iDreamPost

సెంట్రల్ గవర్నమెంట్ లో పది లక్షల ఉద్యోగాలు.. రెడీగా ఉండండి.. ప్రకటించిన మోదీ..

సెంట్రల్ గవర్నమెంట్ లో పది లక్షల ఉద్యోగాలు.. రెడీగా ఉండండి.. ప్రకటించిన మోదీ..

దేశంలో ఒక్కసారిగా సర్కారీ కొలువుల సందడి మొదలైంది. నిరుద్యోగులు ఎదురు చూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు వరుసగా రానున్నాయి. దాదాపు 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, అది కూడా సంవత్సరంన్నర కాలంలోనే పూర్తి చేయాలని ప్రధాని మోదీ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 77 మంత్రిత్వశాఖలు, విభాగాల్లోని మానవ వనరుల స్థితిగతులను సమీక్షించి వచ్చే 18 నెలల్లో యుద్ధ ప్రాతిపదికన 10 లక్షల మంది నియామకాలు చేపట్టాలని ప్రధాని మోదీ తెలిపినట్లు పీఎం కార్యాలయం ట్విటర్‌ ద్వారా వెల్లడించింది.

ఈ ట్వీట్ వెలువడిన కొద్ది సేపటికే కేంద్ర హోం, విద్యా శాఖలు స్పందించి ప్రధాని మోదీ ఆదేశాల ప్రకారం తమ పరిధిలోని ఖాళీ పోస్టుల భర్తీకి సన్నద్ధమవుతున్నట్లు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వ తాజా ప్రకటనతో దేశంలో చాలా మందికి కేంద్ర సర్కారీ కొలువులు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో భారీ సంఖ్యలో ఖాళీలున్నాయి.

ఖాళీ ఉన్న ఉద్యోగాలలో రక్షణ, రైల్వే, హోం, పోస్టల్‌, రెవెన్యూ, ఆడిట్‌ అకౌంట్స్‌ శాఖల వాటాయే 92.547శాతం అనగా దాదాపు 8 లక్షల 69 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఇవికాకుండా జాతీయ ప్రాధాన్యమున్న విద్యా సంస్థల్లో 14,268 అధ్యాపక పోస్టులు, కేంద్రీయ విద్యాలయాల్లో 8,174, జవహర్‌ నవోదయ పాఠశాలల్లో 3,414 ఉపాధ్యాయ పోస్టులు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయంప్రతిపత్తి వ్యవస్థల్లోనూ పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. కరోనా వల్ల గత రెండేళ్లుగా ఎలాంటి పెద్ద నియామకాలు చేపట్టకపోవడం, గత రెండేళ్లలో పదవీ విరమణలు జరిగిన ప్లేసులు భర్తీ కాకపోవడంతో భారీగా ఉద్యోగాలు రానున్నాయి. దీనిపై దేశ యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ వెలువడనున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి