iDreamPost

బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగురు మృతి

బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగురు మృతి

ఇటీవల దేశంలో పలు చోట్ల వరుస రైలు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. సాంకేతిక కారణాల కొన్ని అయితే.. మానవ తప్పిదాల వల్ల మరికొన్ని జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన ఒడిశా రైలు ప్రమాదం గుర్తుకు వస్తే ఇప్పటికీ ఉలిక్కి పడతారు. క్షణాల వ్యవధిలో మూడు రైళ్లు ఢీకొని భారీ ప్రమాదం సంభవించింది. ఆ బీభత్సం, బీతావహ పరిస్థితులు ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. ఈ ఘటనలు 300 మంది కన్నుమూశారు. వేల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత దేశ వ్యాప్తంగా పలు చోట్ల రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. బుధవారం రాత్రి బీహార్ లోని బక్సర్ జిల్లాలో రఘునాథ్ పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

బీహార్ లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. దేశ రాజధాని ఢిల్లీ‌లోని 12506 ఆనంద్ విహార్ నుంచి కామాఖ్యకు బయలుదేరిన నార్త్ ఈస్ట్ ఎక్స్ ప్రెస్ కి చెందిన 21 బోగీలు బీహార్ లోని రఘునాథ్‌పూర్ స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పాయి. ఈ దుర్ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందగా.. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం రాత్రి 9.35 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రులకు తరలించారు. కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

బీహార్ లో రైలు ప్రమాదం గురించి తెలిసిన ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాని ఎన్డీఆర్ఎఫ్, ఆరోగ్యశాఖకు సూచించారు. ఈ ఘటనపై కేంద్ర సహాయక మంత్రి అశ్విని కుమార్ చౌబే స్పందించి ఎన్టీఆర్ఎఫ్ సిబ్బందిని అలర్ట్ చేశామని, క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం పాట్నా ఎయిమ్స్ కి తరలిస్తామని అన్నారు. ప్రస్తుతం క్షతగాత్రులను అత్యవసర చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ కి తరలించామని, సహాయక చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయని అన్నారు. అంతేకాదు.. రైలు ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే శాఖ హెల్ప్ లైన్ ని ప్రజలకు అందుబాటులో ఉంచారు. పాట్నా : 9771449971, కమాండ్ కంట్రోల్ : 7759070004, ధన్ పూర్ : 8905697493 నెంబర్లను సంప్రదించి తగు సమాచారం అందుకోవాల్సిందిగా కోరుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి