iDreamPost

అయితే రాద్ధాంతం ఎందుకు రమేష్ గారు ..?

అయితే రాద్ధాంతం ఎందుకు రమేష్ గారు ..?

ప్రభుత్వంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేసి, అనంతరం దాదాపు నెల రోజులు పట్టించుకోకపోవడంపై ఏపీ హైకోర్టు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను ఉద్దేశించి ఓ ఆసక్తికర వ్యాఖ్య చేసింది. ప్రచారం కోసమే నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఇలా చేస్తున్నట్లుగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నాడు కోర్టు వేసిన అంచనాలు నిజమని తేలుతున్నాయి. అనవసరమైన వివాదాలు సృష్టించడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఒక అంశంపై రాద్ధాంతం చేసి మీడియాలో ప్రముఖంగా కనిపించడమే నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తాజాగా పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏకగ్రీవాలపై ఆయన మాట్లాడిన తీరును బట్టి తెలుస్తోంది.

‘‘పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. 13,097 పంచాయతీలలో 2,197 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇవి 16.77 శాతం. 2013లోనూ 15.54 శాతం పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అప్పుడు 12,740 పంచాయతీలకు గాను 1,980 పంచాయతీలు ఏక్రగవమయ్యాయి. అప్పటి ఎన్నికలతో పోల్చి చూస్తే ఏకగ్రీవాలు దాదాపు అదేలా ఉన్నాయ’’ని ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ సోమవారం మీడియాతో మాట్లాడుతూ విశ్లేషించారు.

ఏకగ్రీవాలపై ఇప్పుడు ఇలా మాట్లాడుతున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. ఎన్నికల ప్రారంభ సమయంలో చేసిన రాద్ధాంతం చెప్పలనవి కాదు. ఏకగ్రీవాలైన పంచాయతీలకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలతో పత్రికల్లో ప్రకటనలు వస్తే.. దానిపై నానా యాగీ చేశారు. సమాచార శాఖ ఉన్నతాధికారులకు నోటీసులు పంపారు. ఏకగ్రీవాలు జరగడం నేరం అన్నట్లుగా మాట్లాడారు. ఏకగ్రీవాలు జరిగే అది అధికారులు వైఫల్యమేనంటూ కొత్త భాస్యం చెప్పారు. ప్రతి జిల్లా తిరిగి.. మీడియా సమావేశాల్లో మాట్లాడారు. ప్రతి జిల్లాలోనూ ఏకగ్రీవాలు వద్దనేలా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మాట్లాడారు. నామినేషన్లు వేయండి, గొడవలు జరిగినా మళ్లీ సర్దుకుంటాయి, పోటీ అయితే జరగాలంటూ ఉపదేశాలు ఇచ్చారు. ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వానిది తప్పు అనేలా నిమ్మగడ్డ నాడు వ్యవహరించారు. తొలి దశలో చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా ఏకగ్రీవాలు అయ్యాయంటూ వాటిని తాత్కాలికంగా నిలిపివేశారు. కలెక్టర్ల నుంచి నివేదికలు కోరారు.

నాడు ఇంత యాగీ చేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. ఏకగ్రీవాలు నాడు, నేడు దాదాపు ఒకేలా ఉన్నాయంటూ ప్రవచనాలు బోధిస్తున్నారు. ఇలా మాట్లాడుతున్న నిమ్మగడ్డ.. నాడు ఏకగ్రీవాలపై రాద్ధాంతం ఎందుకు చేశారన్నదే సందేహం. తద్వారా ఏమి సాధించారనేదే ప్రశ్న. ఏపీ హైకోర్టు అన్నట్లుగా ప్రచారం కోసం, మీడియాలో పబ్లిసిటీ కోసమే చేశారా..? పరిస్థితులు అలానే ఉన్నాయి. 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికలు సాధారణ ఎన్నికలకు ఏడాది ముందు జరిగాయి. అప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉంది. టీడీపీ, వైసీపీ బలీయమైన స్థానాల్లో ఉన్నాయి. చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారు. అలాంటి ప్రత్యేక పరిస్థితులు ఉన్న సమయంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు 15.54 శాతం. నాడు అన్ని పార్టీలు బలపర్చిన అభ్యర్థులు తమకు బలమున్న స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. దాదాపు రెండేళ్ల పాలన పూర్తి చేసుకోబోతోంది. సీఎం వైఎస్‌ జగన్‌ విప్లవాత్మక పాలన, సంక్షేమ పథకాలుతో వైసీపీ వైపే ప్రజలు మొగ్గు చూపుతారు. అయినా కూడా ఏకగ్రీవాలు 16.77 శాతమే. ఇందులో వైసీపీతోపాటు టీడీపీ మద్ధతుదారులు ఏకగ్రీవంగా గెలుచుకున్న పంచాయతీలు ఉన్నాయి. స్వతంత్రులు కొన్ని పంచాయతీల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రభుత్వం ఏదైనా, ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తమ గ్రామ అభివృద్ధి గురించే ఆలోచిస్తారని ఈ గణాంకాలు, పరిణామాలతో స్పష్టమవుతోంది. పార్టీలు, వివాదాలకు వీలైనంత దూరంగా ఉంటూ గ్రామ అభివృద్ధే ధ్యేయంగా నిర్ణయాలు తీసుకుంటారని అర్థమైంది. ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ అనవసరమైన రాద్ధాంతం చేసి, మీడియాలో హల్‌చల్‌ చేశారని తేలిపోయింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి