iDreamPost

OTTలో ముందే వచ్చిన పీఎస్ 1.. కారణమిదే..!

OTTలో ముందే వచ్చిన పీఎస్ 1.. కారణమిదే..!

చెప్పాపెట్టకుండా పొన్నియన్ సెల్వన్ 1 అమెజాన్ ప్రైమ్ లో నిన్న అర్ధ రాత్రి నుంచి స్ట్రీమింగ్ మొదలైపోయింది. దీనికి సంబంధించి ఎలాంటి ముందస్తు ప్రమోషన్ కానీ యాడ్స్ కానీ కనిపించలేదు. సడన్ గా తమ యాప్ లో ఈ మూవీ లింక్ ని చూసి మెంబెర్ షిప్ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. కాకపోతే వారం రోజుల పాటు 199 రూపాయలు అద్దె కడితే తప్ప చూడలేని ఆప్షన్ ఇవ్వడంతో ఖంగు తినడం వాళ్ళ వంతైంది. ఒకవేళ చందాదారులు ఫ్రీగా చూడాలంటే మాత్రం ఇంకో వారం అంటే నవంబర్ 4 దాకా వెయిట్ చేయక తప్పదు. పిఎస్ 1 థియేటర్లలో రిలీజై ఇవాళ్టికి నెల రోజులు అయ్యింది. తమిళనాడులో ఇంకా సక్సెస్ ఫుల్ రన్ అవుతూనే ఉంది.

ఇలా చేయడానికి కారణాలున్నాయి. విడుదలకు ముందే జరిగిన అగ్రిమెంట్ లో భాగంగా నిర్మాతలు పొన్నియన్ సెల్వన్ కు నెల రోజులకు మించిన రన్ రాదని ముందే ఊహించారు. ఎంత బ్లాక్ బస్టర్ అయినా సరే అంతకు మించి ఆడే పరిస్థితులు నిజంగా లేవు. అందుకే థర్టీ డేస్ డీల్ కి ఓకే చెప్పేసి నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ చాలా ఫ్యాన్సీ ఆఫర్ ని సొంతం చేసుకుంది. కొంత ఎక్కువ రికవరీ రాబట్టుకోవాలనే ఉద్దేశంతో ఇలా సొమ్ములు కట్టి చూడండనే స్కీంని తెరపైకి తీసుకొచ్చింది. గతంలో కెజిఎఫ్ 2, సర్కారు వారి పాటకు ఇలాంటి పద్దతే తీసుకొచ్చినప్పుడు సోషల్ మీడియాలో చాలా విమర్శలు వచ్చాయి. అయినా ప్రైమ్ వెనుకడుగు వేయలేదు.

తమిళ వెర్షన్ నుంచి నాలుగు వందల కోట్లు రాబట్టుకున్న పొన్నియన్ సెల్వన్ తెలుగులో మాత్రం పది కోట్ల బ్రేక్ ఈవెన్ అందుకోవడానికి నానా తంటాలు పడింది. చోళుల నేటివిటీ మన ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. దీంతో సీక్వెల్ మీద కూడా ఇతర భాషల్లో పెద్దగా బజ్ లేదు. బాహుబలి రేంజ్ లో యునానిమస్ టాక్ వస్తుందని ఎదురు చూసిన అక్కడి మీడియా అది జరగకపోవడంతో రిలీజైన మొదటి వారం మన ప్రేక్షకుల అభిరుచిని ట్రోల్ చేస్తూ ట్వీట్లు గట్రా చేశారు. తర్వాత మనవాళ్ళు కాంతార బ్లాక్ బస్టర్ ని చూపించి నోరు మూయించారు. ఈ వారం ఏ భాషలోనూ థియేట్రికల్ గా చెప్పుకోదగ్గ పెద్ద రిలీజులు లేకపోవడం పిఎస్ 1 ముందు రావడానికి మరో రీజన్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి