iDreamPost

నందమూరి సోదరుల నిర్ణయం భేష్

నందమూరి సోదరుల నిర్ణయం భేష్

రేపు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి జయంతి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ఈ నట సార్వభౌముడికి ఏటా కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి నివాళి అర్పించడం రివాజు. అందులో భాగంగా బాలకృష్ణతో పాటు ఆయన ఫ్యామిలీ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అందరూ వెళ్తుంటారు . అయితే ఈ ఏడాది అనూహ్యంగా లాక్ డౌన్ టైంలో ఈ సందర్భం వచ్చింది. కాని నందమూరి బ్రదర్స్ జనం గుమికూడకూడదనే ఉద్దేశంతో అక్కడిని వెళ్ళే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.

దానికి బదులుగా తాతయ్యకు ఇంట్లోనే ఘన నివాళి అర్పించాలని నిర్ణయించుకున్నారు. ఇది చాలా మంచి డెసిషన్ అని చెప్పాలి. ఎందుకంటే తారక్ వస్తున్నాడంటే వైరస్ భయాన్ని పక్కన పెట్టేసి మరీ అభిమానులు అక్కడికి వెల్లువెత్తారు. అందుకే మనసుకు కష్టమైనా నందమూరి సోదరులు తమ ఆలోచన ఈసారి మానుకున్నారు. గత ఏడాది ఇదే తరహాలో తెల్లవారుఝామున తారక్ తాతయ్య ఘాట్ కు వెళ్ళినప్పుడు అక్కడ పరిసరాలు అంత శుభ్రంగా లేకపోవడంతో పాటు అలంకరణ చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం మీడియాలో కూడా హై లైట్ అయ్యింది.

ఇప్పుడు కరోనా జాగ్రత్తలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల సోషల్ మీడియాతో పాటు ప్యాన్స్ లోనూ హర్షం వ్యక్తమవుతోంది. సెలెబ్రిటీలు ఇలా ఆదర్శంగా నిలిస్తే ఖచ్చితంగా వాళ్ళను అభిమానించే వాళ్ళలోనూ మార్పు వస్తుంది. అసలే కరోనా కేసులు గతవారం రోజులుగా దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. అమాయకత్వం వల్లనో లేదా హీరోలను పిచ్చిగా ప్రేమించే వాళ్ళ వల్లనో ఇలాంటి రిస్కులకు సిద్ధపడటం మంచిది కాదు. అందుకే అన్నదమ్ములు ఒకే మాట నిలవడం మంచిదే. షూటింగులు నుంచి గత రెండు నెలలుగా బ్రేక్ తీసుకున్న తారక్, కళ్యాణ్ లు పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. ఇలా తాతయ్యకు నేరుగా నివాళి అర్పించే అవకాశాన్ని కోల్పోవడం ఇదే మొదటిసారి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి