iDreamPost

ఎవర్ గ్రీన్ ఫ్యామిలీ లవ్ క్లాసిక్ ‘నిన్నే పెళ్లాడతా’ – Nostalgia

ఎవర్ గ్రీన్ ఫ్యామిలీ లవ్ క్లాసిక్ ‘నిన్నే పెళ్లాడతా’ – Nostalgia

ఏ భాషకైనా ప్రేమ అనేది ఎవర్ గ్రీన్ సబ్జెక్టు. చెప్పే విధానంలో పరిమితులు ఉన్నప్పటికీ తరాలు ఎన్ని మారినా దర్శకులు ఈ కాన్సెప్ట్ తో ఎప్పటికప్పుడు అద్భుతాలను ఆవిష్కరిస్తూనే ఉన్నారు. అక్కినేని నాగేశ్వరావు లైలా మజ్నుతో మొదలుపెడితే ఇప్పుడు ఆడుతున్న నాగ చైతన్య లవ్ స్టోరీ దాకా లెక్కలేనన్ని ఉదాహరణాలు ప్రత్యక్ష సాక్షాలుగా కనిపిస్తాయి. అయితే ప్రేమకథల్లో అందమైన ఫ్యామిలీ ఎమోషన్స్ ని జొప్పించడం ఒక కళ. ఈ రెండు పర్ఫెక్ట్ గా బ్యాలన్స్ చేయగలిగితే ఎలాంటి అద్భుతాలు చేయొచ్చో సల్మాన్ ఖాన్ హం ఆప్కే హై కౌన్ నిరూపించింది. చుక్క రక్తపాతం లేకుండా, ఒక్క ఫైట్ పెట్టకుండా, కమర్షియల్ ఫార్ములాని పూర్తిగా పక్కనపెట్టేసి సూరజ్ ఆర్ బరజాత్య ఆవిష్కరించిన ఆ దృశ్యకావ్యం సృష్టించిన సంచలనాల గురించి చెప్పుకుంటూ పోతే పుస్తకమే అవుతుంది

అలాంటి ఆణిముత్యాలు మనకూ ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఇవాళ 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న నిన్నే పెళ్లాడతా. గులాబీతో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పరుచుకున్న కృష్ణవంశీకి నాగార్జునతో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని తీయాలని, అవసరం లేని మాస్ కి దూరంగా కొత్తగా ప్రెజెంట్ చేయాలని కోరిక. షారుఖ్ ఖాన్ డిడిఎల్, పైన చెప్పిన హం ఆప్కె హై కౌన్ ప్రభావం ఈయన మీద ప్రభావం చూపించింది. అప్పుడు రాసుకున్న కథే నిన్నే పెళ్లాడతా. చాలా సింపుల్ లైన్. ఇష్టం లేని పెళ్లి చేసుకుందని అన్నయ్యలు ఓ చెల్లిని గెంటేస్తారు. కాలక్రమంలో వెళ్ళిపోయిన ఆ అమ్మాయి కూతురే ఓ కారణం మీద మావయ్యల ఇంటికి వస్తుంది. బావతో అనుకోకుండా ప్రేమలో పడుతుంది. ఏళ్ళుగా దాచుకున్న పగలు బయటికి వస్తాయి. తర్వాత క్లైమాక్స్.

నిజానికిది తెలుగు తెరమీద ఎప్పుడూ రాని కథ కాదు. అది కృష్ణవంశీకీ తెలుసు. కానీ తను కేవలం దాన్ని నమ్ముకోలేదు. స్క్రిప్ట్ మీద దృష్టి పెట్టాడు. రెండున్నర గంటల పాటు నవ్వించాలి, పరవశం కలిగించాలి, మధ్యలో గుండెలు బరువెక్కించాలి, హుషారుగా థియేటర్లో కాలు కదుపుతూ పాటలు ఎంజాయ్ చేయాలి. అంతే. దీన్ని టార్గెట్ గా పెట్టుకుని రచయితలు ఉత్తేజ్, పృథ్వితేజ్ సహాయంతో అవుట్ అవుట్ అండ్ అవుట్ ఫన్ సబ్జెక్టుని సిద్ధం చేసుకున్నారు. రెండు ప్రాణ స్నేహితుల కుటుంబాలు పక్కపక్కనే ఉండటం, ఒకళ్ళంటే మరొకరు ప్రాణమిచ్చేంత బంధం ఏర్పరుచుకోవడం, చిన్న చిన్న కలతలు, అపార్థాలు, మళ్ళీ కలుసుకోవడం ఇలా సింపుల్ ట్రీట్ మెంట్ తో హాయిగా అనిపించే స్క్రీన్ ప్లే సెట్ చేసుకుని మేజిక్ చేయాలని డిసైడ్ అయ్యారు.

నిన్నే పెళ్లాడతాలో క్యాస్టింగ్ ప్రధాన బలం. హీరోయిన్ టబు, లక్ష్మి, చలపతిరావు, చంద్రమోహన్, గిరిబాబు, కవిత, రామప్రభ, బ్రహ్మాజీ, ఆహుతి ప్రసాద్, బెనర్జీ, ఉత్తేజ్, మంజు భార్గవి ఇలా పర్ఫెక్ట్ గా సెట్ చేసుకున్నారు కృష్ణవంశీ. పబ్బులో టబుతో తప్పుగా ప్రవర్తించే చిన్న క్యామియోలో రవితేజ అలా మెరుస్తాడు. సందీప్ చౌతా నభూతో నభవిష్యత్ అనే స్థాయిలో ఎవర్ గ్రీన్ ఆల్బమ్ సిద్ధం చేశారు. సీతారామశాస్త్రి సాహిత్యం కూడా వాటితో పోటీ పడింది. ముఖ్యంగా ఎటో వెళ్లిపోయింది మనసు, కన్నుల్లో నీ రూపమే లాంటి పాటలు దశాబ్దాలు గడిచినా అమృతంలా చెవులకు వీనుల విందు కలిగిస్తాయి. ఉత్తమ తెలుగు సినిమాగా జాతీయ అవార్డు కూడా గెలుచుకుందీ సినిమా. 1996 అక్టోబర్ 3న విడుదలైన ఈ సినిమా వచ్చి అప్పుడే పాతికేళ్ళు అయ్యిందంటే నమ్మశక్యం కావడం కష్టమే

Also Read : బామ్మా మనవడి ఎమోషనల్ సినిమా- Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి