iDreamPost

ఐపీఎల్ కొత్త తేదీలను సోమవారం నాడు ప్రకటిస్తా: గంగూలీ

ఐపీఎల్ కొత్త తేదీలను సోమవారం నాడు ప్రకటిస్తా:  గంగూలీ

ఐపీఎల్ 2020 సీజన్ మరొక సారి వాయిదా పడటం ఖాయమైంది.ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణపై సోమవారం స్పష్టతనిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ అన్నారు.ఐపీఎల్‌ 13వ సీజన్‌ నిర్వహణపై శనివారం ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు.ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌లో ఉండి ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయినప్పుడు క్రీడల భవిష్యత్‌ ఏముంటుందని ప్రశ్నించారు.నేటి విపత్కర పరిస్థితులలో ఐపీఎల్‌ నిర్వహించడం కష్టసాధ్యమని స్పష్టం చేశారు.సోమవారం నాడు ఐపీఎల్ ఫ్రాంఛైజీ యాజమాన్యాలతో,బీసీసీఐ అధికారులతో చర్చించిన తర్వాత పూర్తి సమాచారాన్ని వెల్లడిస్తామని ప్రకటించారు.

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఏం జరుగుతుందో మనమంతా గమనిస్తున్నాం.నేటి పరిస్థితులలో మేం ఏం చెప్పలేం.అయినా ఇప్పుడు చెప్పడానికి ఏముంది.దేశంలో విమానాశ్రయాలు మూతపడ్డాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు, ఆఫీసులు లాక్‌డౌన్‌లో ఉన్నాయి.ఈ పరిస్థితి మే మధ్య వరకూ కొనసాగే అవకాశం ఉంది.ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ ఆటగాళ్లను ఎక్కడి నుంచి వస్తారు. ఐపీఎల్‌ను పక్కన పెట్టండి.కాస్త ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే ప్రపంచంలో ఎక్కడా ఏ క్రీడలు నిర్వహించడానికి కూడా అవకాశం లేదు అని గంగూలీ తీవ్ర పదజాలంతో వ్యాఖ్యానించారు.ఆఖరిలో ఈ ఏడాది ఐపీఎల్‌ నిర్వహణపై స్పందిస్తూ సోమవారం అప్‌డేట్‌ ఇస్తానని చెప్పారు.

ఐపీఎల్ 13వ సీజన్ షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.కానీ కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం విదేశీ వీసాలను ఏప్రిల్ 15 వరకు రద్దు చేయడంతో పాటు 21 రోజుల లాక్‌డౌన్‌ని దేశవ్యాప్తంగా కేంద్రం విధించింది.దీంతో ఐపీఎల్-2020 సీజన్‌ని ఏప్రిల్ 15 వరకూ భారత క్రికెట్ నియంత్రణ మండలి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్న పరిస్థితుల్లో కొన్ని రాష్ట్రాల సూచనల మేరకు ప్రధాని మోడీ మరో రెండు వారాలు లాక్‌డౌన్‌ని పొడిగించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

వాస్తవానికి ఏప్రిల్ 15 తర్వాత ఐపీఎల్-2020 సీజన్ ప్రారంభించడానికి వివిధ తేదీలపై బీసీసీఐ ముమ్మరంగా కసరత్తు చేసింది.కానీ దేశంలో కరోనా ఎఫెక్ట్‌తో ఐపీఎల్ టోర్నీ నిర్వహణకు సానుకూల వాతావరణం లేదు.దీంతో ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీ రద్దయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని బీసీసీఐ వర్గాల నుంచి వార్తలు వెలువడుతున్నాయి.ఒకవేళ ఐపీఎల్ రద్దయితే సుమారు రూ. 3వేల కోట్లు బీసీసీఐ నష్టపోతుందని అంచనా వేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి