iDreamPost
android-app
ios-app

ఒక తరం భవిష్యత్తును మార్చిన వైఎస్సార్ .. ఒక విద్యార్థి మనోగతం

ఒక తరం భవిష్యత్తును మార్చిన వైఎస్సార్ .. ఒక విద్యార్థి మనోగతం

అప్పటికి రెండ్రోజులైంది అతను కనిపించకుండా పోయి. టీవీలలో పేపర్లలో ఎక్కడ చూసినా అతని వార్తలే. కాలేజీలో మరో రెండ్రోజుల్లో జరగబోయే టీచర్స్ డే ని ఈ సారి కాస్త వినోదాత్మకంగా జరిపించాలని, లెక్చరర్లని వాళ్ళ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లాలని బలంగా నిర్ణయించుకుని ఆ దిశగా ప్లాన్లు వేస్తున్నాం.

కానీ.. అతను కనపడకుండా పోయిన వార్త వల్ల ఇవన్నీ జరిగేలా లేవు. లెక్చరర్లంతా క్లాసులు చెప్పే మూడ్ లేనట్టు మమ్మల్నందరినీ ల్యాబుల్లోకి పంపేసారు. సీనియరు జూనియరూ అని లేదు. కాలేజీ మొత్తం కంప్యూటరు ల్యాబులో ఉండి సంతలా ఉంది. టీచర్స్ డే జరగడానికి అయినా ఆయన దొరికితే బాగుండును అనుకున్నా. ఎందుకంటే టీచర్స్ డే ఘనంగా చేయాలని చాలా ప్లాన్స్ వేసుకుని ఉన్నా..

అప్పటికి రెండేళ్ళుగా వైఎస్సార్ వల్ల లాభ పడి ఉన్నా కూడా… అప్పట్లో నా రక్తం పసుపుగా ఉండేది. నేను చదివిన కాలేజీలో అయితే… స్టాఫూ, మేనేజుమెంటు రక్తం కూడా చిక్కని పసుపే. కంచుకోట వంటి ఊరు అది. కాబట్టి పెద్దగా ఫీలవలేదు అప్పటి వరకూ.

రెండ్రోజుల నుండి వద్దామా వద్దా అనుకున్న మబ్బులన్నీ ఆకాశంలో దిగాయి ఆ రోజే. హోరున గాలి కూడా తోడవడంతో… కరెంటు కూడా నిలిపేసారు. అక్కడ దొరికారని, చెంచులు కాపాడారని, అంత ఈజీగా మిస్సయిపోవడానికి సీయం ఏమీ మామూలు మనిషి కాదని, ఇంకా మంచి చేయడానికి వస్తాడని ఇలా ఏవేలో గుసగుసలు. ఒకటే కల్లోలంగా ఉంది వాతావరణం. అందరి మనసులూ కూడా.

Also Read:వైఎస్‌కు ముందు… వైఎస్‌కు తర్వాత.. ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రాంతం

Nokia 6600 స్మార్ట్ ఫోనుగా చలామణీ అయ్యిన ఆ రోజుల్లో ఇన్ఫర్మేషన్ ఇంత త్వరగా తెలిసేది కాదు. టీవీ నైన్ వాడే అప్పట్లో హోల్ అండ్ సోల్ బ్రేకింగ్ న్యూస్ మెటీరియల్ అన్నమాట. గోల గోలగా ఉన్న ల్యాబులో ఎవ్వడి పనిలో వాడు ఉంటుండగా… స్టాఫ్ రూం టీవీలో చూసిన వార్త పట్టుకుని పైకొచ్చిన మా మేడమ్ ల్యాబ్ డోర్ మీద గట్టిగా కొట్టి చేసి అనౌన్సుమెంట్…. “స్టూడెంట్స్ హీ ఈజ్ నో మోర్. డెడ్ బాడీ ఫౌండ్ సమ్‌టైమ్ బ్యాక్”. “YSR చనిపోయారు” తర్వాత తెలుగులో చెప్పారు. అంతే.

గోలగా ఉన్న ల్యాబు మొత్తం సైలెంటు అయిపోయింది. ఎక్స్‌పెక్ట్ చేసిన న్యూసే. కానీ… ఇంత షాకింగ్ గా ఉంటుందని అనుకోలేదు. అంత నిశ్శబ్దం నుంచి మెల్లగా కీచుమంటున్న శబ్దం వైపు అందరం చూసాం. ఒకమ్మాయి ఏడుస్తుంది. ఓదార్చుతున్న వాళ్ళతో తను పదే పదే చెప్పిన మాట “ఆయన వల్లే నేనూ మా తమ్ముడూ చదువుకోగలగుతున్నాం మేడమ్” అని. ఒక్కరి నుండి మొదలై… పది పదిహేను మంది వరకూ పాడిన ఏడుపు పాట అది. మొదటి సారి నాకు అప్పుడే అనిపించింది “నిజమే కదా” అని. హడావుడిగా నిర్వహించిన నివాళి కార్యక్రమంలో “అందరం కలిసి ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం” అనేది వట్టి మాటే అయింది. ఆ నిమిషంలో వినబడిన వెక్కిళ్ళు, చీదుళ్ళూ ఇంకా గుర్తున్నాయి. ఏ సంతాప సభలోనూ తర్వాత నేను అలా వినలేదు. ఎన్ని రోజులు సంతాప దినాలు పాటిస్తారో కూడా తెలియదు కనుక అప్పటికప్పుడు కాలేజీకి సెలవులు ప్రకటించేసారు.

హోరుమన్న గాలులు వీస్తుండగా… వాన మొదలవుతుండగా కిక్కిరిసిన ఆర్టీసీ బస్సుల్లో ఖాళీ లేక ఆటోలు పట్టుకుని ఇంటికి చేరాం. మధ్యాహ్నం మూడు అవకుండానే రోడ్లన్నీ వెలవెలబోయాయి. ఆ తర్వాత నాలుగు రోజులూ రాష్ట్రం శోకసంద్రంగా మారింది. సాక్షి ఛానెల్ కొద్దిగా ఎక్కువ చేసి చూపించినా… అది నిజమే.

Also Read:వైఎస్సార్ – ఒక జర్నలిస్ట్ జ్ఞాపకం

ఆయన చేసిన మిగిలిన పనుల గురించి పెద్ద అవగాహన లేకపోయినా… “ఫీజు రీయింబర్స్మెంట్” మాత్రం అవుటాఫ్ స్టేడియం కొట్టిన బంతి వంటి ఆలోచన. సూపర్ హిట్. నా స్నేహితుల్లో డబ్బు తక్కువగా ఉన్న ఓసీ కేటగిరీ వారి మొహాల్లో నవ్వుని చూసాన్నేను ఆ రెండేళ్ళూ. అవకాశం దొరికినపుడు ఉపయోగించుకుని బాగుపడటం మన కర్తవ్యం. అలా కాకుండా దుర్వినియోగం చేసుకున్న వారిని పోలిస్తే నేనేం చెప్పలేను. నాతో… నా తర్వాత ఈ పథకాన్ని ఉపయోగించుకుని‌, చదువుకుని ఇప్పుడు ఎనిమిదేళ్ళుగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ లక్షలు సంపాదిస్తున్న వారు తెలుసు. నా లిస్టులో ఉన్నారు కూడా. అందుకే జోహార్‌వైయస్సార్.