iDreamPost

మొన్న రచ్చ గెలిచి.. నేడు ఇంట గెలిచావ్! నీ అక్షరఝరికి తిరుగేది చంద్రయ్యా!

  • Author ajaykrishna Updated - 03:24 PM, Fri - 25 August 23
  • Author ajaykrishna Updated - 03:24 PM, Fri - 25 August 23
మొన్న రచ్చ గెలిచి.. నేడు ఇంట గెలిచావ్! నీ అక్షరఝరికి తిరుగేది చంద్రయ్యా!

తెలుగు సినిమా పాట గురించి మరోసారి దేశమంతా మాట్లాడుకుంటోంది. నాటు నాటు పాట తర్వాత.. మరో తెలుగు పాటకు త్వరలో పట్టాభిషేకం జరగనుంది. తాజాగా 69వ జాతీయ సినీ పురస్కారాలలో తెలుగు పాట నాలుగోసారి ప్రాణం పోసుకుంది. ధం ధం ధం.. అంటూ సాగే ఆ పాట.. ఈ ఏడాది తెలుగు పరిశ్రమకు ఆస్కార్ తెచ్చిపెట్టిన కాంబినేషన్ నుండే వచ్చింది. ఎవరి గురించో అర్ధమైందిగా.. గేయరచయిత చంద్రబోస్ – సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు పాటతో రచ్చ గెలిచిన ఈ కాంబో.. ఇప్పుడు కొండపొలం సినిమాలోని ధం ధం ధం పాటతో ఇంట(ఇండియా) గెలిచింది.

కీరవాణి కట్టిన బాణీకి.. అడవి తల్లిని అభివర్ణిస్తూ అందమైన అక్షరాలు కూర్చి.. అద్భుతమైన పాటను అందించారు చంద్రబోస్. ఈయన గురించి.. ఈయన పాటల గురించి పరిచయం అక్కర్లేదు. 90ల కాలం నుండి ఇప్పటిదాకా ప్రతిరోజూ ఏదొక సందర్భంలో.. చంద్రబోస్ పాట ఏదొక విధంగా వింటూనే ఉంటాం. ప్రస్తుతం తెలుగు సినిమా పాటకు బాస్ అయ్యారు బోస్. మొన్న అంతర్జాతీయ వేదికపై ఆస్కార్.. నేడు జాతీయ వేదికపై మరో అవార్డు. పచ్చ పచ్చని చెట్టు చేమ పట్టు చీరలంటా.. నల్ల నల్ల ముళ్ల కంప నల్లపూసలంటా.. అంటూ చంద్రబోస్ అడవి తల్లిని వర్ణించిన తీరుకు నేషనల్ అవార్డు సైతం దాసోహం అయిపోయింది. వెరసి.. బోస్ పాట ఉత్తమ గీతంగా ఎంపికైంది.

మనకు తెలిసిన పదాల వాడుకతో.. అటు అడివి తల్లిని.. ఇటు జీవితాన్ని అక్షరాలతో స్పృశించిన బోస్.. నేడు ఆకాశమంత ఎత్తుకు ఎదిగారు. నాటు నాటు పాటలో.. కిర్రుసెప్పు, కర్రసాము, మర్రిసెట్టు, కుర్రగుంపు, ఎర్రజొన్న, మిరపతొక్కు.. లాంటి జనపదాలను పాటగా కూర్చారు. ఇప్పుడు కొండపొలం సినిమాకి గాను ధం ధం.. అంటూ జాతీయ పురస్కారం కైవసం చేసుకున్నారు. ఇది తెలుగు సినిమాకు దక్కిన నాలుగో జాతీయ అవార్డు. 1974లో ‘తెలుగువీర లేవరా’ పాటకు శ్రీశ్రీ.. 1993లో ‘రాలిపోయే పువ్వా’ పాటకు వేటూరి సుందరరామమూర్తి.. 2003లో ‘నేను సైతం’ పాటకు సుద్దాల అశోక్‌ తేజ జాతీయ ఉత్తమ గేయ రచయిత పురస్కారాలు అందుకున్నారు. రెండు దశాబ్డాల తర్వాత మళ్లీ తెలుగు పాటకు జాతీయ స్థాయి పట్టం కట్టారు చంద్రబోస్. అందుకుగాను ‘చంద్రయ్యా నీ పాటకు తిరుగేదయ్యా!’ అని తెలుగుజనం ఘనంగా అభినందిస్తుంది. సాహో తెలుగోడు.. చంద్రబోస్ మనోడు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి