iDreamPost

నిమ్మగడ్డ ఎవరి రక్షణ కోసమో ?

నిమ్మగడ్డ ఎవరి రక్షణ కోసమో ?

బుధవారం రాష్ట్ర రాజకీయాల్లో రెండు కీలకమైన అంశాలు చోటు చేసుకున్నాయి. మొదటిదేమో ఎన్నకల కమీషన్ మాజీ కమీషనర్ నిమ్మగడ్డ పేరుతో కేంద్రహోం శాఖకు వెళ్ళిన లేఖపై విచారణ జరపాలని వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి డిజిపికి ఫిర్యాదు చేయటం. అయితే అనూహ్యంగా రాత్రికి ఎంపి ఫిర్యాదుకు కౌంటర్ గా నిమ్మగడ్డ మాట్లాడుతూ కేంద్రహోంశాఖకు తానే లేఖ రాసినట్లు ప్రకటించటం. విజయసాయిరెడ్డి ఫిర్యాదు సంగతిని పక్కన పెట్టేస్తే నిమ్మగడ్డ హఠాత్తుగా స్పందించటమే అందరినీ ఆశ్చర్యపరిచింది. అందులోను ఇంతకాలం మౌనంగా ఉన్న నిమ్మగడ్డ ఇంత స్పీడుగా ఎందుకు స్పందించాల్సొచ్చింది ? అన్నదే ప్రశ్న.

కరోనా వైరస్ కారణంగా స్ధానిక సంస్ధల ఎన్నికలను అప్పటి ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మార్చి 15వ తేదీన వాయిదా వేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఏకపక్షంగా చేసిన ప్రకటన అప్పట్లో పెద్ద దుమారమే లేపింది. ఆ వివాదం కంటిన్యు అవుతుండగానే అదే రోజు మధ్యాహ్నం నిమ్మగడ్డ పేరుతో కేంద్రహోంశాఖకు ఓ లేఖ అందింది. ఆ లేఖలోని అంశాలు రాష్ట్రప్రభుత్వాన్ని బాగా డ్యామేజ్ చేసేట్లుగా ఉంది. దాంతో మరోసారి రాజకీయంగా దుమారం లేచింది. అయితే ఆ లేఖపై వివరణ కోరేందుకు మీడియా ఎంత ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు.

అయితే ఏఎన్ఐ అనే న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ ఆ లేఖతో తనకు ఏమీ సంబంధం లేదని నిమ్మగడ్డ వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరిగింది. దాంతో లేఖ వివాదం మరింత పెరిగిపోయింది. కొద్ది రోజులు నిమ్మగడ్డ కేంద్రంగా అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది. తర్వాత ఎన్నిరోజులు లేఖ విషయంలో మాట్లాడుదామని మీడియా ప్రయత్నించినా నిమ్మగడ్డ అవకాశం ఇవ్వలేదు.

సరే ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. నిమ్మగడ్డను సాగనంపిన ప్రభుత్వం ఆ స్ధానంలో వి. కనగరాజును నియమించింది. ఇదే విషయమై నిమ్మగడ్డ అండ్ కో కోర్టులో కేసు కూడా వేశారు. కేసు విచారణ కోర్టులో పెండింగ్ లో ఉన్న సమయంలోనే విజయసాయిరెడ్డి డిజిపికి ఫిర్యాదు చేశాడు. నిమ్మగడ్డ పేరుతో కేంద్రహోంశాఖకు వెళ్ళిన లేఖ టిడిపి తయారు చేసిందని ఆరోపించారు. లేఖను టిడిపి నేతలు కనకమేడల రవీంద్రకుమార్, టిడి జనార్ధన్ రావు, వర్ల రామయ్యలు తయారు చేసి నిమ్మగడ్డ సంతకాన్ని పోర్జరీ చేసినట్లు తన ఫిర్యాదులో స్పష్టంగా ఆరోపించాడు.

అయితే ఎవరూ ఊహించని రీతిలో రాత్రి నిమ్మగడ్డ స్పందించాడు. కేంద్రహోంశాఖకు తానే లేఖ రాసినట్లు ప్రకటించాడు. అంటే లేఖ విషయం బయటపడిన నెల రోజుల తర్వాత నిమ్మగడ్డ స్పందించటం గమనార్హం. అందులోను విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేయగానే నిమ్మగడ్డ చాలా స్పీడుగా స్పందించటమే ఆశ్చర్యం. ఇంత హఠాత్తుగా నిమ్మగడ్డ ఎందుకు స్పందించాల్సొచ్చింది అన్నదే ప్రశ్న. పైగా తన పేరుతో కేంద్రానికి వెళ్ళిన లేఖపై ఫిర్యాదు చేయమని మంత్రులు, వైసిపి నేతలు ఎంతమంది నిమ్మగడ్డను అడిగినా పట్టించుకోలేదు.

అలాంటిది కమీషనర్ స్దానం నుండి బయటకు వెళ్ళిన వెంటనే, ఎంపి ఫిర్యాదు చేసిన రోజే లేఖను తానే రాసినట్లు ప్రకటించటమంటే టిడిపికి మద్దతుగానే రంగంలోకి దిగినట్లుంది. లేఖ రాసిన వాళ్ళని, రాయించిన వాళ్ళని కాపాడాలనే ప్రకటన చేసినట్లు అందరూ అనుమానిస్తున్నారు. మరి ఎంపి ఫిర్యాదు మీద విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయి కదా చూద్దాం ఏం జరుగుతుందో.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి