iDreamPost

అమరావతి గ్రామాలకు పవన్‌ కళ్యాణ్‌.. ఈ సారి ఏమి చెబుతారో..?

అమరావతి గ్రామాలకు పవన్‌ కళ్యాణ్‌.. ఈ సారి ఏమి చెబుతారో..?

జనసేన అధినేత, సినీ నటడు పవన్‌ కళ్యాణ్‌ త్వరలో అమరావతి గ్రామాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నుంచి ప్రకటన వెలువడింది. అయితే పవన్‌ కళ్యాణ్‌ పర్యటన ఎప్పుడుంటుందనేది వెల్లడించలేదు. పర్యటన తేదీలను తర్వలోనే తెలియజేస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ ఒకే రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ గత కొన్ని రోజులుగా రాజధాని ప్రాంతంలోని కొన్ని గ్రామాల రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిందే. ఇప్పటికే ఒకసారి రైతులతో పవన్‌ కళ్యాణ్‌ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాజధానిగా అమరావతి కొనసాగుతుందని, దీన్ని ఎవరూ మార్చలేరని హామీ ఇచ్చారు. మూడు కాదు 30 రాజధానులు పెట్టుకున్నా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఒక్కటి చేసి అమరావతినే శాశ్వత రాజధానిగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. రెండున్నరేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు.

రైతులతో సమావేశం అయిన తర్వాత ఢిల్లీ పర్యటనకు వెళ్లిన పవన్‌ కళ్యాణ్‌ పొత్తులో భాగంగా ఉమ్మడి కార్యాచరణపై చర్చించేందుకు బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదంటూ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో మళ్లీ రాజధాని గ్రామాల్లో పర్యటించాలని పవన్‌ నిర్ణయించడంతో.. ఈ సారి రాజధానిపై ఎలా మాట్లాడతారు..? విభిన్న ప్రకటనలపై రైతులకు ఏమి చెబుతారు..? కొత్తగా ఏమి హామీ ఇస్తారు..? అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి