iDreamPost

సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ వేసిన నిర్భయ దోషి

సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ వేసిన నిర్భయ దోషి

2012 లో ఢిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో నలుగురు దోషులపై ఈ నెల 22 ఉదయం 7 గంటలకు తీహార్‌ జైల్లో ఉరి తీయాలని ఢిల్లీలోని పటియాలా హౌజ్‌ కోర్టు డెత్‌ వారెంట్లు జారీ చేసింది. దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ గురువారం సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశారు.

ఇప్పటికే తీహార్ జనవరి 22 న ఉదయం ఏడుగంటలకు నిర్భయ దోషులను ఉరి తీయాలని ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చింది. దీనితో తీహార్ జైలులో నిర్భయ దోషులను ఉరి తీయడానికి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో నిర్భయ నిందితుడు వినయ్ శర్మ తనకు విధించిన మరణ శిక్షపై స్టే కోరుతూ క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

క్యూరేటివ్ పిటిషన్ అంటే…

క్యూరేటివ్ పిటిషన్ అనేది భారత న్యాయ వ్యవస్థలో చాలా కొత్త భావన. శిక్ష ఖరారయిన నిందితులకు తమ శిక్షను పునఃపరిశీలించాల్సిందిగా కోర్టుకు విన్నవించుకునే చివరి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇది సాధారణంగా ఛాంబర్‌లోని న్యాయమూర్తులచే నిర్ణయించబడుతుంది. క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయడానికి కాలపరిమితి లేదు. క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేస్తే ఆ పిటిషన్ ను మొదట ముగ్గురు సీనియర్ న్యాయమూర్తుల బెంచ్‌కు, అందుబాటులో ఉంటే సంబంధిత కేసులో తీర్పును ఇచ్చిన న్యాయమూర్తుల ముందు ప్రవేశపెట్టాలి. ఈ విషయం వాదనలు అవసరమని మెజారిటీ న్యాయమూర్తులు తేల్చినప్పుడే ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తారు. తీర్పును సవరించేందుకు సంబంధిత న్యాయమూర్తులకు అవకాశం ఉంటుంది.

తీర్పు వల్ల మాకు అన్యాయం జరిగిందని రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చడంలో సహజ న్యాయాన్ని పాటించలేదంటూ కోర్టుకు విన్నవించేందుకు క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేస్తారు. అయితే నిందితులు తమ వాదనను బలపరిచే అంశాలను క్యూరేటివ్‌ పిటిషన్‌లో స్పష్టంగా వివరించాల్సి ఉంటుంది. దీనిని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తులు పరిశీలిస్తారు. క్యూరేటివ్‌ పిటిషన్‌‌లో బలమైన కారణాలు లేవని భావిస్తే… దానిని తోసిపుచ్చడంతోపాటు కోర్టు ఖర్చులు చెల్లించాలని కూడా ఆదేశించే అవకాశం ఉంటుంది.

నేనొక బండరాయిని….

ఈ నెల 22 ఉదయం 7 గంటలకు తీహార్‌ జైల్లో ఉరి తీయాలని ఢిల్లీలోని పటియాలా హౌజ్‌ కోర్టు డెత్‌ వారెంట్లు జారీ చేసింది. అయితే డెత్‌ వారెంట్‌ ప్రకటనకు ముందు దోషుల్లో ఒకరైన ముఖేష్‌ సింగ్‌ తల్లి కోర్టు హాల్లోకి ఏడుస్తూ పరిగెత్తుకొచ్చింది. తన బిడ్డపై కరుణ చూపాలని తీర్పు ఇస్తున్న న్యాయమూర్తిని ఆమె కోరింది. అనంతరం నిర్భయ తల్లి వద్దకు వెళ్లి తన కొడుకుపై దయ చూపాలని అభ్యర్థించింది. కానీ నిర్భయ తల్లి స్పందించలేదు.

కాగా నిర్భయ తల్లి మాట్లాడుతూ ఏడేళ్ల క్రితం తన కుమార్తెను రక్తపు మడుగులో చూశానని, తన శరీరంపై ఉన్న గాయాలు క్రూర మృగాలు దాడి చేసినట్లుగా ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. ఏడేళ్లుగా నా కళ్ళ వెంట ఏడ్చి ఏడ్చి రక్తం కారుతుందని, గుండె బండరాయిగా మారిపోయిందని తెలిపారు. ఎవరైనా వచ్చి దయ చూపమని అడిగినా నాపై ఎలాంటి ప్రభావం చూపవని ఏడేళ్లుగా చస్తూ బ్రతుకుతున్నానని నిర్భయ తల్లి స్పష్టం చేసారు.

సుప్రీం కోర్టులో వినయ్ శర్మ దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి