iDreamPost

ప్రభుత్వ చింత తీరింది.. అభ్యర్థుల్లో బెంగ నెలకొంది..

ప్రభుత్వ చింత తీరింది.. అభ్యర్థుల్లో బెంగ నెలకొంది..

మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ ప్రకటించినా.. రాష్ట్ర వ్యాప్తంగా 60.91 శాతం పోలింగ్‌ నమోదైంది. చెదురుమదురు ఘటనలను మినహా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. బ్యాలెట్‌ పేపర్లతో తప్పులు కారణంగా మూడు చోట్ల ఈ రోజు రీ పోలింగ్‌ జరుగుతోంది. ఏకగ్రీవాలు, అభ్యర్థులు మరణించిన చోట్ల మినహా రాష్ట్ర వ్యాప్తంగా 515 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరిగింది.

పోలింగ్‌ ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు పెద్ద ఊరట లభించినట్లైంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 45 ఏళ్లు దాటిన వారికి ఈ నెల 1వ తేదీ నుంచి వ్యాక్సిన్‌ వేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. మున్సిపల్‌ ఎన్నికలు ముగియడంతో పట్టణ ప్రాంతాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాలలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించేందుకు పరిషత్‌ ఎన్నికలు ఆటంకంగా మారాయి. ప్రజలకు వ్యాక్సిన్‌ అందించడంలో ఎదురవుతున్న అడ్డంకులపై సీఎం వైఎస్‌ జగన్‌ కూడా పలుమార్లు విచారం వ్యక్తం చేశారు. ఆరు రోజుల్లో ముగిసే పరిషత్‌ ఎన్నికలు పూర్తయితే వ్యాక్సినేషన్‌పై పూర్తి స్థాయిలో దృష్టి సారించవచ్చని పేర్కొన్నారు.

కొంత ఆలస్యమైనా.. పరిషత్‌ ఎన్నికలు ముగిసాయి. ఫలితాలే రావాల్సి ఉంది. అయితే పోలింగ్‌ ముగియడంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఒకట్రెండు రోజుల్లో గ్రామ సచివాలయాల్లో 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్‌ ఇచ్చే కార్యక్రమం ప్రారంభం కావడం లాంఛనమే.

పోలింగ్‌ ముగియడంతో ప్రభుత్వానికి ఉన్న చింత తీరింది. అయితే ఫలితాలు ఎప్పుడు వస్తాయోనన్న అంశంపై అభ్యర్థుల్లో బెంగ మొదలైంది. ఫలితాలు వచ్చే వరకూ అభ్యర్థుల్లో ఆందోళన తప్పదు. కోడ్‌ అమలు చేయడం లేదంటూ టీడీపీ నేత వర్ల రామయ్య దాఖలు చేసిన రిట్‌పిటిషన్‌పై స్పందించిన ఏపీ హైకోర్టు ఎన్నికలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సింగిల్‌ జడ్జి ఆదేశాలను ఎస్‌ఈసీ డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేయడంతో.. ఆ ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. ఎన్నికలు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసిన డివిజన్‌ బెంచ్‌.. ఫలితాలను మాత్రం వెల్లడించవద్దని ఉత్తర్వులు జారీ చేసింది.

హైకోర్టు తీర్పు నేపథ్యంలో పరిషత్‌ ఎన్నికల ఫలితాలు ఎప్పుడు వస్తాయనే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. సింగిల్‌ జడ్జి వద్ద ఉన్న పిటిషన్‌ తదుపరి విచారణ ఈ నెల 15వ తేదీన వచ్చేలా చర్యలు చేపట్టాలని హైకోర్టు రిజిస్ట్రీకి డివిజన్‌ బెంచ్‌ సూచించింది. సింగిల్‌ జడ్జి వద్ద ఉన్న వర్ల రామయ్య పిటిషన్‌పై విచారణ పూర్తయిన తర్వాతే పరిషత్‌ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మరి ఈ నెల 15వ తేదీన పరిషత్‌ ఎన్నికల కోడ్‌పై నెలకొన్న వివాదం హైకోర్టులో పరిష్కారం అవుతుందా..? లేదా..? వేచి చూడాలి.

Also Read : ఏపీలోనే ఉంటాం.. ఇక్కడే ఓట్లేస్తాం..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి