iDreamPost

ఉల్లి వ్యాపారుల వద్ద 30 లక్షలు వసూలు – తిరిగిచ్చేయాలన్న వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే

ఉల్లి వ్యాపారుల వద్ద 30 లక్షలు వసూలు – తిరిగిచ్చేయాలన్న వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే

రాజమహేంద్రవంలోని గోదావరి నది ఒడ్డున ఛాంబర్ ఆఫ్ కామర్స్ కల్యాణ మండపం. నూతనంగా ఎన్నికైన ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ పాలక వర్గానికి సన్మానం కార్యక్రమం. వేదికపై మంత్రి తానేటి వనిత, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భారత్ రామ్, టిడిపి వ్యవస్థాపక సభ్యుడు, సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరీ, రాజానగరం ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, వివిధ వ్యాపార సంఘాల ప్రతినిధులు ఆసీనులైయ్యారు. ఆహ్వానం లేదో, లేక ఉన్నా రాలేకపోయారో గాని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే (టిడిపి) ఆది రెడ్డి భవాని కార్యక్రమంలో లేరు.

నేతల ప్రసంగాలు ముగిసాయి. ఛాంబర్ నేతలకు సన్మానం చేశారు. మరి కొద్దీ సేపట్లో కార్యక్రమం ముగుస్తుంది. నేతలు వేదిక దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో యువ ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా ఒక్క నిమిషం అంటూ మైక్ తీసుకున్నారు. ” ఉల్లి మార్కెట్ ను తరలిస్తామని గత ప్రభుత్వ హయాంలో వ్యాపారుల నుంచి ఓ నేత 30 లక్షలు వాసులు చేశారు. కానీ చేయలేదు. వ్యాపారుల నుంచి తీసుకున్న డబ్బులు మర్యాదగా తిరిగి ఇచ్చేయాలి. ఇక్కడ పెద్దలు బుచ్చయ్య చౌదరిగారు కూడా ఉన్నారు కాబట్టి ఇంతకన్నా ఏమి మాట్లాడడంలేదు. వాళ్ళు పేర్లు బయటకు చెప్పడం లేదు. వారు ఎమ్మెల్యే ఐనా, ఇంకేదైనా సరే.. వ్యాపారుల వద్ద తీసుకున్న 30 లక్షలు తిరిగి ఇవ్వకపోతే ప్రభుత్వం క్రిమినల్ చర్యలు తీసుకుంటుంది” అని జక్కంపూడి రాజా హెచ్చరించారు.

ఇదంతా ఉల్లి వ్యాపారులకు తెలిసిన విషయమే ఐనా ఇతర వ్యాపారులకు మాత్రం కొత్తగా తెలియడంతో ఎవరు 30 లక్షలు తీసుకుంది.. అంటూ ఉల్లి వ్యాపారులను అడగడం మొదలెట్టారు. గత ప్రభుత్వంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా ఆకుల సత్యనారాయణ(బిజెపి), రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ గా ఆదిరెడ్డి అప్పారావు లు రాజమహేంద్రవరం నుంచి టిడిపి తరఫున ప్రాతినిధ్యం వహించారు. మొన్న జరిగిన ఎన్నికల్లో సిటీ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు ఆదిరెడ్డి భవాని ఎన్నికయ్యారు. రూరల్ నియోజకవర్గం నుంచి తిరిగి బుచ్చయ్య చౌదరి గెలిచారు.

రాజమహేంద్రవం కేంద్రంగా హోల్ సేల్ ఉల్లి వ్యాపారం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రకు ఉల్లి సరఫరా జరుగుతోంది. ఏళ్ల తరబడి ఈ వ్యాపారం నగరం బొడ్డున ఉన్న రంభ, ఊర్వశి, మేనక సినిమా హాళ్లు సెంటర్లోని నగరపాలక సంస్థ స్థలం లో జరుగుతోంది. ఉల్లి తో లారీలు నగరంలోకి రావడం, ఇక్కడ నుంచి సరుకు తిరిగి ఇతర ప్రాంతాలకు వెళ్లదానికి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫలితంగా వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. ఉల్లి మార్కెట్ ను ఇక్కడ నుంచి నగర శివారున, జాతీయ రహదారి సమీపంలోకి మార్చాలని వ్యాపారులు కొన్నేళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

వ్యాపారుల వినతి మేరకు రాజమహేంద్రవరం శివారు జాతీయ రహదారి పక్కన బొమ్మూరు గ్రామంలో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు. లీజు రూపంలో కాకుండా తమకు స్థలం విక్రయించాలని, ధర విషయంలో సరళంగా వ్యవహరించాలని ఉల్లి వ్యాపారాలు విజ్ఞప్తిలు చేశారు. ప్రజా ప్రతినిధులను కలిశారు. ఈ క్రమంలో అప్పట్లో నగరానికి చెందిన ప్రజాప్రతినిధి వ్యాపారులకు అనుగుణంగా స్థలం ఇప్పిస్తామని ముందుకొచ్చారు. ఇందు కోసం దాదాపు 50 మంది ఉల్లి వ్యాపారులు 30 లక్షలు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.

కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో సదరు ప్రజాప్రతినిధి కుటుంభం నుంచి అభ్యర్థి గెలిచినా, రాష్ట్రంలో ఆ నేత పార్టీ అధికారం కోల్పోయింది. ఫలితంగా ఉల్లి వ్యాపారుల సమస్య అపరిష్కృతంగా ఉంది. కానీ వారు చెల్లించిన 30 లక్షలు మాత్రం వెనక్కి రాలేదు. డబ్బులు ఇవ్వాలని అడిగే సాహసం వ్యాపారాలు చేయడంలేదు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే రాజా ఉల్లి వ్యాపారుల నగదు తిరిగి ఇప్పించేందుకు చొరవ తీసున్నారని వ్యాపారులు పేర్కొంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి