iDreamPost

మంచి ప్రేమకథను వద్దంటామా – Nostalgia

మంచి ప్రేమకథను వద్దంటామా – Nostalgia

ప్రతిసారి ప్రేమకథలను కొత్తగా చెప్పలేం. వీటిలోనూ ఫార్ములా ఉంటుంది. దాన్ని దాటి బయటికి రావడం కష్టం. అయితే ఎమోషన్ ప్లస్ ఎంటర్ టైన్మెంట్ పర్ఫెక్ట్ గా కుదిరితే జనం గతంలో చూసిన స్టోరీనే అయినా పెద్దగా పట్టించుకోరు. ఘనవిజయం చేకూరుస్తారు. దానికో మంచి ఉదాహరణ నువ్వొస్తానంటే నేనొద్దంటానా. 2004 సంవత్సరం. నిర్మాత ఎంఎస్ రాజు సుడి మాములుగా లేదు. మనసంతా నువ్వే, వర్షం, ఒక్కడు ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి పాత రికార్డుల దుమ్ము దులిపాయి. సరిగ్గా అదే సమయంలో నృత్య దర్శకుడు ప్రభుదేవా డైరెక్షన్ కోసం ప్రయత్నాలు చేస్తుండగా అనుకోకుండా ఈ కాంబో కుదిరింది.

వర్షంకు బాలీవుడ్ మూవీ ‘తేజాబ్’ను స్ఫూర్తిగా తీసుకుని అద్భుతమైన కథను అల్లిన తరహాలో ఈసారి అదే టైంలో వచ్చిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ ‘మైనే ప్యార్ కియా’ తీసుకునే సాహసం చేశారు కథారచయిత వీరు పోట్ల. రెండింటి మధ్య 15 ఏళ్ళ గ్యాప్ ఉంది కాబట్టి సమస్య రాదని ఇప్పటి జనరేషన్ కు తగ్గట్టు కొత్త ట్రీట్ మెంట్ తో చూపిస్తే ఫ్యామిలీ ఆడియన్స్ హిట్ చేయిస్తారని ఆయన నమ్మకాన్ని రాజు కాదనలేకపోయారు. అంతే తను, వీరు పోట్ల, పరుచూరి సోదరులు, ప్రభుదేవా కలిసి దీనికో రూపాన్ని తీసుకొచ్చారు. బొమ్మరిల్లు దెబ్బకు యూత్ లో హాట్ ఫెవరెట్ గా మారిన సిద్ధార్థ్ హీరోగా వర్షంతో మెరిసిన త్రిషను హీరోయిన్ గా ఎంచుకున్నారు.

స్థూలంగా చూస్తే మైనే ప్యార్ కియా, నువ్వొస్తానంటే నేనొద్దంటానా రెండిట్లో మెయిన్ పాయింట్ ఒకటే. హిందీలో తండ్రి పాత్రను తెలుగులో అన్నయ్యగా మార్చారు. ఇంటర్వెల్ బ్లాక్, సెకండ్ హాఫ్ లో అధిక శాతం రెండు సినిమాల్లో ఒకేలా ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన పాటలు సినిమా స్థాయిని పెంచాయి. శ్రీహరి క్యారెక్టర్ ని తీర్చిదిద్దిన తీరు, త్రిష సిద్దార్థ ఇంటికి వెళ్ళాక అక్కడ సెట్ చేసిన కామెడీ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేశాయి. రెండో సగంలో గ్రామీణ నేపథ్యం బాగా వర్కౌట్ అయ్యింది. 2005 జనవరి 14 మంచి అంచనాలతో నువ్వొస్తానంటే నేనొద్దంటానా రిలీజయింది. అదేరోజు పోటీగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ నా అల్లుడు, సుమంత్ ధన 51లను ఈజీగా ఓవర్ టేక్ చేసి మరీ బ్లాక్ బస్టర్ సాధించింది. 5 నంది అవార్డులు, 12 ఫిలింఫేర్ పురస్కారాలు గెలుచుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి