iDreamPost

పోటెత్తుతున్న ఓటర్లు.. మలిపోరులో పైచేయి ఎవరిది..?

పోటెత్తుతున్న ఓటర్లు.. మలిపోరులో పైచేయి ఎవరిది..?

పంచాయతీ రెండో దశ పోలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పల్లె ప్రజలు పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఈ రోజు ఉదయం 6:30 గంటలకు పోలింగ్‌ మొదలైనప్పటి నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల సందడి మొదలైంది. మధ్యాహ్నం 3:30 గంటల వరకే పోలింగ్‌ జరుగుతుండడంతో.. రోజులో తొలి అర్థభాగంలోనే పోలింగ్‌ పూర్తి అయ్యేలా అభ్యర్థులు ప్రయత్నాలు ప్రారంభించారు. త్వరగా ఓటు వేసేలా ఓటర్లను చైతన్యవంతులను చేస్తూ.. పోలింగ్‌ కేంద్రాలకు పంపుతున్నారు. దీంతో ఉదయం 10:30 గంటలకే 38.07 శాతం మేర పోలింగ్‌ నమోదైంది. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్‌ దాదాపు పూర్తయ్యే అవకాశం ఉంది.

జిల్లాల వారీగా చూస్తే.. ఉదయం 10:30 గంటలకు విజయనగరంలో అత్యధికంగా 48.80 శాతం మేర పోలింగ్‌ నమోదైంది. శ్రీకాకుళంలో 26.81 శాతం, విశాఖో 40.94, తూర్పుగోదావరిలో 34.51, పశ్చిమ గోదావరిలో 31.06, కృష్ణాలో 35.81, గుంటూరులో 45, ప్రకాశంలో 34.14, నెల్లూరులో 36.03, చిత్తూరులో 33.50, కడపలో 35.17, కర్నూలులో 46.96, అనంతపురం జిల్లాలో 46.18 శాతం చొప్పున పోలింగ్‌ నమోదైంది. అన్ని చోట్లా పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది.

రెండో విడతలో 13 జిల్లాలోని 18 రెవెన్యూ డివిజన్లలోని 167 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. రెండో దశలో 3,328 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 539 ఏకగ్రీవమయ్యాయి. రెండు పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో అక్కడ ఎన్నికలు ఆగిపోయాయి. మిగతా 2,786 పంచాయతీల్లో పోలింగ్‌ జరుగుతోంది. 7,507 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 33,570 వార్డులకు గాను 12,604 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 149 వార్డుల్లో ఒక్కరూ నామినేషన్లు వేయలేదు. మిగిలిన 20, 817 వార్డుల్లో 44,876 మంది పోటీ పడుతున్నారు.

పోలింగ్‌ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మొదట వార్డులు, ఆ తర్వాత పంచాయతీ ఓట్లు లెక్కించనున్నారు. రాత్రి కల్లా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. తొలి దశలో వైసీపీ బలపర్చిన అభ్యర్థులదే పై చేయి అయింది. 81 శాతం పంచాయతీలను వైసీపీ మద్ధతుదారులు గెల్చుకున్నారు. ఈ నేపథ్యంలో రెండో దశ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. వైసీపీ మద్ధతుదారులదే పై చేయి అవుతుందా..? టీడీపీ ఉనికి చాటుకుటుందా..? రాత్రికి తేలిపోతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి