iDreamPost

నాడు పోరు గడ్డ.. నేడు ప్రగతి జెండా -పార్వతీపురం మన్యం జిల్లా ప్రస్థానం

నాడు పోరు గడ్డ.. నేడు ప్రగతి జెండా  -పార్వతీపురం మన్యం జిల్లా ప్రస్థానం

పార్వతీపురం, పాలకొండ.. రెండూ గిరిజన ప్రాంతాలే. ఆ రెండు పట్టణాలు తప్ప.. వాటి పరిధిలోని మిగిలినవన్నీ గిరిజన ప్రాబల్యం ఉన్న ప్రాంతాలే. శతాబ్దాలుగా కలిసి ఉంటూ అనుబంధాలను పెనవేసుకుని, కష్టసుఖాలను పంచుకుని ముందుకు సాగిన ఈ రెండు ప్రాంతాలు నాలుగు దశాబ్దాల క్రితం విడిపోయి చెరో జిల్లాలో చేరినా.. ఇన్నాళ్లకు రాష్ట్ర ప్రభుత్వ చొరవతో మళ్లీ ఒక్కటవ్వడమే కాకుండా.. తమకు తాము ఒక ప్రత్యేక జిల్లాగా అవతరించడం విశేషం. 1960 ప్రాంతంలో భూస్వాముల దోపిడీపై తిరుగుబాటు జెండా ఎగురవేసి.. సాయుధ గిరిజన రైతాంగ పోరాటంతో యావత్తు దేశం దృష్టిని తమవైపు తిప్పుకున్న పార్వతీపురం, పాలకొండ మళ్లీ ఏకమై మన్యం జిల్లాగా కొత్త చరిత్ర లిఖించేందుకు సిద్ధం అయ్యాయి.

విడిపోయి.. కలిశాయి..

1950 ఆగష్టు 15న శ్రీకాకుళం జిల్లా ఏర్పడినప్పుడు పార్వతీపురం, పాలకొండ, బొబ్బిలి తదితర ప్రాంతాలన్నీ ఆ జిల్లాలో చేరాయి. అనంతరం జరిగిన ఉద్యమాల ఫలితంగా 1979 జూన్ ఒకటో తేదీన విశాఖ, శ్రీకాకుళం జిల్లాల నుంచి కొన్ని తాలూకాలను విడదీసి విజయనగరం జిల్లా ఏర్పాటు చేశారు. అప్పటివరకు కలిసి ఉన్న ఏజెన్సీ ప్రాంతాలైన పార్వతీపురం, పాలకొండలను విడదీశారు. పాలకొండ శ్రీకాకుళం జిల్లాలో ఉండిపోగా, పార్వతీపురం విజయనగరం జిల్లాలో చేరింది. పాలనాపరంగా విడిపోయినా ఈ రెండు ప్రాంతాల మధ్య సంబంధాలు అలాగే కొనసాగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత.. మిగిలిన13 జిల్లాల ఏపీని అధికార వికేంద్రీకరణలో భాగంగా 26 జిల్లాలు చేయాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు శ్రీకాకుళం నుంచి పాలకొండ డివిజన్ ను, విజయనగరం నుంచి పార్వతీపురాన్ని వేరు చేసి.. సాలూరును కూడా కలిపి పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పాటు చేశారు. ఇందులో పార్వతీపురం, పాలకొండ, సాలూరు మున్సిపాలిటీలు తప్ప మిగిలిన మండలాలన్నీ గిరిజన ప్రాంతాలు కావడం విశేషం. కొత్త జిల్లాలో సాలూరు, పార్వతీపురం, పాలకొండ, కురుపాం నియోజకవర్గాలు, ఎక్కడా లేనివిధంగా రెండు ఐటీడీఏలు ఉన్నాయి.

సాయుధ పోరాట ఖిల్లా

కొండలు, అడవులతో గిరిజనులు అధికసంఖ్యలో ఉన్న పార్వతీపురం, పాలకొండ ఏజెన్సీ ప్రాంతాలు 1960 దశకంలో సాయుధ ఉద్యమంతో మొత్తం దేశాన్ని తమ వైపు తిప్పుకున్నాయి. శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటంగా చరిత్ర పుటలకు ఎక్కిన ఆ ఉద్యమం ఈ రెండు డివిజన్లలోని సీతంపేట, మొండెంఖల్, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, ఎల్విన్ పేట ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని సాగింది. 1958లో సీతంపేట మండలం మండ గ్రామంలో పల్లె రాములు అనే ఉపాధ్యాయుడి చొరవతో గిరిజన సంఘం ఏర్పాటుతో దీనికి అంకురార్పణ జరిగింది. భూస్వాముల దోపిడీ నుంచి గిరిజనులను రక్షించే లక్ష్యంతో మొదలైన గిరిజన సంఘాల ఏర్పాటు ప్రక్రియ 1960లో హాయగ్రీవరావు, పత్తిరాజు వంటి కమ్యూనిస్ట్ నేతల ప్రభావంతో ఎర్రజెండా పట్టుకుంది. 1961లో మొండెంఖల్ లో తొలిసారి 4వేల మందితో గిరిజన సంఘం మహాసభ నిర్వహించారు. వెట్టి చాకిరి నుంచి విముక్తి, కూలీరేట్ల పెంపు డిమాండ్లతో ఈ ఉద్యమం ఊరూరా పాకింది.

1962-63లో కురుపాం మండలం కొండబారిడి లో టీచరుగా పనిచేస్తున్న వెంపటాపు సత్యం, వీరఘట్టానికి చెందిన ఆదిభట్ల కైలాసం, చౌదరి తేజేశ్వర రావు, సుబ్బారావు పాణిగ్రాహి వంటి మహామహుల నాయకత్వంలో కొత్త పుంతలు తొక్కింది. వీరి ఆధ్వర్యంలో 1967 అక్టోబర్ 31న మొండెంఖల్ లో భారీ బహిరంగసభ తలపెట్టారు. ఆ సభకు వెళ్తున్న గిరిజనులను గుమ్మలక్ష్మీపురం భూస్వాములు అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య కొట్లాట జరిగింది. భూస్వాములు జరిపిన కాల్పుల్లో కోరన్న, మంగన్న అనే గిరిజనులు మృతి చెందడంతో గిరిజన రైతాంగ ఉద్యమం హింసాత్మక రూపం సంతరించుకుంది. గిరిజనులు కూడా ఆయుధాలు ధరించి భూస్వాములపై దాడులు చేయడం ప్రారంభించడంతో, సాయుధ పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. అదే సమయంలో నక్సల్బరీ ఉద్యమ నిర్మాతలు చారు ముజుందార్, కాను సన్యాల్, నాగభూషణ పట్నాయక్ శ్రీకాకుళ పోరాటానికి మద్దతుగా నిలవడంతో 1967 నుంచి 1970 వరకు మూడేళ్ల పాటు పార్వతీపురం, పాలకొండ ఏజెన్సీ అట్టుడికిపోయింది. అజ్ఞాతంలో ఉంటూ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం కురుపాం కొండల్లో ఉన్నట్లు తెలుసుకున్న సాయుధ బలగాలు 1970 జులై 10న వారిని చుట్టుముట్టి ఎన్కౌంటర్ చేయడం, ఆ తర్వాత అనేకమందిని అరెస్టు చేయడంతో ఉద్యమం చల్లబడింది.

అప్పటినుంచి ప్రగతిరేఖలు

ఆనాటి పోరాటం ఫలితంగానే ప్రభుత్వాలు గిరిజన ప్రాంతాల ప్రగతిపై దృష్టి సారించాయి. పార్వతీపురం, సీతంపేటల్లో ఐటీడీఏలు ఏర్పాటు చేశారు. జీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తుల కొనుగోళ్లు, రోడ్ల నిర్మాణాలు, నీటిపారుదల సౌకర్యాలు కల్పించారు. గిరిజనుల భూములకు రక్షణ కల్పించేందుకు వన్ ఆఫ్ సెవెంటీ చట్టం కూడా చేశారు. ఇప్పుడు ఆ ఏజెన్సీ ప్రాంతాలతోనే ప్రత్యేకంగా ఒక జిల్లా ఏర్పాటు చేసి.. మరింత అభివృద్ధికి జగన్ ప్రభుత్వం బాటలు వేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి