iDreamPost

సిక్కోలు తీరంలో కూర్మ రక్షణ ఉద్యమం

సిక్కోలు తీరంలో కూర్మ రక్షణ ఉద్యమం

నిశి రాత్రి. అంతటా గాఢాంధకారం. పైన ఆకాశంలో మిణుకు మిణుకుమంటున్న నక్షత్రాలు.. కింద సముద్ర అలల హోరు. ఆ సమయంలో దూరంగా కొన్ని గుడ్డి దీపాల వెలుగులు.. మెల్లగా తీరానికి దగ్గరగా వస్తున్నాయి. దగ్గరికి వచ్చాక తెలిసింది అవి టార్చ్ లైట్ల వెలుగులని. వాటి సాయంతో వచ్చినవారు నిశ్శబ్దంగా ఇసుక తిన్నెల్లోని బొరియ(గుంతలు)ల్లో ఉన్న గుడ్లను తీసి తమతో తెచ్చుకున్న సంచుల్లో వేసుకుని ఎంత నిశ్శబ్దంగా వచ్చారో అంతే నిశ్శబ్దంగా జారుకున్నారు. ఇదంతా చూస్తే ఆ ఆగంతకులు ఏదో అక్రమ వ్యవహారాలకు పాల్పడుతున్నారని అనుమానం కలగడం సహజం. కానీ వారు చేస్తున్నది ఓ బృహత్తర కార్యక్రమం. ఒక అరుదైన జాతి మనుగడను కాపాడే మహా ఉద్యమం. అదే ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణ యజ్ఞం.

రెండు దశాబ్దాలుగా సాగుతున్న ఉద్యమం

ఆలివ్ రిడ్లే తాబేళ్లు అరుదైన సాగర జీవులు. ఈ ప్రాంతానికి చెందినవి కూడా కావు. ఇవి పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లో ఎక్కువగా జీవిస్తుంటాయి. కానీ తమ సంతానోత్పత్తికి మాత్రం సముద్రంలో వేల నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించి బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలతో పాటు తమిళనాడులోని కొన్ని తీర ప్రాంతాలకు చేరుకుంటాయి. ముఖ్యంగా ఒడిశాలోని గంజాం జిల్లా, ఆంధ్రలో శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంతాల్లోని తీరాలు, వాతావరణ పరిస్థితులు వీటి సంతానోత్పత్తికి అనుకూలమైన ప్రదేశాలని నిపుణులు చెబుతున్నారు. అందుకు ఏటా వేల సంఖ్యలో ఆలివ్ రిడ్లేలు శ్రీకాకుళం తీరానికి అతిధుల్లా వస్తుంటాయి.

జనవరి నుంచి మార్చి వరకు గుడ్లు పెట్టి పిల్లలను పొదుగుతుంటాయి. అయితే తీర ప్రాంతాల్లో జనసంచారం, వాహనాల రొద పెరగడంతోపాటు కాకులు, గద్దలు, కుక్కలు ఇవి పెట్టే గుడ్లను, చాలా సందర్భాల్లో తాబేళ్లను కూడా చంపేస్తుండటంతో వాటి మనుగడతో పాటు సంతానోత్పత్తి కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది. దాంతో మన తీరానికి వచ్చే ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంతానోత్పత్తి, సంరక్షణ బాధ్యతలను ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థల సహకారంతో చేపట్టింది. సుమారు రెండు దశాబ్దాలుగా ఈ యజ్ఞం నిర్వహిస్తోంది.

నిశీధిలోనే.. నిశ్శబ్దంగా..

ఆలివ్ రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టేటప్పుడు వాతావరణం చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండాలి.. ఎవరికీ కనిపించకుండా చీకట్లో ఆ పని చేస్తాయి. అర్థరాత్రి దాటిన తర్వాత రెండు నుంచి 5.30 గంటల మధ్య ఇవి కడలి నుంచి ఇసుక తిన్నెలపైకి చేరుకుంటాయి. ఇసుకలో స్వయంగా బొరియలు తవ్వి వాటిలో గుడ్లు పెడతాయి. వెలుగు రేఖలు విచ్చుకోకముందే పని పూర్తి చేసుకుని తిరిగి కడలి గర్భంలోకి వెళ్లిపోతాయి. అవి అటు వెళ్లగానే కొందరు వలంటీర్లు అక్కడికి చేరుకుని టార్చ్ లైట్ల వెలుగులో ఆ గుడ్లను సేకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రాలకు (హ్యాచరీలు) తరలిస్తారు.

గుడ్లుగా వచ్చి బుల్లి తాబేళ్లుగా కడలిలోకి

శ్రీకాకుళం జిల్లాలో 193 కిలోమీటర్ల తీర ప్రాంతం పరిధిలో ఆలివ్ రిడ్లేల గుడ్లు పొదగడానికి అటవీ శాఖ, ట్రీ ఫౌండేషన్ అనే సంస్థ సంయుక్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. జిల్లా పరిధిలో బారువ సెక్షన్లో 5, కవిటి సెక్షన్లో 3, టెక్కలి సెక్షన్లో 4, శ్రీకాకుళం, వజ్రపుకొత్తూరు సెక్షన్లలో 2 చొప్పున మొత్తం 16 సంరక్షణ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వీటి పరిధిలో 41 మంది వలంటీర్లు పని చేస్తున్నారు. వీరు సేకరించిన గుడ్లను ఈ కేంద్రాల్లో పిల్లలు అయ్యేవరకు అతి జాగ్రత్తగా కాపాడుతారు. వాతావరణ ఉష్ణోగ్రతలను బట్టి 45 నుంచి 70 రోజుల వ్యవధిలో గుడ్లు పిల్లలుగా మారతాయి. పుట్టిన బుల్లి తాబేళ్లను తిరిగి జాగ్రత్తగా తీసుకెళ్లి సముద్రంలో విడిచిపెడతారు. ఈ సీజనులో ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటివరకు సుమారు 35 వేల గుడ్లు సేకరించి సంరక్షిస్తున్నారు. సముద్రంలోని నాచు, కొన్ని రకాల మొక్కలను తిని జీవించే ఆలివ్ రిడ్లే తాబేళ్లు సాగర గర్భంలోని శిలలను కూడా శుద్ధి చేస్తాయి. జీవ వైవిధ్య పరిరక్షణకు దోహదం చేసే అరుదైన ఈ రకం తాబేళ్లను రక్షించుకోవాల్సి ఉండగా ఈ మధ్య అక్రమ రవాణా, చంపి మాంసం అమ్మడం వంటి దురాగతాలకు అనేకమంది పాల్పడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి