iDreamPost

ఎఫ్3 కోసం ముందు జాగ్రత్త

ఎఫ్3 కోసం ముందు జాగ్రత్త

ఇష్టారాజ్యంగా టికెట్ రేట్లు పెంచడం కలెక్షన్ల మీద ఎంత ప్రభావం చూపిస్తుందో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ప్రత్యక్షంగా గమనిస్తున్నారు. ఆచార్య, సర్కారు వారి పాటలకు ఆశించిన స్థాయిలో ఫ్యామిలీ ఆడియన్స్ రాకపోవడానికి కారణం కేవలం పెరిగిన ధరలేనని అర్థం కావడంతో రాబోయే సినిమాలకు ముందు జాగ్రత్త పడుతున్నారు. అందులో భాగంగా 27న విడుదల కాబోతున్న ఎఫ్3కి తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పెంపుకి అప్లికేషన్స్ పెట్టకూడదని నిర్మాత దిల్ రాజు నిర్ణయించుకున్నట్టు ఫిలిం నగర్ టాక్. ఆ టైంకి మనసు మారితే చెప్పలేం కానీ నిజంగా కట్టుబడితే మాత్రం కుటుంబ ప్రేక్షకులనే టార్గెట్ చేసిన ఈ ఎంటర్ టైనర్ కి మంచి ఓపెనింగ్స్ ఖాయం.

ఇటీవలే రిలీజైన ట్రైలర్ ఆకట్టుకోవడంతో పాటు ఎఫ్2 కన్నా ఎక్కువ కామెడీ ఇందులో ఉందనే అభిప్రాయం కలిగించడంలో దర్శకుడు అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా వెంకటేష్ టైమింగ్ మరోసారి పర్ఫెక్ట్ గా వాడుకున్న క్లారిటీ అయితే వచ్చింది. సో గత రెండు నెలలుగా జనాలు విసుగెత్తిపోయిన టికెట్ పెంపు నుంచి ఉపశమనం రాబోతుందన్న మాట. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఎఫ్3లో ఫస్ట్ పార్ట్ క్యాస్టింగ్ తో పాటు సునీల్ సోనాలి చౌహన్ లాంటి అదనపు ఆకర్షణలు చాలా ఉన్నాయి. బాగుందనే టాక్ వస్తే చాలు అప్పటికంతా పిల్లల పరీక్షలు ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయి ఉంటాయి కాబట్టి సోలోగా సెలవులను వాడేసుకోవచ్చు.

ఆలస్యంగా అయినా మారుతున్న జనాల ఆలోచనా ధోరణిని పరిశ్రమ గమనిస్తోంది. ప్రతి సినిమాకు అడ్డదిడ్డంగా రేట్లు పెంచుకుంటూ పోవడం బూమరాంగ్ లా రివర్స్ కొడుతోందని అర్థమైపోయింది. ముఖ్యంగా నైజామ్ లో ఈ అఫీషియల్ దోపిడీ పీక్స్ కు వెళ్లిపోయింది. పెద్ద హీరో ఉంటే చాలు బడ్జెట్ తో సంబంధం లేకుండా ఆల్రెడీ ఉన్న గరిష్ట ధర 295 రూపాయలకు తోడు మరో 50 నుంచి 100 దాకా పర్మిషన్లు తెచ్చుకుంటున్నారు. దీని వల్ల మధ్యతరగతి జీవులు థియేటర్ గురించి ఆలోచించడమే మానేశారు. అందుకే ఇప్పుడు ఎఫ్3 కనక నో హైక్ కి సిద్ధపడితే రాబోయే మీడియం బడ్జెట్ సినిమాలకు కొంత ధైర్యం వస్తుంది. చూద్దాం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి