iDreamPost

క‌రోనా వేళ వెల్లివిరిస్తున్న మ‌నిషిత‌త్వం..

క‌రోనా వేళ వెల్లివిరిస్తున్న మ‌నిషిత‌త్వం..

క‌రోనా మ‌హ‌మ్మారి క‌ర‌ళానృత్యం చేస్తున్న వేళ వ్య‌వ‌స్థ అల్ల‌క‌ల్లోలంగా మారింది. విశ్వ‌మంతా ఓ కొద్ది ప్రాంతాలో మిన‌హాయించి విలవిల్లాడుతోంది. అదే స‌మ‌యంలో అనేక చోట్ల మాన‌వ‌త్వం వెల్లివిరుస్తోంది. ఆపన్న హ‌స్తం అందించేందుకు అనేక మంది ముందుకొస్తున్నారు. మ‌న‌దేశంలో కొంద‌రు మతోన్మాద పోక‌డ‌లు పెంచేందుకు ప్ర‌యత్నిస్తున్న స‌మ‌యంలో పెద్ద సంఖ్య‌లో మాన‌వ‌త్వం ప్ర‌ద‌ర్శిస్తున్న తీరు విశేషంగానే చూడాలి. వివిధ రూపాల్లో స‌హాయం అందించేందుకు సిద్ధ‌మ‌వుతున్న అనేక మందిని అభినందించ‌క త‌ప్ప‌దు.

ఓవైపు వ్య‌వ‌స్థ స్తంభించడంతో రాక‌పోక‌లు కూడా లేక వ‌ల‌స కూలీలు ప‌డుతున్న అవ‌స్థ‌లు అన్నీ ఇన్నీ కావు. ఎక్క‌డివారు అక్క‌డే నిలిచిపోవ‌డంతో వారికి త‌గిన వ‌స‌తి, ఆహారం అందించ‌డం కూడా స‌మ‌స్య‌గానే ఉంది. అందులోనూ అనూహ్యంగా లాక్ డౌన్ తెర‌మీద‌కు రావ‌డంతో ప్ర‌భుత్వాలు కూడా దానికి త‌గ్గ‌ట్టుగా స‌న్నాహాలు చేయ‌లేని స్థితిలో ఉన్నాయి. అలాంటి ప‌రిస్థితుల్లో స‌మూహాలు ముందుకొస్తున్న తీరు ఆశావాహ‌క ప‌రిస్థితిని చాటుతోంది. ఆహారం అందించ‌డ‌మే కాకుండా అనేక మందికి వివిధ రూపాల్లో సాయం అందిస్తున్న ఆప‌న్న‌హ‌స్తాలు ఆద‌ర్శ‌నీయంగా మారుతున్నాయి.

ఎన్జీవోల‌తో పాటుగా వ్య‌క్తులు కూడా సిద్ధ‌ప‌డుతున్నారు. ముక్కూ, మొఖం తెలియ‌ని వారికి ముందుకొచ్చి చేదోడుగా నిలుస్తున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇలాంటి అనేక అనుభ‌వాలున్న‌ప్ప‌టికీ మ‌న‌దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో క‌నిపిస్తున్న మాన‌వ‌త్వ‌పు ఛాయ‌లు మంచి సూచిక‌గా భావించాలి. విప‌త్తు వేళ ఊపిరిస‌ల‌ప‌నంత స‌మ‌స్య‌ల్లో ఉన్న వారికి ఉప‌శ‌మ‌నం క‌ల్పించే ఈ ధోర‌ణి మ‌న స‌మాజ‌పు విలువ‌ల‌ను చాటుతోంది. లాక్ డౌన్ పొడిగించినా లేకున్నా, భ‌విష్య‌త్ లో మ‌రిన్ని స‌మ‌స్య‌లు త‌ప్ప‌వ‌నే సంకేతాలు వ్య‌క్త‌మ‌వుతున్న త‌రుణంలో ల‌క్ష‌ల మంది ముందుకొచ్చి తోడ్ప‌డుతున్న తీరు ఎలాంటి ప‌రిస్థితి నుంచి అయినా గ‌ట్టెక్కగ‌ల‌మ‌నే ధీమా ఇస్తోంది.

ఇలాంటి విష‌యాల్లో కేవ‌లం అభాగ్యుల‌కే కాకుండా మూగ‌జీవాల‌కు కూడా అనేక చోట్ల ఆహారం, తాగునీరు అందించే ఏర్పాట్లు చేసేందుకు కొంర‌దు ముందుకొస్తున్న తీరు విశేషంగా క‌నిపిస్తోంది. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో క‌నీసం ప్లాస్టిక్ క‌వ‌ర్లు కూడా ల‌భించ‌క విల‌విల్లాడుతున్న ఆవులు, తిండిలేక త‌ల్ల‌డిల్లుతున్న కుక్క‌లు, కోతులు స‌హా ఇత‌ర మూగ‌జీవాల‌కు కూడా మాన‌వ‌త్వం పంచుతున్న తీరు ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆవ‌శ్య‌కం. అందుకు త‌గ్గ‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారి మ‌న‌స్సుల‌కు అభినంద‌నం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి