iDreamPost

కోరి కొరివితో తల గోక్కుంటున్నారా..!?

కోరి కొరివితో తల గోక్కుంటున్నారా..!?

ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఉప ఎన్నికల సందడి కొనసాగుతోంది. తెలంగాణాలో దుబ్బాక ఉప ఎన్నిక ఆ రాష్ట్ర అధికార పార్టీకి వ్యతిరేకంగా రావడంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రత్యర్ధి పార్టీలు వైఎస్సార్‌సీపీకి తిరుపతి పార్లమెంటరీ స్థానంలో వ్యతిరేకమైన ఫలితాల కోసం ఆశతో ఎదురు చూస్తున్నాయి. అందులో భాగంగానే తమ వాస్తవ శక్తికి మించి ప్రకటనలతో మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. వీటిని పరిశీలిస్తున్న రాజకీయ వర్గాలు, ప్రస్తుతం ఏపీలో ప్రత్యర్ధి పార్టీలుగా ఉన్న తెలుగుదేశం, బీజేపీ–జనసేనలు కొరివితో తల గోక్కుంటున్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అయితే వీటిని ఏ మాత్రం పట్టించుకోకుండా టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబుబాబు నాయుడు మరో అడుగు మందుకేసి తిరుపతి ఉప ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు చారిత్రక అవసరం అని డప్పేస్తున్నారు.

నిజానికి తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీది నామమాత్రపు బలమేనని గతంలోనే చాల ఎన్నికల్లో స్పష్టమైంది. మొన్నటికి మొన్న వైఎస్సార్‌సీపీ అధికారంలో లేకపోయినప్పటికీ ఆ పార్టీ ఎంపీ అభ్యర్ది బల్లి దుర్గాప్రసాదరావు దాదాపు 2 లక్షలకు పైగా ఓట్లతో గెలిచారు. ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్క తిరుపతి అసెంబ్లీ స్థానం తప్పితే మిగిలిన అన్ని చోట్లా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు భారీ మెజార్టీలనే పొందారు. ఇప్పుడు ఆ పార్టీయే అధికారంలో ఉంది. అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తోంది. దీంతో ఇక్కడ గెలుపుపై వైఎస్సార్‌సీపీ భారీ ధీమాతోనే వ్యవహరిస్తోంది.

అయితే 1952లో మొదలు పెడితే తిరుపతి ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీ 12 సార్లు గెల్చుకుంది. టీడీపీ ఆవిర్భవించిన 1984లో మాత్రం టీడీపీ అభ్యర్ధి ఇక్కడ గెలుపొంది. ఆ తరువాత మళ్ళీ 1999లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. కానీ 2014, 2019 ఎన్నికల్లో వరుసగా వైఎస్సార్‌సీపీ అభ్యర్ధులే ఇక్కడ విజయాన్ని దక్కించుకుంటున్నారు. దీనిని బట్టే తిరుపతి పార్లమెంటులో ఎవరు ఎక్కువ బలవంతులో అర్ధం చేసుకోవచ్చు.

ఈ లెక్కలు పరిశీలించిన తరువాత కూడా చంద్రబాబు నాయుడు తమ విజయం చారిత్రక అవసరం అంటూ స్టేట్‌మెంట్లు ఇవ్వడం పట్ల రాజకీయ విమర్శకులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు ఆయనకు వాస్తవ పరిస్థితి అర్ధమవుతోందా? అన్న సందేహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ ఏదైనా ప్రత్యేక వ్యూహాన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు మాట్లాడి ఉంటారని ఊహించినప్పటికీ.. జీహెచ్‌యంసీ ఎన్నికల్లో టీడీపీకి ఎదురైన పరిస్థితే తిరుపతిలో కూడా ఉంటుందని అధికార వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు నాయకులు బాహాటంగానే విమర్శలకు దిగుతున్నారు.

బలాబలాలు ఇలా..

తిరుపతి పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నిసార్లు గెలిచినప్పటికీ ఇప్పుడా సీన్‌ లేదనే చెప్పాలి. మరో వైపు 1999లో బీజేపీ అభ్యర్ధి గెలవడం తప్పితే అంతకు ముందుగానీ, ఆ తరువాత గానీ పోటీలో నిలిచిన అభ్యర్ధులు నోటాతోనే పోటీపడినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున చిరంజీవి ఎమ్మెల్యేగా గెలవడం, 2019లో జనసేన తరపున పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్ధికి పాతికవేలు రావడం ఒక్కటే ఇతర పార్టీలకు అనుకూలంగా తెలియవస్తున్న లెక్కలు. అయితే ఇవి పోటీలో ఉన్న వ్యక్తిని బట్టి మాత్రనే గెలుపులు సాధ్యమయ్యాయని చెప్పక తప్పుదు. ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుస్తామని ఒక పక్క చెబుతూనే, మమ్మల్ని గెలిపించడి బాబూ.. అంటూ ప్రజలను దేవురిస్తున్న దాఖలాలు పలు పార్టీల నుంచి వెలువడుతున్నాయి.

ఇటువంటి పరిస్థితుల్లో ఆచితూచి వ్యహరించకపోతే కొరివితో తలగోక్కున్నట్టే ఉంటుందని పలువురు విశ్లేషకులు హితవు పలుకుతున్నారు. వీటిని ఆయా పార్టీలు ఎంత వరకు తలకెక్కించుకుంటాయో ఉప ఎన్నిక వరకు వేచి చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి