iDreamPost

ఇక్కడ కారుణ్యం.. అక్కడ కాఠిన్యం

ఇక్కడ కారుణ్యం.. అక్కడ కాఠిన్యం

పోలీసులంటే సేవకులు, ప్రజరక్షకులని చేతల్లో చూపిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు ఆంధ్ర పోలీసులు.. పక్కనున్న ఒడిశా రాష్ట్ర పోలీసులు దీనికి పూర్తి విరుద్ధంగా ప్రజలను కష్టాలకు గురిచేస్తూ కఠినాత్ములన్న అపప్రదను మూటగట్టుకుంటున్నారు. రెండు రాష్ట్రాల్లో తాజాగా జరిగిన రెండు ఘటనలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

కుళ్ళిన శవాన్ని 3 కి.మీ. మోసి..

విశాఖ జిల్లా రాంబిల్లి మండలం సీతాపాలెం సముద్ర తీరంలో గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్లు రెండు రోజుల క్రితం సమాచారం అందుకున్న రాంబిల్లి పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. మృతదేహం పూర్తిగా కూలిపోయి, దుర్వాసన వెదజల్లుతూ కనీసం దగ్గరికి కూడా వెళ్లలేని స్థితిలో ఉంది. దాన్ని తరలించేందుకు పోలీసులు స్థానికుల సహాయం కోరారు. అయితే కూలిపోయిన మృతదేహాన్ని ముట్టుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో పోలీసులే శవాన్ని భుజాలపై మోసుకొని మూడు కిలోమీటర్ల దూరంలోని యలమంచిలి మార్చురీకి చేర్చారు. మానవత్వంతో వారు స్పందించిన తీరు సర్వత్రా ప్రశంసలు అందుకుంది. రాష్ట్ర డీజీపీ స్వయంగా ఒక సందేశంలో రాంబిలి ఎస్సై, ఎఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, హోంగార్డులకు సెల్యూట్ చేశారు.

సుమారు రెండు నెలల క్రితం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ మహిళ ఎస్సై శిరీష కూడా ఇదే రీతిలో పట్టణ శివారు అటవీ ప్రాంతంలో ఉన్న గుర్తుతెలియని మృతదేహాన్ని స్వయంగా రెండు కిలోమీటర్ల దూరం మోసుకెళ్లి దహన సంస్కారాలు చేయించడం అప్పట్లో డీజీపీ ప్రశంసలు పొందింది.

గర్భిణీకి నడక శిక్ష.. 

ఆంధ్ర పోలీసులకు పూర్తి భిన్నంగా ఒడిశాలో ఓ మహిళా ఎస్సై సాటి మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించింది. మయుర్బంజ్ జిల్లా సారత్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న బిక్రం బిరులీ అనే వ్యక్తి గర్భిణీ అయిన తన భార్య గురుబిరి బీరులీని హెల్త్ చెకప్ కోసం బైక్ పై ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. దారిలో వాహనాలు తనిఖీ చేస్తున్న మహిళా ఎస్సై రీనా బాక్సల్ వారిని ఆపింది. బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి హెల్మెట్ ఉన్నా.. వెనుక కూర్చున్న భార్యకు హెల్మెట్ లేదంటూ రూ. 500 జరిమానా విధించారు. వెంటనే. పొలీస్ స్టేషన్ కు వెళ్లి కట్టాలని ఆదేశించారు.

ఆన్ లైన్ లో కడతానని అతను చెప్పినా వినిపించుకోకుండా అతన్ని పొలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. గర్భిణి అయిన అతని భార్యను అక్కడే వదిలేశారు. చాలాసేపు రోడ్డు మీదే వేచి చూసిన ఆమె ఎంతకూ భర్త రాకపోవడంతో మండుటెండలో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు నడుచుకుంటూ వెళ్లి భర్తను కలుసుకుంది. తమ పట్ల పోలీసులు అనుసరించిన తీరుపై దంపతులు 29న జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన వెంటనే సదరు మహిళా ఎస్సైని సస్పెండ్ చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి