iDreamPost

ప్రభుత్వ చర్యకు విపక్ష అభ్యర్థుల సెల్యూట్‌

ప్రభుత్వ చర్యకు విపక్ష అభ్యర్థుల సెల్యూట్‌

గతంలో స్థానిక సంస్థల ఎన్నికలంటే రాత్రి పగలూ తేడా లేకుండా గ్రామాలు, పట్టణాల్లో అన్ని చోట్లా మద్యం, డబ్బు పంపకాలు ఉండేవి. కాలక్రమంలో అదో సాధారణ ప్రక్రియగా మారిపోయే పరిస్థితి తలెత్తింది. మద్యం, మనీ ప్రలోభాలతో ఎన్నికలు సజావుగా జరిగేవి కావు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ నేపథ్యంలో గత ఎన్నికలకు భిన్నంగా మద్యం, డబ్బు వినియోగం భారీగా తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యకు గ్రామాల్లో విపక్ష నేతలు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తప్పనిసరిగా మద్యం, డబ్బు అవసరమయ్యేదని, అప్పులు చేయాల్సి వచ్చేదని, ఇప్పుడు మద్యం అందుబాటులో లేకపోవడంతో ఆ బాధ తప్పిందని పేర్కొంటున్నారు. ఇంతకముందు అప్పులు తీర్చడానికి భూములు, ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చేదని, ఇప్పుడు ఎన్నికల ఖర్చు భారీగా తగ్గిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం, మనీని దూరం ఉంచుతామంటూ చెప్పడమే కాదు.. ఆచరణలోనూ చూపుతోంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. తన, మన, పర భేదం లేకుండా రాష్ట్రంలో ఎక్కడ మద్యం ఆనవాళ్లు కనిపించినా ఉక్కుపాదం మోపేలా ఆదేశాలివ్వడంతో పోలీసు అధికారులు చురుగ్గా పనిచేస్తున్నారు. పోలీస్‌ శాఖకు చెందిన పదివేల మంది పోలీసులు, ఎక్సైజ్‌కు చెందిన నాలుగు వేల మందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఆపరేషన్‌ సురా పేరుతో రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేస్తున్నారు. 700 పోలీస్‌ చెక్‌పోస్టులతోపాటు ప్రత్యేకం 62 మొబైల్‌ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. వారం రోజుల్లో 5వేల లీటర్ల నాటుసారా, 3వేల మద్యం బాటిళ్లు, 3,500 కిలోల గంజాయి, 30వేల ప్యాకెట్ల గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. 1600 మంది కేసులు నమోదు చేసి, 1562 మందిని అరెస్టు చేశారు. ఎన్నికల కోసం నాయకులు సిద్ధం చేసిన కోటి 80 లక్షల రూపాయల నగదును, రెండు కిలోలకుపైగా బంగారాన్ని, భారీగా బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నిఘా యాప్‌ ద్వారా 12 కేసుల నమోదయినట్లు అధికారులు చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి