iDreamPost

ప్లాస్టిక్ చెత్త‌తో అర‌కు

ప్లాస్టిక్ చెత్త‌తో అర‌కు

ఏడాది క్రితం అర‌కులో నెల‌రోజులున్నాను. అర‌కులో ప్ర‌కృతిని చూసి ఆనందించాను. అదే స‌మ‌యంలో ఎక్క‌డ చూసినా గుట్ట‌లుగుట్ట‌లుగా క‌నిపిస్తున్న ప్లాస్టిక్ చెత్త‌ను చూసి భ‌య‌మేసింది.

అర‌కు నుంచి బొర్రా గుహ‌ల‌కు వెళ్లండి. దారిపొడ‌వునా ఖాళీ చిప్స్ ప్యాకెట్లు, వాట‌ర్ బాటిళ్లు, ప్లాస్టిక్ బ్యాగులు ద‌ర్శ‌న‌మిస్తాయి. అర‌కు అనేది మ‌న‌కు ఓ కానుక‌. టూరిజం సెంట‌ర్‌. దాన్ని అంత గ‌లీజుగా త‌యారు చేశారు. అర‌కు టౌన్‌లో షాపుల ముంద‌రే ప్లాస్టిక్ కాలుష్యం క‌నిపిస్తుంది. ఈ ఏడాదిలో ఏమైనా మారిందేమో తెలియ‌దు. ఆ అవ‌కాశం త‌క్కువే. ఎందుకంటే మ‌న‌కే స్పృహ‌లేదు.

అదే త‌మిళ‌నాడు ఊటీకి వెళితే ఇంత అధ్వాన దృశ్యాలు క‌నిపించ‌వు. వాళ్లు త‌మ ప‌ర్యాట‌క ప్రాంతాన్ని సంర‌క్షించుకుంటున్నారు.
కానీ ఆశ్చ‌ర్య‌మైన విష‌యం ఏమంటే అత్యంత పేద దేశం, సంఘ‌ర్ష‌ణ‌ల‌తో అల్ల‌క‌ల్లోల‌మ‌య్యే రువాండా దేశం , ప్లాస్టిక్‌ని త‌రిమి కొట్టింది. మ‌న దేశంలోని మ‌ణిపూర్ కంటే చిన్న‌దైన రువాండాలో ప్లాస్టిక్ అమ్మితే మూడుల‌క్ష‌ల రువాండా ప్రాంకులు (రూ.23 వేలు) జ‌రిమానా విధిస్తారు. 2008లో ఒక చ‌ట్టం చేశారు. ప్లాస్టిక్ త‌యారు చేసినా, దిగుమ‌తి చేసుకున్నా, వాడినా, అమ్మినా శిక్షార్హులని.

చ‌ట్టం చేసి నిద్ర‌పోలేదు. జ‌రిమానాల‌తో ఆగ‌కుండా 80 మంది వ్యాపారుల‌ని జైళ్లో వేశారు. దాంతో ప్లాస్టిక్ వాడ‌కం త‌గ్గిపోయింది. రీసైక్లింగ్‌కి అనువుగా ఉన్న ప్లాస్టిక్‌ని మాత్ర‌మే అది కూడా ప‌రిమితంగా వాడుతారు.

నెల‌లో ఆఖ‌రి శ‌నివారం ఉద‌యం 8 నుంచి 11 వ‌ర‌కు వ్యాపారులు ఆగిపోతాయి. ట్రాఫిక్ నిలిచిపోతుంది. దేశంలోని ప్ర‌తి ఒక్క‌రూ ప‌రిస‌రాల‌ని శుభ్రం చేయాలి. 2020 నుంచి ప్లాస్టిక్ స్ట్రాలు క‌నిపించ‌కుండా చ‌ట్టం చేస్తున్నారు.

అయితే స‌మ‌స్య‌లు కొత్త రూపంలో వ‌స్తున్నాయి. ప్లాస్టిక్ స్మ‌గ్లింగ్ పెరిగింది. పొరుగు దేశాల నుంచి వ‌చ్చే ప్లాస్టిక్‌పై ఉక్కు పాదం మోపుతున్నారు.

మ‌న ప‌రిస్థితి బాగ‌లేదు. ముంబ‌య్‌లో రోజుకి 700 ట‌న్నులు ప్లాస్టిక్ చెత్త ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంటే , దాన్ని తీసుకెళ్లి స‌ముద్రంలో పోస్తున్నారు. అదంతా చేప‌లు తింటున్నాయి. ఆ చేప‌ల్ని మ‌ళ్లీ మ‌నం తిని ఆస్ప‌త్రుల చుట్టూ తిరుగుతున్నాం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి