమానంతో వేరుగా ఉంటుంటారు. అసలు విషయానికొస్తే.. శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లాలో సొంత అన్నదమ్ములు చెరో రెండూ పార్టీల్లో ఉంటూ కార్యకర్తలపై ఒత్తిడి తెస్తున్నారట. వారే బీద మస్తాన్‌ రావు, బీద రవిచంద్ర. కొన్ని దశాబ్ధాలుగా టీడీపీలో ఉంటూ రాజకీయంగా ఎదిగిన సోదరుల మధ్య ఇప్పుడు రాజకీయ వైరం తీవ్రస్థాయిలో కొనసాగుతోందని జిల్లాలో హాట్‌హాట్‌ టాక్‌ నడుస్తోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి నెల్లూరు పార్లమెంట్‌కు పోటీ చేసి ఓడిపోయిన బీద మస్తాన్‌ రావు.. ఇటీవలే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు బీద రవిచంద్ర టీడీపీ ఎమ్మెల్సీగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మస్తాన్‌రావు తన అనుచరులను వైఎస్సార్‌సీపీలో చేర్పిస్తూ కొత్త పార్టీలో తన పరపతి పెంచుకోవాలని చూస్తున్నారు. బీద రవిచంద్ర చేరికలకు అడ్డుకట్ట వేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే సోదరుల మధ్య అనుబంధం గురించి తెలిసిన మరికొందరు మాత్రం.. వారి వారి పార్టీల పెద్దల మెప్పు పొందడానికి ఇలా డ్రామాలు ఆడుతున్నారని, వారిద్దరూ ఎప్పటికీ ఒకటేనని చెబుతున్నారు.

ఇదీ వారి రాజకీయ చరిత్ర..

1989లో రాజకీయాల్లోకి వచ్చిన బీద సోదరులు అల్లూరు కేంద్రంగా రాజకీయాలు చేసేవారు. అక్కడ వారి ప్రత్యర్థి విష్ణువర్ధన్‌రెడ్డి. 2004లో తొలిసారి అల్లూరు నుంచి పోటీ చేసిన బీద మస్తాన్‌రావు విష్ణువర్దన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత అల్లూరు నియోజకవర్గం రద్దయ్యి కావలిలో కలసిపోయింది. 2009లో కావలి నుంచి మస్తాన్‌రావు పోటీ చేసి విష్ణువర్దన్‌రెడ్డిపై గెలిచి పగ తీర్చుకున్నారు. అయితే కాంగ్రెస్‌ నుంచి అప్పట్లో టికెట్‌ ఆశించి భంగపడిన రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ప్రజారాజ్యం నుంచి పోటీ చేయడం వల్ల కాంగ్రెస్‌ ఓట్లు చీలి మస్తాన్‌రావు గెలిచారని విశ్లేషకులు అంటుంటారు. గెలిచిన తర్వాత మస్తాన్‌రావు నియోజకవర్గంలో ఉండకుండా వ్యాపారాలపై దృష్టి సారించారు. మరోవైపు రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ చేరారు. 2014లో కావలి నుంచి పోటీ చేసి బీద మస్తాన్‌రావుపై ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల నాటికి నియోజకవర్గంలో, నెల్లూరు జిల్లాలో భారీ రాజకీయ మార్పులు చోటుచేసుకున్నాయి. దశాబ్ధాల పాటు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న విష్ణువర్దన్‌రెడ్డి టీడీపీలో చేరిపోయారు. దీంతో ఆయన్ను కావలి నుంచి పోటీలో పెట్టి.. మస్తాన్‌రావును నెల్లూరు పార్లమెంటు నుంచి పోటీ చేయించారు. అయితే రెండు చోట్లా టీడీపీ అభ్యర్థులు ఓడిపోయారు.

రాజ్యసభ హామీతోనేనా?

ఎన్నికల్లో ఓటమి తర్వాత బీద మస్తాన్‌రావు కొన్నాళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఉన్నట్టుండి రాజకీయ ప్రత్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డితోపాటు వైఎస్‌ జగన్‌ దగ్గరికి వెళ్లి వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. బీద కుటుంబానికి కొన్ని గ్రామాల్లో మంచి పట్టు ఉంది. ఆయా గ్రామాల్లో చాలా ఏళ్లుగా వేరే పార్టీ జెండా ఎగరట్లేదు. అయితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని స్థానాలను గెలిపించుకొని వస్తే.. బీసీ కోటా కింద రాజ్యసభకు పంపిస్తారనే హామీతో ఆయన పార్టీలో చేరారని అనుచరులు చెప్పుకుంటున్నారు. అందుకోసమే తన వర్గాన్ని అంతా వైఎస్సార్‌సీపీలో చేర్పిస్తున్నారు. మరోవైపు టీడీపీ నుంచి ఎమ్మెల్సీ పదవిలో ఉన్న బీద రవిచంద్ర.. తన పదవిని కాపాడుకోవడం కోసం ఆ పార్టీలోనే ఉంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. త్వరలోనే మండలి రద్దు కాగానే, ఈయన కూడా వైఎస్సార్‌సీపీలోకి చేరుతారని పేర్కొంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి